
రాజకీయల్లోకి రావాలి అంటే ఒకప్పుడు అనుభవం, అంగబలం, అర్థబలం ఉన్నవారే వస్తారు అనే భావన ఉండేది. కానీ ఇప్పుడు ట్రెండ్ మారింది. ఎన్నికలు ఏవీ అయిన సరే యువత బరిలో నిలిచి గెలుస్తున్నారు. మొన్న సర్పంచ్ ఎన్నికల్లో కూడా చాలా చోట్ల యువత పోటీ చేసి గెలిచి తమ సత్తా చూపించారు. కాగా ప్రస్తుతం జరుగుతున్న మున్సిపల్ ఎన్నికల్లో కూడా పెద్ద ఎత్తున్న యువత పోటీలో ఉంటున్నారు. పీజీలు, పీహెచ్‌డీలు చేసిన వారు.. విదేశాల్లో లక్షల జీతాలు వద్దు అనుకుని సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లు.. ప్రజలకు సేవ చేయాలనే తపనతో వార్డు కౌన్సిలర్లుగా పోటీకి సై అంటున్నారు. తాజాగా మెదక్ జిల్లా రామాయంపేట మున్సిపాలిటీ పరిధిలో ఎంబీఏ చదివిన విద్యార్థిని ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు..
రామాయంపేట మున్సిపాలిటీలోని 5వ వార్డు బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా చౌదరి సుచరిత పోటీలో నిలిచారు. యువత ద్వారానే అభివృద్ధి సాధ్యమవుతుందని తాను రాజకీయాల్లోకి వచ్చినట్లు ఆమె తెలిపారు. తన తండ్రి చౌదరి సుప్రభాత్ చేసిన సేవలు, అభివృద్ధి కార్యక్రమాలను వివరిస్తూ తనకు ఓటు వేసి గెలిపించాలని ఓటర్లకు విజ్ఞప్తి చేస్తున్నారు. ప్రతి ఇంటికి వెళ్లి మహిళలకు బొట్టుపెట్టి మరి ఓట్లను అభ్యర్థిస్తున్నారు. యువత రాజకీయాల్లోకి రావాలని మున్సిపాలిటీ అభివృద్ధికి కృషి చేయాలని ఆమె పిలుపునిచ్చారు. కానీ డబ్బు, మద్యం ప్రభావం ఉండే స్థానిక ఎన్నికల్లో ఈ చదువుకున్న యువత ఎంతవరకు సక్సెస్ అవుతారో చూడాలి. ఓటర్లు కూడా పాత పద్ధతుల్లోనే ఓట్లు వేస్తారా లేక ఇలా బాగా చదువుకున్న యువతకు అవకాశం ఇచ్చి కొత్త మార్పుకు శ్రీకారం చుడతారా అనేది ఆసక్తికరంగా మారింది.