Telangana: బీఆర్‌ఎస్‌కు ఎన్ని సీట్లు రావొచ్చొ నిక్కచ్చిగా చెప్పిన కేటీఆర్

Telangana Elections: కాంగ్రెస్‌ పార్టీ టికెట్లు అమ్ముకుంటోంది. కోట్ల రూపాయలకు సీట్లు అమ్మేస్తోందని ఆ పార్టీ నేతలే చెబుతున్నారు. ఇవీ కేటీఆర్ ఆరోపణలు. మీడియాతో చిట్‌చాట్‌లో కాంగ్రెస్‌పై ఘాటు కామెంట్లు చేశారు కేటీఆర్‌. ఒక ఆడపిల్ల తండ్రిలా తెలంగాణ ఓటర్‌ ఆలోచించుకోవాలన్నారు. సీఎం కేసీఆర్‌ ఈసారి కూడా వంద స్థానాల్లో ప్రచారం చేస్తారంటూ మీడియాతో ఇష్టాగోష్టిలో కేటీఆర్‌ చెప్పారు.

Telangana: బీఆర్‌ఎస్‌కు ఎన్ని సీట్లు రావొచ్చొ నిక్కచ్చిగా చెప్పిన కేటీఆర్
Minister KT Rama Rao

Updated on: Oct 13, 2023 | 7:45 PM

ఎన్నికల నగారా మోగడంతో తెలంగాణలో..అధికార బీఆర్‌ఎస్‌, విపక్ష కాంగ్రెస్‌ల మధ్య డైలాగులు డైనమైట్లలా పేలుతున్నాయి. ఈ నేపథ్యంలో మీడియాతో తెలంగాణ మంత్రి కేటీఆర్‌ చిట్‌చాట్‌ నిర్వహించారు. తమ సీఎం అభ్యర్థి కేసీఆర్‌ అని, వాళ్ల సీఎం అభ్యర్థి ఎవరో కాంగ్రెస్‌ చెప్పగలదా అని ప్రశ్నించారు కేటీఆర్‌. కాంగ్రెస్‌ బహిరంగంగానే టికెట్లు అమ్ముకుంటోందని ఆయన ఆరోపించారు. కూకట్‌పల్లి అసెంబ్లీ సీటుకు 15 కోట్ల రూపాయలు అడిగారంటూ ఓ కాంగ్రెస్‌ నేత చెప్పారన్నారు కేటీఆర్‌. ఏ ప్రాంతం వారికైనా ఏ నియోజకవర్గంలో అయినా టికెట్ ఇస్తామని కాంగ్రెస్‌ చెబుతోందిట అన్నారు కేటీఆర్‌.

ఒక ఆడపిల్ల తండ్రిలా తెలంగాణ ఓటర్‌ ఆలోచించుకోవాలన్నారు కేటీఆర్‌. కాంగ్రెస్‌కు 40 అసెంబ్లీ స్థానాల్లో అభ్యర్థులే లేరన్న ఆయన.. రజాకార్ల సినిమాలు, హిందూ ముస్లిం గొడవలు తప్ప బీజేపీ ఇంకేం చెప్పదన్నారు. తెలంగాణను ఎవరి చేతిలో పెట్టాలో ప్రజలు ఆలోచించుకోవాలన్నారు కేటీఆర్‌. ఇది తెలంగాణ ఆత్మ గౌరవానికి … గుజరాత్ అహంకారానికి మధ్య జరుగుతున్న ఎన్నికలంటూ కేటీఆర్‌ కామెంట్‌ చేశారు. సౌత్ ఇండియాలో మొదటిసారిగా హ్యాట్రిక్ అవకాశం కేసీఆర్‌కు వచ్చిందని, తెలంగాణ ప్రజలు ఆశీర్వదించాలని కోరుతున్నానన్నారు కేటీఆర్‌.

సీఎం కేసీఆర్‌ ఈసారి కూడా వంద స్థానాల్లో ప్రచారం చేస్తారంటూ మీడియాతో ఇష్టాగోష్టిలో కేటీఆర్‌ చెప్పారు. తాను జీహెచ్‌ఎంసీ, సిరిసిల్లతో పాటు కామారెడ్డిలో ప్రచారం చేస్తానని ఆయన తెలిపారు. మేనిఫెస్టోలో రైతులు, మహిళలు, దళితులు, గిరిజనులు, బీసీలు, మైనార్టీలు, పెన్షనర్ల ప్రయోజనాలకు పెద్ద పీట వేస్తామన్నారు. తమకు గతంలో మాదిరిగా 88 సీట్లు రావొచ్చన్నారు కేటీఆర్‌. హుజూరాబాద్‌లో కూడా తామే గెలుస్తామన్నారు. ఈటల రాజేందర్‌ గజ్వేల్‌తో పాటు మరో 50 చోట్ల పోటీ చేసినా , షర్మిల 119 సీట్లలో పోటీ చేసినా, రాహుల్‌ గాంధీ, మోదీ ఇక్కడికొచ్చి పోటీ చేసినా తమకు అభ్యంతరం లేదన్నారు కేటీఆర్‌. పొన్నాల బీఆర్‌ఎస్‌లో చేరతానంటే ఇంటికెళ్లి ఆహ్వానిస్తానన్నారు ఆయన. కాంగ్రెస్‌లో సీఎం పదవికి ఇద్దరు నేతల మధ్య అంగీకారం కుదిరినట్టు తమ దగ్గర సమాచారం ఉందన్నారు. ఇలా పలు ఆసక్తికర అంశాలు మీడియాతో పంచుకున్నారు కేటీఆర్‌.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి.