
పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తుండటంతో మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మరింత దూకుడు పెంచారు. ఇప్పటికే ఆయన తొలి విడుతగా నలుగురి అభ్యర్థులతో కూడిన జాబితాను విడుదల చేసిన విషయం తెలిసిందే. తాజాగా ఆయన మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్ జిల్లా నేతలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మహబూబ్ నగర్ బీఆర్ఎస్ ఎంపీగా అభ్యర్థిగా మన్నె శ్రీనివాస్ రెడ్డిని ప్రకటించారు. అయితే ఇవాళ తెలంగాణ బీఎస్పీ చీఫ్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ స్వయంగా కేసీఆర్ ను కలుసుకోవడంతో రాజకీయంగా మరింత ప్రాధాన్యం సంతరించుకుంది. అయితే ఆర్ఎస్పీ నాగర్ కర్నూల్ జిల్లా ఎంపీ అభ్యర్థిగా బరిలో దిగే అవకాశాన్నట్టు తెలుస్తోంది. త్వరలోనే ఈయన పేరును ప్రకటించే అవకాశాలున్నాయి. అయితే ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ బీఎస్పీతో పొత్తు పెట్టుకోవడంతో తెలంగాణ రాజకీయాలు ఆసక్తిగా మారాయి.
కాగా బీఆర్ఎస్ ఇప్పటికే నలుగురి లోక్ సభ అభ్యర్థుల పేర్లను ఖరారు చేసింది. కరీంనగర్ – బి వినోద్ కుమార్, పెద్దపల్లి – కొప్పుల ఈశ్వర్, ఖమ్మం – నామ నాగేశ్వర్ రావు, మహబూబాబాద్ – మాలోత్ కవిత పేర్లను కేసీఆర్ ప్రకటించారు. తెలంగాణలో మొత్తం 17 లోక్ సభ నియోజకవర్గాలున్నాయి. అయితే వీటిలో బీఆర్ఎస్ పార్టీ కేవలం 5 స్థానాలకే అభ్యర్థులను ఖరారు చేసింది. ఇంకా 12 లోక్ సభ అభ్యర్థుల పేర్లను ప్రకటించాల్సి ఉంది. ఈ నేపథ్యంలో తదుపరి జాబితాలో ఎవరెవరికి చోటు దక్కుతందనే అంశంపై తెలంగాణ రాజకీయవర్గాల్లో ఆసక్తి నెలకొంది.
గత రెండురోజులుగా ఆయా పార్లమెంటు నియోజకవర్గ పరిధిలోని ముఖ్యనేతలతో చర్చించి కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. సెలెక్ట్ అయిన నలుగురు అభ్యర్థులను ప్రకటించారు. ఈ సందర్భంగా అభ్యర్థులకు కేసీఆర్ శుభాకాంక్షలు తెలిపారు. అయితే మాజీ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు నేతృత్వంలోని భారత రాష్ట్ర సమితి (బిఆర్ఎస్) ఈ నెల 12న ఎస్ఆర్ఆర్ కళాశాల మైదానంలో భారీ బహిరంగ సభతో కరీంనగర్ నుండి లోక్ సభ ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించనుంది. చంద్రశేఖర రావు తెలంగాణ రాష్ట్ర సాధన పోరాటానికి శ్రీకారం చుట్టిన తర్వాత తన తొలి భారీ బహిరంగ సభను ఇక్కడే నిర్వహించడంతో కరీంనగర్ కు సెంటిమెంట్ ఉంది.