Gangula Kamalakar: దరఖాస్తుదారులు కలవాల్సిన అవసరం లేదు.. రూ.లక్ష సాయంపై కీలక ప్రకటన

TS Bc 1 lakh Scheme In Telangana: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అందజేస్తున్న వెనుకబడిన వర్గాల కులవృత్తులకు లక్ష రూపాయల ఆర్థిక సహాయం కోసం ఇప్పటివరకూ దాదాపు 53 వేలు దరఖాస్తులు ఆన్లైన్‌లో నమోదైనట్లు రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ పేర్కొన్నారు.

Gangula Kamalakar: దరఖాస్తుదారులు కలవాల్సిన అవసరం లేదు.. రూ.లక్ష సాయంపై కీలక ప్రకటన
Gangula Kamalakar

Updated on: Jun 12, 2023 | 6:04 PM

TS Bc 1 lakh Scheme In Telangana: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అందజేస్తున్న వెనుకబడిన వర్గాల కులవృత్తులకు లక్ష రూపాయల ఆర్థిక సహాయం కోసం ఇప్పటివరకూ దాదాపు 53 వేలు దరఖాస్తులు ఆన్లైన్‌లో నమోదైనట్లు రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ పేర్కొన్నారు. బీసీ వృత్తి పనివారికి ప్రభుత్వం అందించనున్న ఆర్థిక సాయంపై సోమవారం బీసీ సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి బుర్రావెంకటేశం ఇతర ఉన్నతాధికారులతో సచివాలయంలో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. కులవృత్తులకు ఘన వైభవం తీసుకొచ్చి వారి జీవితాలను మెరుగుపర్చేందుకు సీఎం కేసీఆర్ సంకల్పించారని, వారి కులవృత్తికి ఉపయోగపడే ముడిసరుకు, పనిముట్లు కొనుగోలు చేసేందుకు గానూ ఎలాంటి బ్యాంకు లింకేజీ లేకుండా, తిరిగి చెల్లించే అవసరం లేకుండా లక్ష రూపాయల సహాయం ప్రభుత్వం చేస్తుందన్నారు.

ఈనెల 20 వరకూ పథకానికి సంపూర్ణంగా ఆన్లైన్ ద్వారానే https://tsobmms.cgg.gov.in/ వెబ్సైట్లో అప్లై చేసుకోవాలని దరఖాస్తుదారులకు సూచించారు. ఎట్టిపరిస్థితుల్లోనూ ఎవరినీ ప్రత్యక్షంగా కలువాల్సిన అవసరం లేదన్న మంత్రి, ఆదాయ పత్రాలు సైతం 2021 ఎప్రిల్ నుండి జారీ చేసినవి చెల్లుబాటవుతాయన్నారు. జిల్లా కలెక్టర్లు సైతం అవసరార్థుల ఇన్‌కమ్ సర్టిఫికెట్ల జారీపై ప్రత్యేక శ్రద్ద వహించాలని సూచించారు. దరఖాస్తుదారులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. చాలా సరళంగా ఉన్న అప్లికేషన్ ఫారంను దరఖాస్తుదారులు తమ స్మార్ట్ ఫోన్ల నుంచి కూడా సమర్పించవచ్చని సూచించారు.

బీసీ హాస్టళ్ల అడ్మిషన్లకు https://bchostels.cgg.gov.in వెబ్‌సైట్ ను లాంచ్ చేసిన మంత్రి గంగుల కమలాకర్

ఇవి కూడా చదవండి

రాష్ట్రంలోని 703 బీసీ ప్రీమెట్రిక్, పోస్ట్ మెట్రిక్ హాస్టళ్లలోని సీట్లను ఇకనుండి సంపూర్ణంగా ఆన్లైన్ ద్వారానే భర్తీ చేస్తామన్నారు మంత్రి గంగుల కమలాకర్. ఇందుకు సంబందించిన వెబ్సైట్ https://bchostels.cgg.gov.in సచివాలయంలో నేడు అధికారికంగా లాంచ్ చేసారు. ఈ విద్యా సంవత్సరం నుండే దీన్ని అందుబాటులోకి తెచ్చామన్నారు. వెబ్సైట్లో సూచించిన ఆన్లైన్ అడ్మిషన్ ఫామ్ నింపి దరఖాస్తు సమర్పించగానే ఎవరి ప్రమేయం లేకుండా వివరాలు వెరిఫికేషన్ చేసుకొని ప్రవేశానికి అవకాశం ఏర్పడుతుందని మంత్రి గంగుల పేర్కొన్నారు.

ఈ సమీక్షలో బీసీ సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి బుర్రావెంకటేశం, టాడీ టాపర్స్ కార్పోరేషన్ ఛైర్మన్ పల్లె రవి, బీసీ సంక్షేమ శాఖ డీడీ సంధ్య ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం..