Jamili Elections: జమిలి ఎన్నికలపై తగ్గేదేలే అంటున్న బీజేపీ.. జేపీ నడ్డా కీలక ఆదేశాలు

జమిలి ఎన్నికలపై మరింత ఫోకస్ పెంచింది బీజేపీ. వన్ నేషన్ వన్ ఎలక్షన్‌పై ప్రజల్లో అవగాహన కల్పించాలని.. మాటిమాటికి వచ్చే ఎన్నికలతో వచ్చే నష్టాన్ని వివరించాలని ఎంపీలకు సూచించారు జేపీ నడ్డా. మరోవైపు ఆఫీస్‌ బేరర్స్‌, జిల్లా అధ్యక్షులతో భేటీ అయిన కిషన్ రెడ్డి.. కాంగ్రెస్‌ హామీల అమలుపై ప్రజా పోరాటం చేయాలని పిలుపునిచ్చారు.

Jamili Elections: జమిలి ఎన్నికలపై తగ్గేదేలే అంటున్న బీజేపీ.. జేపీ నడ్డా కీలక ఆదేశాలు
Jp Nadda

Updated on: Apr 01, 2025 | 7:37 AM

జమిలి ఎన్నికలపై మరింత ఫోకస్ పెంచింది బీజేపీ. వన్ నేషన్ వన్ ఎలక్షన్‌పై ప్రజల్లో అవగాహన కల్పించాలని.. మాటిమాటికి వచ్చే ఎన్నికలతో వచ్చే నష్టాన్ని వివరించాలని ఎంపీలకు సూచించారు జేపీ నడ్డా. మరోవైపు ఆఫీస్‌ బేరర్స్‌, జిల్లా అధ్యక్షులతో భేటీ అయిన కిషన్ రెడ్డి.. కాంగ్రెస్‌ హామీల అమలుపై ప్రజా పోరాటం చేయాలని పిలుపునిచ్చారు.

బూత్ స్థాయి నుంచి కార్యక్రమాలు.. జమిలి ఎన్నికలపై పార్టీ ఎంపీలకు వీడియో కాన్ఫరెన్స్‌లో దిశానిర్దేశం చేశారు బీజేపీ జాతీయాధ్యక్షులు జేపీ నడ్డా. ఏప్రిల్ 6న బీజేపీ ఆవిర్భావ దినోత్సవం.. ఏప్రిల్ 14న అంబేద్కర్‌ జయంతి వరకు ప్రత్యేక కార్యక్రమాలు రూపొందించారు. వాటిని అమలు చేసేందుకు బీజేపీ ఎంపీలను ఇన్‌ఛార్జ్‌లుగా నియమించారు నడ్డా. అలాగే జమిలి ఎన్నికలపై ప్రజల్లో విస్తృతంగా అవగాహన కల్పించాలని ఎంపీలకు సూచించారాయన. దేశమంతటా ఒకేసారి లోక్‌సభ, శాసనసభలకు ఎన్నికలు జరిగితే నిర్వహణ వ్యయం, మానవ వనరుల వినియోగం గణనీయంగా తగ్గడంతో పాటు ప్రభుత్వాల పనికి అంతరాయం ఉండదన్నారు. నెహ్రూ, ఇందిరాగాంధీ ప్రధానిగా ఉన్న సమయంలో కూడా దేశమంతటా ఒకేసారి ఎన్నికలు జరిగిన విషయాన్ని ప్రజలకు వివరించాలన్నారు. కేంద్రంలో ఉండే పార్టీకి ప్రయోజమని.. ప్రాంతీయ పార్టీలకు నష్టమన్న వాదనలో పసలేదన్న విషయాన్ని ఇంకాస్త గట్టిగా చెప్పాలని సూచించారు. ఒకే దేశం ఒకే ఎన్నికతో ఆర్థిక వ్యవస్థకు నష్టం జరగకుండా ఉంటుందని ప్రజలకు వివరించాలన్నారు నడ్డా.

కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఉజ్వల్ గ్యాస్‌, పీఎం కిసాన్‌, బేటీ బచావో, బేటీ పడావో, జీవన్ జ్యోతి, సురక్ష బీమా లాంటి పథకాలను కూడా ప్రజల్లోకి ఎంపీలు తీసుకెళ్లాలన్నారు. మరోవైపు హైదరాబాద్‌ బీజేపీ ఆఫీస్‌లో ఆఫీస్‌ బేరర్లు, జిల్లా అధ్యక్షులతో భేటీ ఆయ్యారు కిషన్ రెడ్డి. రాష్ట్రంలో ప్రస్తుత రాజకీయ పరిణామాలు, ప్రభుత్వ వైఫల్యాలపై పోరాట కార్యాచరణ, వన్‌ నేషన్‌ వన్ ఎలక్షన్‌, అటల్‌ జీ శతజయంతి ఉత్సవాలపై చర్చించారు. కాంగ్రెస్ ప్రభుత్వం హామీలు అమలు చేయడంలో పూర్తిగా విఫలమైందని.. ప్రజా పోరాటాలు చేయాలని నేతలకు సూచించారు కిషన్ రెడ్డి.