
రూ.2వేల నోట్లను రద్దు చేస్తూ ఆర్బీఐ సంచలన నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఈ ఆర్బీఐ తీసుకున్న ఈ నిర్ణయంపై మంత్రి జగదీష్ రెడ్డి, అసదుద్దీన్ ఓవైసీ వేర్వేరుగా స్పందించారు. శనివారం మీడియాతో మాట్లాడిన మంత్రి జగదీశ్ రెడ్డి.. రూ.2 వేల నోట్ల ఉపసంహరణ బీజేపీ పతనానికి నాంది అంటూ ఘాటుగా స్పందించారు. ఉపసంహరణ నిర్ణయాన్ని మోదీ ప్రభుత్వ తిరోగమన చర్యగా అభివర్ణించారు. ఉపయోగంలేని రూ.2 వేల నోటు ఎందుకు తెచ్చారు.. ఎందుకు రద్దు చేస్తున్నారంటూ ప్రశ్నించారు. ఇప్పటి వరకు ఎంత నల్లధనం వెలికితీశారని నిలదీశారు. నోట్ల ఉపసంహరణతో లాభం ఉంటే ఎందుకు ప్రచారం చేయడం లేదని ప్రశ్నించారు మంత్రి జగదీష్‌రెడ్డి. రూ.2 వేల నోట్ల రద్దు.. దేశ అభివృద్ధిని అడ్డుకోవడమేనని.. పెట్టుబడిదారుల రహస్య అజెండాలో భాగమే ఈ రద్దు అంటూ విమర్శించారు. దేశ పరిపాలన ప్రజల కోసం కాకుండా.. కొంత మంది వ్యక్తుల కోసమే జరుగుతుందని.. ఫ్యూడల్ ఆలోచనలో భాగంగానే నోట్లను రద్దు చేశారంటూ మంత్రి జగదీశ్ రెడ్డి మండిపడ్డారు. మహారాష్ట్రలో బీఆర్ఎస్ ప్రభంజనం మొదలైందని.. ఢిల్లీ వరకు ఇదే ప్రభంజనం కొనసాగుతుందని ధీమా వ్యక్తంచేశారు.
కాగా.. రూ.రెండు వేల నోట్ల రద్దుపై ఎఐఎంఐఎం అధినేత, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ స్పందించారు. రద్దు చేసేవారు.. అసలు రూ.2 వేల నోట్లు ఎందుకు తెచ్చినట్టు అంటూ ప్రశ్నలు సంధించారు. రూ.500 నోట్లు కూడా త్వరలోనే వాపస్ తీసుకుంటారా..? అంటూ విమర్శించారు. 70 కోట్ల మంది భారతీయుల దగ్గర స్మార్ట్‌ఫోన్లు లేవు.. డిజిటల్ పేమెంట్లు అందరికీ ఎలా సాధ్యం అంటూ ప్రశ్నించారు. ఎన్‌పీసీఐను చైనా హ్యాక్ చేసిందన్న వార్తల్లో నిజమెంత..? అంటూ కేంద్రానికి ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ సూటిప్రశ్నలు సంధించారు. ది కేరళ స్టోరీ సినిమాలో 32 వేలమంది మహిళలు ఉగ్రవాదులుగా మారినట్లు చూపడం దారుణమంటూ విమర్శించారు. వాస్తవాలు చూపించకుండా.. అవాస్తవాలు చూపించారంటూ మండిపడ్డారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం..