
ఇంటి అప్పు తీర్చలేక బలవన్మరణానికి పాల్పడింది ఓ ఇల్లాలు. గుమ్మం ముందు ఫైనాన్స్ ప్రతినిధుల అవమానాలు తట్టుకోలేక తీవ్ర మనస్థాపానికి గురైంది. దీనికి తోడు అప్పు తీర్చే అంశంలో కుటుంబ సహకారం లేదన్న బాధ తోడైంది. దీంతో పురుగుల మంది తాగి ఆత్మహత్య చేసుకుంది ఓ ఇల్లాలు. జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలో జరిగిన ఘటన స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది.
గద్వాల మున్సిపాలిటీ పరిధిలోని దౌదర్‌పల్లి కాలనీకి చెందిన దౌలమ్మ తన తమ్ముడు రామాంజనేయులుకు పెద్ద కూతురు ఇందును ఇచ్చి 2017లో వివాహం జరిపించింది. అమ్మమ్మ, తాతల వద్దే భర్తతో కలిసి ఉంటోంది. రామాంజనేయులు – ఇందు దంపతులకు ఇద్దరు మగ బిడ్డల సంతానం. అయితే గతేడాది నూతనంగా ఇళ్లు నిర్మించుకున్నారు. ఇందుకోసం అక్కడ ఇక్కడ అప్పులు చేశారు. ఆ అప్పులే ఇల్లాలు ఇందు పాలిట మృత్యు పాశాలయ్యాయి.
ఓ ప్రైవేటు ఫైనాన్స్‌లో ఇంటి కోసం సుమారు 3లక్షల 50వేల రూపాయలు అప్పు తెచ్చారు. నెలకు రూ.8,600 వాయిదా చెల్లిస్తున్నారు. దీనికి తోడు తెలిసిన వారి దగ్గర సైతం కొంత మొత్తంలో అప్పులు చేసి ఇళ్లు నిర్మించారు. రోజు కూలీ పనికి వెళ్తూ.. నెల నెల వాయిదాలు కట్టడం ఆమె బాధ్యతగా మారింది. భర్త, అమ్మమ్మ, తాత ఎవ్వరూ అప్పు చెల్లింపు అంశంలో ముందుకు రాలేదు. ఎవరూ ఏ పని చేయకుండా ఉండడంతో నెలవారి వాయిదాలు చెల్లించడం ఆమెకు భారంగా మారింది. పైసా పైసా కూడబెడుతూ.. అటు కుటుంబ పోషణ, ఇటు అప్పులు చెల్లిస్తూ వస్తోంది ఇందు.
ఈ క్రమంలో పలుమార్లు ప్రైవేట్ ఫైనాన్స్‌కు కట్టాల్సిన వాయిదా ఆలస్యం అవుతూ వచ్చింది. అయితే ఆ కంపెనీ ప్రతినిధులు తరచూ ఇంటి గుమ్మం వద్దకు రావడం… నిలదీయడంతో ఇందు మనస్థాపానికి గురైంది. అటూ ఫైనాన్స్ కంపెనీ ప్రతినిధుల వేధింపులతో పాటు ఇటు కుటుంబ సభ్యుల నిర్లక్ష్యం తోడైంది. ఇంటి పరువు పోతున్న కుటుంబ సభ్యులు ఎవరు బాధ్యత తీసుకోవడం లేదని మనోవేదన చెందింది. తీవ్ర మనస్థాపంతో మార్చి 16వ తేదీన మధ్యాహ్నం ఆత్మహత్య యత్నం చేసింది. పిల్లలను జాగ్రత్తగా చూసుకోమని బంధువులకు ఫోన్ లో తెలిపి గడ్డి మందు తాగేసింది.
చుట్టుపక్కల వారి సహకారంతో భర్త రామాంజనేయులు ఇందును గద్వాల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అక్కడ నుంచి మెరుగైన చికిత్స కోసం కర్నూల్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ మార్చి 17 మంగళవారం అర్థరాత్రి దాటిన తర్వాత ఇందు కన్నుమూసింది. ఇద్దరు పిల్లలు తల్లి లేని వారుగా మారిపోయారు. ఇందు మృతితో ఒక్కసారిగా దౌదర్‌పల్లి కాలనీలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అప్పులు చెల్లించలేకనే మనస్థాపానికి గురై ఇందు మరణించిందని ప్రాథమిక అంచనా వేసినట్లు పోలీసులు తెలిపారు. ఫైనాన్స్ ప్రతినిధులతో పాటు ఇంకెవరైనా వేధింపుల కారణంగా చనిపోతే కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు వెల్లడించారు.
ఒక్కో రూపాయి పోగు చేస్తూ ఇంటికోసం చేసిన అప్పులను బాధ్యతగా చెల్లిస్తున్న ఇల్లాలు ఇందు మృతి స్థానికంగా కలకలం రేపుతోంది. ఇంటి గుమ్మం ముందు ఫైనాన్స్ ప్రతినిధుల అవమానాలే ఆమె ఆత్మహత్యకు కారణమని కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..