
జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఈ నెల 24న తెలంగాణలోని కొండగట్టు, ధర్మపురిలో పర్యటించనున్నారు. పవన్ కల్యాన్ రాజకీయ క్షేత్ర పర్యటన కోసం వారాహి వాహనాన్ని ప్రత్యేకంగా తయారు చేయించిన విషయం తెలిసిందే. జనవరి 24న పవన్ కల్యాణ్ కొండగట్టు అంజన్న ఆలయంలో ‘వారాహి’ (Varahi) కి సంప్రదాయ వాహనపూజ నిర్వహించనున్నారు. అనంతరం ధర్మపురి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామిని దర్శించుకోనున్నారు. ఈ మేరకు జనసేన సోమవారం ప్రకటన విడుదల చేసింది. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని కొండగట్టు, ధర్మపురిలో పర్యటించనున్నట్లు జనసేన తెలిపింది.
పవన్ ముందుగా కొండగట్టు వెళ్లి పూజలు చేయనున్నారు. అనంతరం ధర్మపురి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామిని దర్శించుకుని అనుష్టుప్ నారసింహ యాత్ర (32 నారసింహ క్షేత్రాల సందర్శన) శ్రీకారం చుట్టనున్నారు. ధర్మపురిలోని శ్రీ లక్ష్మీ నారసింహ క్షేత్రంలో పూజలు జరిపిన అనంతరం మిగిలిన 31 నారసింహ క్షేత్రాలను సందర్శిస్తారని జనసేన ప్రకటనలో తెలిపింది.
కొండగట్టు, ధర్మపురిలో పూజా కార్యక్రమాలు పూర్తైన తర్వాత తెలంగాణ పార్టీ ముఖ్య నేతలతో పవన్ కల్యాణ్ చర్చించనున్నారు. ఈ సందర్భంగా జనసేన పార్టీ తెలంగాణలో భవిష్యత్తులో అనుసరించబోయే వ్యూహాలు, చేపట్టబోయే కార్యక్రమాల గురించి పవన్ కల్యాణ్ ముఖ్యనేతలకు దిశా నిర్దేశం చేయనున్నారు.
ఇదిలాఉంటే.. సోమవారం జరిగిన కనుమ పర్వదిన వేడుకల్లో పవన్ కల్యాణ్ పాల్గొన్నారు. గోపూజ నిర్వహించారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం..