అడవుల జిల్లాలో పెను అగ్ని ప్రమాదం.. మూడు ఎకరాల పంటతోపాటు ఫాంహౌస్ పూర్తిగా దగ్ధం!

Adilabad Fire Accident: ఆదిలాబాద్ జిల్లా మావల మండలం బట్టిసావర్గామ్ శివారులో అర్ధరాత్రి అగ్నిప్రమాదం జరిగింది. జామతోటలో నిప్పు రవ్వలు పడడంతో కన్నం సురేష్‌కు చెందిన మూడు ఎకరాల పొలం పూర్తిగా కాలిపోయింది. ఎండల కారణంగా ఆకు రాలిపోయి ఉండటంతో మంటలు వేగంగా వ్యాపించి జామ, మామిడి, శ్రీగంధం చెట్లు అగ్నికి ఆహుతయ్యాయి.

అడవుల జిల్లాలో పెను అగ్ని ప్రమాదం.. మూడు ఎకరాల పంటతోపాటు ఫాంహౌస్ పూర్తిగా దగ్ధం!
Fire Accident In Adilabad D

Edited By:

Updated on: May 17, 2026 | 1:03 PM

ఆదిలాబాద్ జిల్లాలో అర్థరాత్రి భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. మావల మండలం బట్టిసావర్గామ్ శివారులో అర్ధ రాత్రి జామతోటలో నిప్పు రవ్వలు అంటుకుని కన్నం సురేష్ అనే రైతుకు చెందిన మూడు ఎకరాల పొలం పూర్తిగా కాలిబూడిద అయింది‌. ఎండల కారణంగా ఫాంహౌస్ అంతా ఆకు రాలి పోయి ఉండటం.. ప్రమాదవశాత్తు అగ్నిప్రమాదం చోటుచేసుకోవడంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. భారీగా అగ్నికిలలు ఎగిసిపడటంతో ఫాం హౌస్‌లోని జామ, మామిడి , శ్రీగందం చెట్లు అగ్నికి ఆహుతయ్యాయి. స్థానికుల సమాచారంతో రంగంలోకి దిగిన అగ్నిమాపక శాఖ సిబ్బంది.. రెండు ఫైర్ ఇంజన్ల సాయంతో మంటలు ఆర్పేందుకు సహాయక చర్యలు చేపట్టారు. అగ్నికి వాయువు తోడవడంతో భారీ ఈదురుగాలులతో ఫాంహౌస్‌లోని నివాస గృహం కూడా కాలిబూడిద అయింది. అప్పటికే భారీ నష్టం వాటిల్లింది. చివరికి మంటలను అదుపులోకి తెచ్చారు.

అదే రాత్రి జిల్లాలోని నాలుగు చోట్ల భారీ అగ్నిప్రమాదాలు చోటు చేసుకున్నాయి. సిరికొండ మండలంలోని మూడు గ్రామాల్లో శనివారం ప్రమాదవశాత్తు అగ్ని ప్రమాదాలు చోటుచేసుకున్నాయి. రాజంపేట గ్రామంలో నాగోరావు అనే రైతు పొలంలో 21 మామిడి మొక్కలు, తొడసం గంగారానికి చెందిన 20 పైపులు అగ్నికి ఆహుతయ్యాయి. సొంపల్లిలో గుంటే సువర్ణా బాయి ఎకరా పొలంలో సాగు చేసిన జొన్న పంట దగ్ధమైంది. రాయిగూడలో సిడాం మదన్ చేనులోని కొట్టంతో పాటు వ్యవసాయ సామగ్రి కాలిపోయింది.

అటు నేరడిగొండ మండలంలోని కుమారి గ్రామంలో త్రుటిలో పెను ప్రమాదం తప్పింది. పంట పొలాల్లో రైతులు పెట్టిన మంటలు ఒక్కసారిగా వీచిన ఈదురు గాలుల కారణంగా పక్కనే ఉన్న ఇతర పొలాలకు వ్యాపించాయి. అక్కడ పొలాల్లో ఉన్న మొక్కజొన్న బెరడుకు మంటలు అంటుకోవడంతో క్షణాల వ్యవధిలో పశుగ్రాసం అగ్నికి ఆహుతైంది. బోథ్ మండలం కరత్వాడ శివారులోని బారె ఆనిల్ అనే రైతు పొలంలో ప్రమాదవశాత్తు మంటలు చెలరేగాయి. దీంతో మంటలు పొలమంతా వ్యాపించాయి. నాలుగెకరాల్లో సాగు చేసిన జొన్న పంట వ్యర్థాలు కాలిపోయాయి. చుట్టు పక్కల పంటపొలాలకు మంటలు వ్యాపించకుండా రైతులు ఆర్పివేశారు. నెల రోజుల వ్యవధిలో ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా 26 అగ్ని ప్రమాదాలు చోటు చేసుకోగా.. జొన్న , మొక్క జొన్న, కుప్పలుగా పోసిన వందల ఎకరాల దాన్యం అగ్నికి ఆహుతైంది. మరో వారం రోజులు మరింత జాగ్రత్తగా ఉండాలని వాతవరణ శాఖ , జిల్లా అదికారులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు.

కాలిపోతున్న పంట వీడియో..

 

Follow Us