Telangana: కాజీపేట రైల్వే ఫ్యాక్టరీ రెడీ.. 5 ఏళ్లలో 200 కొత్త రైళ్లు.. సామాన్యులు, విద్యార్థులకు ఇక పండగే..
ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ప్రతిష్టాత్మక కాజీపేట రైల్వే మ్యానుఫ్యాక్చరింగ్ పనులు దాదాపు పూర్తి కావచ్చాయి. ఒకప్పుడు కేవలం జంక్షన్‌గా మాత్రమే గుర్తింపు పొందిన కాజీపేట.. ఇకపై దేశవ్యాప్తంగా నడిచే అత్యాధునిక రైళ్లను తయారు చేసే మెగా హబ్‌గా మారబోతుంది. రానున్నఐదేళ్లలో ఏకంగా 200 సరికొత్త ఇంటర్‌సిటీ రైళ్లను పట్టాలెక్కించేందుకు కేంద్ర రైల్వే శాఖ ముమ్మరంగా ప్లాన్ చేస్తోంది.

తెలంగాణలో మరో చారిత్రాత్మక రైల్వే ప్రాజెక్ట్ ప్రారంభానికి సర్వం సిద్ధమైంది. ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న కాజీపేట రైల్వే మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ నిర్మాణ పనులు దాదాపు పూర్తి కావచ్చాయి. భారతీయ రైల్వేస్ చరిత్రలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన ఈ రోలింగ్ స్టాక్ తయారీ కేంద్రం నుండి.. రాబోయే ఐదేళ్లలో వందలాది సరికొత్త ఇంటర్‌సిటీ రైళ్లు పట్టాలెక్కబోతున్నాయి. కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్, సహాయ మంత్రి రవ్‌నీత్ సింగ్ బిట్టూలు ఉన్నతాధికారులతో కలిసి ఈ ప్రాజెక్ట్ పురోగతిని పర్యవేక్షించారు. ఇండియన్ రైల్వేస్‌లో కాజీపేట మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఒక బహుముఖ శ్రేణి ఫ్యాక్టరీగా అవతరించబోతోంది. ప్రారంభంలో భాగంగా.. ఈ ఫ్యాక్టరీ నుండి రాబోయే 5 సంవత్సరాలలో 200 అత్యాధునిక ఇంటర్‌సిటీ షటిల్ రైళ్లను తయారు చేయాలని కేంద్ర రైల్వే శాఖ లక్ష్యంగా పెట్టుకుంది. ఈ రైళ్లను దేశవ్యాప్తంగా ఉన్న వివిధ నగరాలు, పట్టణాల మధ్య తక్కువ దూర ప్రయాణాల కోసం మోహరించనున్నారు.
సామాన్యులు, విద్యార్థులకు రైల్వే షటిల్ వరం..
ఈ సరికొత్త ఇంటర్‌సిటీ రైళ్లు దాదాపు 300 కిలోమీటర్ల పరిధిలో నడుస్తాయి. ఈ ప్రయాణంలో వీటికి ఎక్కువ స్టాపింగ్‌లు ఉంటాయి. దీనివల్ల పక్కపక్కనే ఉండే పట్టణాలు, నగరాల మధ్య నిత్యం ప్రయాణించే సామాన్యులకు ఇవి లో-కాస్ట్ ‘షటిల్ సర్వీస్’లా ఉపయోగపడతాయి. పక్క ఊర్లకు వెళ్లి చదువుకునే విద్యార్థులు, ఉద్యోగాలకు వెళ్లే రోజువారీ కూలీలు, వ్యాపారులు, వైద్య అవసరాల కోసం సిటీలకు వెళ్లే సామాన్య ప్రజలకు ఇది అత్యంత చౌకైన, సురక్షితమైన ప్రత్యామ్నాయంగా మారబోతోంది. ఈ రైళ్లు అందుబాటులోకి రావడం వల్ల ప్రస్తుతం రోడ్లపై బస్సులు, సొంత వాహనాల్లో ప్రయాణించే భారీ లోకల్ ట్రాఫిక్ అంతా రైల్వే వైపు మళ్లుతుందని అంచనా వేస్తున్నారు.
గంటకు 130 కి.మీ వేగం.. జెర్క్ ఫ్రీ కుప్లర్లతో లగ్జరీ ఫీచర్లు
కాజీపేట ఫ్యాక్టరీలో తయారయ్యే ఈ రైళ్లు కేవలం చౌకైనవి మాత్రమే కాదు.. ఎంతో ఆధునికంగా, సురక్షితంగా ఉండబోతున్నాయి.
స్పీడ్ – కోచ్ కాన్ఫిగరేషన్: ఈ ఇంటర్‌సిటీ రైళ్లు గంటకు 130 కిలోమీటర్ల గరిష్ట వేగంతో దూసుకెళ్లేలా డిజైన్ చేస్తున్నారు. ప్రతి రైలులో 20 కోచ్‌లు ఉంటాయి.
జెర్క్ ఫ్రీ టెక్నాలజీ: రైలు ఆగినప్పుడు లేదా స్టార్ట్ అయినప్పుడు ఎలాంటి జర్క్ ఇవ్వకుండా ఉండేలా అత్యాధునిక జెర్క్ ఫ్రీ కుప్లర్లు, బోగీలను అమర్చుతున్నారు. దీనివల్ల ప్రయాణం ఎంతో స్మూత్‌గా సాగుతుంది.
సౌకర్యాలు: ప్రయాణికుల రక్షణ కోసం ఆటోమేటిక్ డోర్ క్లోజింగ్ సిస్టమ్, మెరుగైన వెంటిలేషన్, ప్రతి కోచ్‌కి ఇరువైపులా రెండు టాయిలెట్లు ఉంటాయి.
పర్యావరణానికి మేలు.. కరెంట్ పుట్టించే రీజనరేటివ్ బ్రేకింగ్
ఈ రైళ్లలో ఉన్న మరో మైండ్ బ్లోయింగ్ ఫీచర్.. రీజనరేటివ్ బ్రేకింగ్ సిస్టమ్. ఈ టెక్నాలజీ వల్ల రైలుకు బ్రేకులు వేసిన ప్రతిసారీ.. అది ఒక ఎలక్ట్రిసిటీ జనరేటర్‌గా మారి విద్యార్థుత్ శక్తిని ఉత్పత్తి చేస్తుంది. అలా తయారైన కరెంట్‌ను తిరిగి పవర్ గ్రిడ్‌కే సరఫరా చేస్తుంది. దీనివల్ల ఇవి అత్యంత విద్యుత్ సామర్థ్యం కలిగినవిగా, పర్యావరణహితమైనవిగా మారుతాయి. రోడ్డు రవాణా గాలితో పోలిస్తే కార్బన్ ఉద్గారాలు చాలా తక్కువగా ఉంటాయి.
