Telangana: చిలుకూరు ఆలయ ప్రధానార్చకుడు రంగరాజన్‌పై దాడి.. ప్రభుత్వం ఏం చేస్తోందన్న కేటీఆర్‌

చిలుకూరు ఆలయ అర్చకుడు రంగరాజన్‌పై దాడి కేసులో దర్యాప్తు ముమ్మరం చేశారు పోలీసులు. ఘటనలో 22 మందిపై కేసు నమోదు చేసిన మొయినాబాద్ పోలీసులు..17 మంది నిందితులను గుర్తించారు. ప్రధాన నిందితుడు రాఘవరెడ్డిని ఇప్పటికే రిమాండ్‌కు తరలించిన పోలీసులు. పరారీలో ఉన్న నిందితుల కోసం నాలుగు బృందాలుగా విడిపోయి గాలిస్తున్నారు..

Telangana: చిలుకూరు ఆలయ ప్రధానార్చకుడు రంగరాజన్‌పై దాడి..  ప్రభుత్వం ఏం చేస్తోందన్న కేటీఆర్‌
Priest Rangarajan - KTR

Updated on: Feb 10, 2025 | 11:07 AM

రంగారెడ్డి జిల్లా చిలుకూరు బాలాజీ ఆలయ ప్రధాన అర్చకుడు సీఎస్‌ రంగరాజన్‌పై దాడి ఘటన కలకలం రేపుతోంది. రామరాజ్యం అనే ర్యాడికల్ సంస్థకు చెందిన 20 మంది దాడి చేసినట్టు పోలీసులు గుర్తించారు. రామరాజ్య స్థాపనకు మద్దతు ఇవ్వాలని కొంతమంది వ్యక్తులు కోరారని..అందుకు రంగరాజన్ నిరాకరించడంతో తమ కుమారుడిని తీవ్రంగా హింసించారని ఆయన తండ్రి సౌందర్‌ రాజన్‌ తెలిపారు. దాడి చేసిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఫిర్యాదు చేశారు. దాడి ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

ఈ నెల 7 తేదీన దాడి ఘటన జరిగినట్టు బాధితులు ఫిర్యాదులో పేర్కొన్నారు. అయితే రెండు రోజుల తర్వాత విషయం బయటపడ్డం పట్ల పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు ఘటనపై ప్రభుత్వ తీరును నిరసిస్తూ ఎక్స్‌లో పోస్ట్‌ చేశారు..బీఆర్‌ఎస్‌ వర్కింగ్ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌. ” ధర్మరక్షకులపై దాడులు చేస్తారు…రాజ్యాంగ రక్షకులు చూస్తూ కూర్చుంటారు” అంటూ కామెంట్స్‌ చేశారు కేటీఆర్‌. దాడికి సంబంధించిన వీడియోలు ఉన్నా కూడా.. హోం మంత్రి? ముఖ్యమంత్రి? ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. ఘటనపై హిందూ ధర్మ పరిరక్షకులు ఒక్క మాట కూడా మాట్లాడలేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.

 

మరోవైపు దాడి ఘటనపై చిలుకూరు పూజారి రంగరాజన్‌తో మాట్లాడినట్టు Xలో తెలిపారు..కేంద్ర హోంశాఖ సహాయమంత్రి బండి సంజయ్‌. రంగరాజన్‌లో ఫోన్‌లో మాట్లాడి ఆయన క్షేమ సమాచారాన్ని తెలుసుకున్నానని..అవసరమైన సాయాన్ని అందిస్తామని చెప్పినట్టు వివరించారు..బండి సంజయ్‌.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..