Kichannagari Laxma Reddy: తెలంగాణ పీసీసీ అధ్యక్షుడిగా మల్కాజిగిరి ఎంపీ రేవంత్ రెడ్డి నియమితులైన విషయం తెలిసిందే. రేవంత్ రెడ్డి నియామకంపై కొందరు సంతృప్తిగా ఉంటే మరి కొందరు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. దీంతో తెలంగాణలో రాజకీయాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. ఎన్నో రోజులుగా పీసీసీ చీఫ్ కోసం ప్రయత్నాలు కొనసాగిస్తున్న పలువురు కాంగ్రెస్ నేతల ఆశలు అడియాశలయ్యాయి. ఈ నేపథ్యంలో రేవంత్ రెడ్డి నియామకంపై మేడ్చల్ కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే కె. లక్ష్మారెడ్డి అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన పార్టీకి రాజీనామా చేశారు. రాజీనామా పత్రాన్ని రాహుల్ గాంధీకి పంపించారు. కాంగ్రెస్ పార్టీలో ఇన్ని కొనసాగినందుకు ధన్యవాదాలు తెలిపారు. అలాగే విలువలతో కూడిన రాజకీయాలు చేశానని, ప్రజలకు సేవ చేయడానికి కాంగ్రెస్ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు చెబుతున్నానని అన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో నేను కాంగ్రెస్ పార్టీలో కొనసాగను అంటూ రాజీనామా లేఖలో పేర్కొన్నారు. పార్టీ ప్రాథమిక సభ్యత్వం కొరకు, ఏఐసీసీ సభ్యుడి పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. తన రాజీనామాను అంగీకరించాలని ఆయన రాహుల్‌గాంధీని కోరారు.
అయితే రేవంత్‌రెడ్డిని తెలంగాణ పీసీసీ చీఫ్‌గా నియమించిన కొద్దిసేపటికే ఆయన రాజీనామా చేయడం చర్చనీయాంశంగా మారింది. అయితే జూన్ 26న శనివారం దళిత ఆవేదన దీక్ష ఏర్పాటు చేసింది కాంగ్రెస్ పార్టీ. దీనికి సంబంధించిన ఏర్పాట్లన్నీ చూసుకున్నారు లక్ష్మారెడ్డి. భారీ ఫ్లెక్సీలు, బోర్డులు ఏర్పాటు చేశారు. ఉదయం హడావుడి చేసిన ఆయన.. సాయంత్రం రాజీనామా చేయడం గమనార్హం. అయితే కాంగ్రెస్‌లో గ్రూపు రాజకీయాలు కొత్తేమి కాదు. అలాంటిది ఇప్పుడు రేవంత్‌రెడ్డికి పార్టీ పగ్గాలు అప్పగించిన నేపథ్యంలో పార్టీలో ఆయనను వ్యతిరేకిస్తున్నారు. తర్వాత కాలంలో కలిసి పని చేయక తప్పదని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.