
ముఖ్యమంత్రి పీఠం అంటేనే బాధ్యతలతో కూడుకున్నది. పగలు నుంచి రాత్రి వరకు రివ్యూలు, సభలు, సమావేశాలతో సీఎం తీరిక లేకుండా బిజీగా ఉంటారు. నిత్యం అధికారిక కార్యక్రమాలతో బిజీగా ఉండేవాళ్లు కాసింత వినోదం కోరుకువడం కామన్. అదేవిధంగా తెలంగాణ సీఎం కావాలన్న తన చిరకాల కలను సాకారం చేసుకున్న రేవంత్ రెడ్డి కూడా తీరిక లేకుండా గడుపుతున్నారు. అయితే ఆయన ఈ రోజు హైదరాబాద్ లోని ఉప్పల్ స్టేడియంలో జరిగే సన్ రైజర్స్ హైదరాబాద్ వర్సెస్ చెన్నై సూపర్ కింగ్స్ మ్యాచ్ కు సీఎం రేవంత్ చూడనున్నట్టు తెలుస్తోంది.
హైదరాబాద్- చెన్నై జట్ల మధ్య జరిగే హైప్రొఫైల్ మ్యాచ్ కు రేవంత్ హాజరుకానున్నారు. ముఖ్యమంత్రి తన కుటుంబ సభ్యులతో కలిసి ఈ మ్యాచ్ లో పాల్గొంటారని సమాచారం. ముఖ్యమంత్రి సౌకర్యార్థం స్టేడియంలో తగిన భద్రతా ప్రోటోకాల్స్ ఏర్పాటు చేస్తున్నట్లు సమాచారం. సాధారణంగా తెలుగు ముఖ్యమంత్రులు క్రికెట్ మ్యాచ్ లకు, ఇతర బహిరంగ కార్యక్రమాలకు వెళ్లడం మనం చూడలేం కానీ రేవంత్ మాత్రం అందుకు భిన్నంగా వ్యవహరిస్తున్నారు. ఈ రోజు రాత్రి 7.30 గంటలకు చెన్నై, హైదరాబాద్ జట్ల మధ్య మ్యాచ్ ప్రారంభం కానుంది.
కాగా ఉప్పల్ క్రికెట్ స్టేడియంలో సన్ రైజర్స్ సూపర్ కింగ్స్ మధ్య జరగబోయే IPL మ్యాచ్ జరగనుండటంతో భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో టీఎస్ఆర్టీసీ ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసింది. ఈ మ్యాచ్ ను ప్రత్యక్షంగా వీక్షించేందుకు వెళ్లే క్రికెట్ అభిమానుల హైదరాబాద్ లోని ప్రధాన ప్రాంతాల నుంచి 60 ప్రత్యేక బస్సులను ఉప్పల్ స్టేడియానికి నడుపుతోంది. ఈ బస్సులు సాయంత్రం 6 గంటలకు ప్రారంభమై.. తిరిగి రాత్రి 11:30 గంటలకు స్టేడియం నుంచి బయలుదేరుతాయి.