Medaram Jatara 2023: మేడారం మిని జాతరకు ముహూర్తం ఖరారు.. ఎప్పటినుంచంటే..?

భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు తగిన ఏర్పాట్లు చేస్తున్నారు. ఇక‌.. ప్రతి రెండేళ్లకోసారి మేడారం మహా జాతర అంగ‌రంగ వైభ‌వంగా జ‌రుగుతుంది.

Medaram Jatara 2023: మేడారం మిని జాతరకు ముహూర్తం ఖరారు.. ఎప్పటినుంచంటే..?
Meadaram Jathara

Updated on: Nov 30, 2022 | 10:56 AM

ఆసియా ఖండంలోనే అతిపెద్ద గిరిజన జాతర మేడారం సమ్మక్క, సారలమ్మ జాతర.. ములుగు జిల్లాలో జరిగే మేడారం జాతరకు దేశ నలుమూలల నుంచే కాకుండా విదేశాల నుంచి కూడా భక్తులు తరలివస్తుంటారు. అందుకే ఈ జాతరకు తెలంగాణ కుంభమేళా అనే పేరుకూడా ప్రసిద్ధి. జిల్లాలోని తాడ్వాయి మండలంలోని మేడారం గ్రామంలో ఈ మహా జాతర జరుగుతుంది. జాతర సమయంలో వనదేవతలు సమ్మక్క-సారలమ్మను పూజించేందుకు లక్షలాది భక్తులు తరలివస్తారు. రెండేళ్లకోకసారి మేడారం మహాజాతరను నిర్వహిస్తారు. అయితే మధ్యలో ఏడాది మినీ మేడారం జాతరను నిర్వహిస్తుంటారు. వచ్చే ఏడాది జరగనున్న మేడారం మినీ జాతరకు సంబంధించిన తేదీలను మేడారం సమ్మక్క, సారలమ్మ జాతర పూజారుల సంఘం ప్రకటించింది.

ఈ మేరకు మేడారం పూజారుల సంఘం అధ్యక్షుడు సిద్ధబోయిన జగ్గారావు అధ్యక్షతన ప్రత్యేక సమావేశం నిర్వహించారు.  వచ్చే ఫిబ్రవరి మాఘమాసంలో నిర్వహించే మేడారం జాతర పండగ తేదీలు, ఏర్పాట్లపై ఈ సమావేశంలో చర్చించారు. ఈ సందర్భంగా మండ మెలిగే మినీ మేడారం జాతర తేదీల విషయంలో ఒక నిర్ణయానికి వచ్చిన మేడారం ఈవో, పూజారుల సంఘం.. ఆ వివరాలను వెల్లడించారు. వచ్చే ఏడాది ఫిబ్రవరి 1వ తేదీ నుంచి 4 వరకు మినీ జాతర నిర్వహిస్తున్నట్లు పూజారులు తెలిపారు.

ఫిబ్రవరి 1న మండమెలిగే పండుగ నిర్వహించ‌నున్నారు. 2వ తేదీన సారలమ్మ అమ్మవారి గ‌ద్దె, 3వ తేదీన సమ్మక్క గద్దె శుద్ధి చేసి సమ్మక్క – సారలమ్మలకు భక్తులు మొక్కులు సమర్పించుకునేందుకు అనుమతిస్తామని చెప్పారు. మినీ మేడారం జాతరలో అమ్మవార్లను గద్దెలపైకి తీసుకురారు. కానీ, గద్దెల వద్ద పూజారులు ప్రత్యేక పూజలు చేస్తారు. భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు తగిన ఏర్పాట్లు చేస్తున్నారు. ఇక‌.. ప్రతి రెండేళ్లకోసారి మేడారం మహా జాతర అంగ‌రంగ వైభ‌వంగా జ‌రుగుతుంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి