AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hyderabad: అలా ఎలా నమ్మించార్రా.. పోలీసుల మని చెప్పి లక్షలు కాజేసిన ముఠా.. సీన్ కట్‌చేస్తే..

ఈజీ మనీ కోసం అలవాటు పడిన కొందరు కేటుగాళ్లు.. జనాలను మోసం చేసేందుకు రోజుకో వ్యూహం రచిస్తున్నారు. తాజాగా అలానే పోలీసు అధికారులమని చెబుతూ జనాలను నుంచి డబ్బులు కాజేస్తున్న ఓ నకిలీ పోలీస్ ముఠాను పోలీసులు పట్టుకున్నారు. నిందితుల నుంచి రెండు గన్స్‌ , రెండు నకిలీ పోలీస్ స్టిక్కర్లు ఉన్న కార్లు, ల్యాప్‌టాప్, పోలీస్ యూనిఫాంలు స్వాధీనం చేసుకున్నారు. నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.

Hyderabad: అలా ఎలా నమ్మించార్రా.. పోలీసుల మని చెప్పి లక్షలు కాజేసిన ముఠా.. సీన్ కట్‌చేస్తే..
Hyderabad Fake Police Arrest
Lakshmi Praneetha Perugu
| Edited By: |

Updated on: Jun 03, 2026 | 6:06 PM

Share

హైదరాబాద్‌లో పోలీసుల పేరుతో ప్రజలను భయపెట్టి డబ్బులు వసూలు చేస్తున్న నకిలీ పోలీస్ ముఠాను కూకట్‌పల్లి సీసీఎస్, జగద్గిరిగుట్ట పోలీసులు కలిసి పట్టుకున్నారు. తూర్పు గోదావరి జిల్లాకు చెందిన నాగరాజు రఘువర్మ అనే ప్రధాన నిందితుడితో పాటు మరో ముగ్గురిని అరెస్ట్ చేశారు. ఈ ముఠాలో మరో ఇద్దరు నిందితులు పరారీలో ఉన్నారని వారిని కూడా త్వరలోనే పట్టుకుంటామని పోలీసులు తెలిపారు.

పోలీసుల కథనం ప్రకారం.. కూకట్‌పల్లికి చెందిన పూర్ణచందర్‌రావు అనే వ్యక్తిపై హర్యానాలో ఉన్న ఒక కేసును సాకుగా చూపించి, తాము ఐపీఎస్ అధికారులు అని నమ్మించిన ముఠా అతడిని కిడ్నాప్ చేసింది. మే 18న నకిలీ పోలీస్ స్టిక్కర్లు ఉన్న కారులో ఎక్కించి సూర్యాపేటకు తీసుకెళ్లి రూ.1 లక్ష నగదు వసూలు చేశారు. అనంతరం హైదరాబాద్‌లో వదిలేసి, మరో రూ.5.26 లక్షలు కాజేసి పరారయ్యారు. బాధితుడి ఫిర్యాదుతో పోలీసులు దర్యాప్తు చేపట్టి ముఠా గుట్టు రట్టు చేశారు.

ప్రధాన నిందితుడు నాగరాజుపై ఇప్పటికే 12 కేసులు నమోదు కాగా, రెండు పీడీ యాక్ట్ కేసులు కూడా ఉన్నట్లు పోలీసులు తెలిపారు. భీమవరంలో అతడిపై రౌడీషీట్ కూడా కొనసాగుతోందని వెల్లడించారు. గతంలో కల్నల్ అవతారం ఎత్తి మోసాలకు పాల్పడిన కేసుల్లోనూ అతడు అరెస్టయ్యాడని చెప్పారు. ప్రతి ఆపరేషన్‌కు వేర్వేరు పేర్లతో మొత్తం 12 నకిలీ గుర్తింపు కార్డులు తయారు చేసుకుని చలామణి అయినట్లు విచారణలో తేలింది.

నిందితుడు నాగరాజు ఆధ్వర్యంలో ఆరుగురు సభ్యులతో ప్రత్యేకంగా ‘సూడో పోలీస్ వ్యవస్థ’నే ఏర్పాటు చేసినట్లు పోలీసులు గుర్తించారు. నకిలీ పోలీసుల మాదిరిగా దుస్తులు, లెటర్‌ప్యాడ్లు, రబ్బర్ స్టాంపులు, అధికారిక గుర్తులు వాడుతూ ప్రజలను మోసం చేస్తున్నట్లు వెల్లడించారు. ఈ వ్యవహారంలో హర్యానాకు చెందిన సస్పెండ్ కానిస్టేబుల్ సునీల్ కుమార్ పాత్ర కూడా ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. టెక్నాలజీ సహాయంతో పాత నేరస్థుల డేటాను విశ్లేషించి ఈ ముఠాను గుర్తించి అరెస్ట్ చేసినట్లు డీసీపీ కోటిరెడ్డి తెలిపారు.

ఈ కేసులో నాగరాజు, రాహుల్ (యూపీ), సత్యభాన్ సింగ్, నాగేంద్ర వర్మలను అరెస్ట్ చేయగా, ప్రదీప్ కుమార్ మిశ్రా, సునీల్ కుమార్ పరారీలో ఉన్నారని చెప్పారు. నిందితుల వద్ద నుంచి రెండు గన్స్‌ , రెండు నకిలీ పోలీస్ స్టిక్కర్లు ఉన్న కార్లు, ల్యాప్‌టాప్, పోలీస్ యూనిఫాంలు, బైక్, లెటర్‌ప్యాడ్లు, హ్యాండ్‌కఫ్స్, రబ్బర్ స్టాంపులు, వివిధ హోదాలను సూచించే స్టార్లు, 10 మొబైల్ ఫోన్లు తదితర సామగ్రిని స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. అరెస్టు చేసిన నిందితులను రిమాండ్‌కు తరలించినట్లు డీసీపీ తెలిపారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us