Telangana: మహిళలకు ప్రతి నెలా రూ.2500.. రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం..!

డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ప్రవేశపెట్టనున్న ఈ భారీ బడ్జెట్‌లో మహిళా లోకం ఆశగా ఎదురుచూస్తున్న రూ.2,500 పథకానికి మోక్షం కలగనుందా? ఇప్పటికే ఉచిత బస్సు ప్రయాణం, వడ్డీ లేని రుణాలు వంటి స్కీమ్స్ అమలుచేస్తున్న సర్కార్.. అత్యంత కీలకమైన ఈ నగదు బదిలీపై ఎటువంటి నిర్ణయం తీసుకోనుంది. ఆర్థిక శాఖ నివేదికలు ఏం చెబుతున్నాయి? విపక్షాల విమర్శల దాడికి బడ్జెట్ వేదికగా సమాధానం లభిస్తుందా?

Telangana: మహిళలకు ప్రతి నెలా రూ.2500.. రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం..!
Mahalakshmi Scheme Update

Updated on: Mar 20, 2026 | 7:28 AM

తెలంగాణలో ఇప్పటికే ప్రభుత్వం ఎన్నో పథకాలు అమలు చేస్తోంది. అయితే ఎన్నికల సమయంలో మహిళలకు రూ.2500 ఇస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చింది. కానీ అధికారంలో వచ్చి రెండున్నరేళ్లు గడుస్తున్నా దీనిపై ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. గత ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పులకుప్పగా మార్చిందని.. అందుకే హామీలు అమలు చేయలేకపోతున్నామని ఇప్పటికే పలుమార్లు సీఎం రేవంత్ అన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, మహిళా సంఘాలకు వడ్డీ లేని రుణాలు వంటి  స్కీమ్స్ అమలు చేశారు. అయితే మహిళలు గంపెడాశలు పెట్టుకున్న రూ.2500 ఆర్థికసాయంపై మాత్రం సర్కార్ సైలెంట్‌గానే ఉంది. ఈ క్రమంలో శుక్రవారం డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెడుతున్నారు. ఈ సారి బడ్జెట్‌లో ప్రధానంగా సంక్షేమం, వ్యవసాయం మౌలిక సదుపాయాలకు పెద్దపీట వేయనున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో తమకు ఏదైన గుడ్ న్యూస్ ఉంటుందేమో అని మహిళలు గంపెడాశలు పెట్టుకున్నారు.

నిధుల లభ్యతపై ఆర్థిక శాఖ నివేదిక

ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ఇచ్చిన ప్రధాన హామీలలో ఒకటైన మహిళలకు నెలకు రూ.2,500 ఆర్థిక సాయం పథకం అమలుపై ప్రభుత్వం తీవ్రంగా ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించి అవసరమైన నిధుల సమీకరణ, లభ్యతపై ఆర్థిక శాఖ ఇప్పటికే సీఎం రేవంత్‌కి సమగ్ర నివేదికను సమర్పించినట్లు సమాచారం. రాష్ట్ర ఖజానాపై పడే అదనపు భారం, అర్హులైన లబ్ధిదారుల సంఖ్య వంటి కీలక అంశాలను ఈ నివేదికలో పొందుపరిచారు.

విపక్షాల ఒత్తిడి – మహిళల నిరీక్షణ

హామీల అమలులో జరుగుతున్న ఆలస్యంపై ప్రతిపక్షాలు ఇప్పటికే విమర్శల పదును పెంచాయి. హామీలు ఇచ్చి ఏళ్లు గడుస్తున్నా.. ఎందుకు అమలు చేయడం లేదని ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తున్నాయి. మరోవైపు గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లోని మహిళలు సైతం ఇచ్చిన హామీ అమలు ఎప్పుడు అని ప్రశ్నిస్తున్నారు. హామీలు అమలు చేస్తారని అధికారంకి తీసుకొస్తే ఇప్పుడు సర్కార్ పట్టించుకోవడం లేదని ఆరోపిస్తున్నారు. ఈ బడ్జెట్ ప్రసంగంలో తమ ఖాతాల్లోకి నగదు జమపై కీలక నిర్ణయం తీసుకుంటారని ఆశాభావంతో ఉన్నారు.

బడ్జెట్ ప్రాధాన్యతలు ఇవేనా?

అంచనాల ప్రకారం.. రైతు సంక్షేమం, ఇందిరమ్మ ఇళ్లు, చేయూత పింఛన్ల పెంపు వంటి పథకాలకు భారీ నిధులు ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. ప్రభుత్వ పాఠశాలల ఆధునికీకరణ, బస్తీ దవాఖానాల విస్తరణకు ఎక్కువ నిధులు కేటాయించే అవకాశాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో బడ్జెట్ ప్రసంగంలో ఆర్థిక మంత్రి రూ.2500 స్కీమ్‌‌కు ప్రత్యేకంగా నిధులు కేటాయిస్తారా లేక విడతల వారీగా అమలు చేసే ప్రణాళికను ప్రకటిస్తారా అనేది చూడాలి.

Loading...
Unable to load recommendations.
Follow Us