MLA Danam Nagender: ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ వియ్యంకుడు అనిల్ కుమార్ కిషన్‌పై గుర్తు తెలియని వ్యక్తులు రాళ్లతో దాడికి దిగారు. ఈ దాడి నుంచి ఆయన తృటిలో తప్పించుకున్నారు. జూబ్లీహిల్స్ రోడ్ నెం.15లో నివాసం ఉంటున్న ఎమ్మెల్యే నాగేందర్ వియ్యంకుడు అనిల్ కిషన్ సోమవారం రాత్రి 10 గంటల సమయంలో సమావేశం ముగించుకుని జూబ్లీహిల్స్ పోలీసుస్టేషన్ మీదుగా కళాంజలి నుంచి తన ఇంటికి కారులో వెళ్తుండగా, కళాంజలి షోరూం దాటగానే గుర్తు తెలియని వ్యక్తులు ఆయన కారుపై వెనుక నుంచి రాళ్లతో దాడి చేశారు.
ఈ ఘటనను ఆయన తప్పించుకుని ఇంటికి చేరుకున్నారు. దీంతో ఆయన దానం నాగేందర్‌కు ఫోన్ చేశాడు. దీంతో అప్రమత్తమైన దానం.. జూబ్లీహిల్స్ పోలీసులకు సమాచారం అందించారు. ఇక నైట్ డ్యూటీలో ఉన్న ఎస్ఐ నాయుడు సిబ్బందితో ఘటన స్థలానికి చేరుకుని నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఈ ఘటనలో కారు అద్దాలు పగిలాయని, సీసీ పుటేజీలను పరిశీలిస్తున్నామని పోలీసులు తెలిపారు. కాగా, ఘటనపై న్యాయసలహా అనంతరం కేసు నమోదు చేస్తామన్నారు. ఆయనకు ఎవరైనా శత్రువులున్నారా..? అనేదానిపై పోలీసులు ఆరా తీస్తున్నారు.
ఇవీ చదవండి : Golconda Murder: హైదరాబాద్ గోల్కొండలో దారుణం.. అన్నను దారుణంగా హత్య చేసిన తమ్ముడు.. ఆస్తి వివాదాలే కారణమా..?