తుఫాన్‌తో ఖమ్మం అతలాకుతలం.. గల్లంతైన 11 మంది రెస్క్యూ సిబ్బందిలో 10 మంది క్షేమం.. మరొకరి కోసం గాలింపు!
మురసు తుఫాన్ ప్రభావంతో ఖమ్మం జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. బేతుపల్లి చెరువులో మత్స్యకారులను కాపాడేందుకు వెళ్లి గల్లంతైన 11 మంది రెస్క్యూ సిబ్బందిలో 10 మంది క్షేమంగా ఉన్నట్లు అధికారులు తెలిపారు. మరో సిబ్బంది కోసం గాలింపు కొనసాగుతోంది. భారీ వర్షాలతో వాగులు, చెరువులు పొంగిపొర్లుతుండగా పంటలు, రహదారులు, సింగరేణి గనుల కార్యకలాపాలపై ప్రభావం పడింది.

ఖమ్మం జిల్లాలో గల్లంతైన రెస్క్యూ సిబ్బంది క్షేమంగా బయటపడ్డారు. గల్లంతైన 11 మందిలో 10 మంది సురక్షితంగా ఉన్నట్లు అధికారులు తెలిపారు. బేతుపల్లి చెరువు దగ్గర మరొకరి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. మత్స్యకారులను కాపాడేందుకు చెరువులోకి వెళ్లి.. 11 మంది SDRF ఫైర్ సిబ్బంది గల్లంతయ్యారు. వారిలో 10 మంది క్షేమంగా ఉన్నారని.. ఒక్కరి కోసం గాలిస్తున్నట్లు అధికారులు తెలిపారు. కాగా, బోట్ల గల్లంతుపై సీఎం రేవంత్‌రెడ్డి ఆరా తీశారు. ఇప్పటికే కలెక్టర్, ఎస్పీతో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడారు. గాలింపు చర్యలను ముమ్మరం చేయాలని ఆదేశాలిచ్చారు. మురసు తుఫాన్ ప్రభావంతో ఉమ్మడి ఖమ్మం జిల్లా అతలాకుతలమవుతోంది. ముఖ్యంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో వర్షం తీవ్రత ఎక్కువగా ఉంది. ములకలపల్లిలో అత్యధిక వర్షపాతం నమోదవ్వగా… సత్తుపల్లి, దమ్మపేట, వేంసూరు, కల్లూరులోనూ వర్షం దంచికొట్టింది. మణుగూరు, ఇల్లందు, సత్తుపల్లిలోని సింగరేణి ఓపెన్ కాస్ట్ గనుల్లో బొగ్గు ఉత్పత్తి పూర్తిగా నిలిచిపోయింది. గనుల్లోని రోడ్లు బురదమయం కావడంతో వాహనాలు ఎక్కడిక్కడ ఆగిపోయాయి. ఇటు చేతికి వచ్చే దశలో పత్తి, వరి పంటలు దెబ్బతినడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. వర్ష ప్రభావం ఎక్కువగా ఉండటంతో ప్రభుత్వ యంత్రాంగం అప్రమత్తమైంది. ఖమ్మం, కొత్తగూడెం కలెక్టరేట్లలో ప్రత్యేక కంట్రోల్ రూమ్‌లను ఏర్పాటు చేసి పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు అధికారులు.
ఇటు దమ్మపేటలోని నెమలిపేట కాలనీ నీట మునిగింది. అశ్వారావుపేటలోని పెద్దవాగు ప్రాజెక్టుకు వరద పోటెత్తడంతో పరిసర ప్రాంతాల్లో తీవ్ర ఆందోళన నెలకొంది. వేంసూరు, పెనుబల్లి మండలాల మధ్య కట్టలేరు వాగు… లోలెవల్ వంతెనపై నుంచి ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. అన్నపురెడ్డిపల్లి మండలంలోనూ వాగులు పొంగిపొర్లుతుండటంతో అధికారులు రాకపోకలను నిలిపివేశారు. పలు ప్రాంతాల్లో పాఠశాలలకు సెలవులు ప్రకటించగా, అత్యవసరమైతే తప్ప బయటకు రావొద్దని అధికారులు హెచ్చరిస్తున్నారు.
వర్షాల ధాటికి వైరా జలాశయానికి భారీగా వరద నీరు చేరుతోంది. జలాశయం నీటిమట్టం 18 అడుగులు దాటింది. మల్లెపూలవాగు ఉద్ధృతంగా ప్రవహించడంతో పరిసర ప్రాంతాల్లోని పంట పొలాలు నీట మునిగాయి. కల్లూరు-చండ్రుపట్ల రహదారి పక్కన కుప్పలుగా పోసిన ధాన్యం చుట్టూ నీరు చేరింది. రాజుపేట సమీపంలో నిర్మించిన అప్రోచ్ రోడ్డు దెబ్బతినడంతో పాల్వంచ-దమ్మపేట ప్రధాన మార్గంలో వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. ఇటు మధిలోనూ ఎడతెరపిలేకుండా కురుస్తున్న వర్షంతో జనం ఇబ్బంది పడుతున్నారు.
