మహబూబాబాద్ జిల్లా పత్తిపాక కాలనీలో కౌన్సిలర్ బానోత్ రవి హత్య కేసులో పురోగతి కనిపిస్తోంది. కౌన్సిలర్ బానోత్ రవి హత్య కేసు వివరాలను జిల్లా ఎస్పీ శరత్ చంద్ర వెల్లడించారు. రవి హత్యకు వ్యాపార లావాదేవీలే కారణం అని, రాజకీయాలతో సంబంధం లేదని ఎస్పీ స్పష్టం చేశారు. నిందితులను పట్టుకునేందుకు 4 బృందాలను ఏర్పాటు చేశామన్నారు. ఇప్పటికే ఇద్దరు నిందితులను గుర్తించామని, అందర్నీ త్వరలోనే అరెస్టు చేస్తామని ఎస్పీ శరత్ చంద్ర వెల్లడించారు. మహబూబాబాద్ మున్సిపాలిటీలోని 8వ వార్డు నుంచి బానోత్ రవి స్వతంత్ర అభ్యర్థిగా గెలుపొందారు. 8వ వార్డ్ కౌన్సిలర్ రవి కారులో వెళ్తుండగా గుర్తుతెలియని వ్యక్తులు ట్రాక్టర్‌తో అడ్డగించారు. ఆ తర్వాత వెంట తెచ్చుకున్న గొడ్డళ్లతో విచక్షణారహితంగా దాడి చేశారు. ఈ దాడిలో రవికి తీవ్ర గాయాలయ్యాయి. రక్తపు మడుగులో పడి ఉన్న రవిని స్తానికులు ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో చికిత్స పొందుతూ చనిపోయారు.
రవిని రాజకీయ ప్రత్యర్థులు చంపలేదని.. వ్యాపారంలో విభేదాలే హత్యకు దారితీశాయని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు. ఇద్దరు అనుమానితుల్ని గుర్తించి వారి కోసం గాలిస్తున్నారు. రాజకీయంగా ఇప్పుడిప్పుడే ఎదుగుతున్నాడు రవి.
నిన్న తోటి కౌన్సిలర్ వివాహానికి హాజరైన రవి ఆటపాటతో అందర్నీ అలరించాడు. ఆ తర్వాత మరో కార్యక్రమంలో కూడా పాల్గొన్నాడు. స్తానికులకు అందుబాటులో ఉంటూ సేవలు చేస్తున్నాడు. ఈ క్రమంలోనే రవి హత్యకు గురికావడం అందర్నీ కలచివేసింది.
రవికి ఇద్దరు పిల్లలు. తండ్రి లేడనే నిజాన్ని వాళ్లు జీర్ణించుకోలేకపోతున్నారు. మరోవైపు రవిని చంపిన వారిని కఠినంగా శిక్షించాలంటున్నారు బాధిత కుటుంబసభ్యులు.
ఇవి కూడా చదవండి: RK Roja: మంత్రి రోజా ఫోన్ చోరీ..సెల్ ఫోన్ల గురించి రోజా వివరిస్తున్న సమయంలోనే..
Prashant Kishor: కాంగ్రెస్ పార్టీకి అంతం లేదు.. ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ సంచలన వ్యాఖ్యలు..