AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Indiramma Illu: వారెవ్వా.. నయా టెక్నాలజీ.. 12 రోజుల్లోనే ఇందిరమ్మ ఇల్లు.. ఎలా నిర్మిస్తారంటే..

పేదల సొంతింటి కలను వేగంగా సాకారం చేసే దిశగా తెలంగాణ ప్రభుత్వం షియర్ వాల్ టెక్నాలజీని ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంలో ప్రవేశపెట్టింది. సాధారణంగా మూడు నెలలు పట్టే గృహ నిర్మాణాన్ని ఈ అత్యాధునిక సాంకేతికతతో రెండు వారాల్లోనే పూర్తి చేయవచ్చు. ఇటుకల అవసరం లేకుండా ఆర్‌సీసీ, స్టీల్, అల్యూమినియం ఫార్మ్‌వర్క్‌తో నిర్మించే ఈ విధానం ఖర్చు తగ్గించడంతో పాటు నాణ్యతను పెంచుతుందని అధికారులు చెబుతున్నారు.

Indiramma Illu: వారెవ్వా.. నయా టెక్నాలజీ.. 12 రోజుల్లోనే ఇందిరమ్మ ఇల్లు.. ఎలా నిర్మిస్తారంటే..
Indiramma Houses - Shear Wall Technology
Naresh Gollana
| Edited By: |

Updated on: Jun 06, 2026 | 5:01 PM

Share

పేదవాడి సొంతింటి కలను సాకారం చేస్తూ గుడిసెలు లేని తెలంగాణను నిర్మిస్తామంటోంది రేవంత్ సర్కార్.. పల్లెలు, పట్నాలే కాదు ఆదివాసీ పల్లెల్లోను ఇందిరమ్మ గృహాలను నిర్మించి గిరిజనుల దశాబ్దాల కలను సాకారం చేస్తోంది. అలా ఇలా‌ కాదు కళ్లెదుటే మంత్రం వేసినట్లు శర వేగంగా ఇళ్లను నిర్మిస్తూ భళా అనిపించుకుంటోంది. కేవలం రెండు‌వారాల వ్యవధిలోనే భవన నిర్మాణాన్ని పూర్తి చేసి సరికొత్త చరిత్రకు తెర లేపింది. అదే షియర్ వాల్ టెక్నాలజీ. మహా నగరాల్లో ఆకాశ హర్మ్యాలు, బహుళ అంతస్తుల బిల్డింగ్‌లను కట్టేందుకు ఉపయోగించే ఈ షియర్ వాల్ అత్యాధునిక ఇంజనీరింగ్ టెక్నాలజీ విధానాన్ని.. ఇప్పుడు ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి ఉపయోగిస్తోంది సర్కార్. మారుమూల గిరిజన పల్లెల్లో ప్రయోగాత్మకంగా నిర్మాణాలు పూర్తి చేసి భళా అనిపించుకుంటుంది. తాజాగా కొమురంభీం జిల్లా కెరమెరి మండలం కొఠారీలో షియర్ వాల్ టెక్నాలజీతో కేవలం 12 రోజుల్లోనే ఇంటి నిర్మాణం పూర్తి చేయగా.. ఏకంగా సీఎం రేవంత్ రెడ్డి చేతుల‌ మీదుగా గృహప్రవేశానికి నోచుకుంది. త్వరలోనే రాష్ట్ర వ్యాప్తంగా ఇందిరమ్మ ఇంటి నిర్మాణంలో భాగం కానున్న షియర్ వాల్ టెక్నాలజీ ఇళ్లపై ప్రత్యేక కథనంలో తెలుసుకోండి..

ఇందిరమ్మ ఇళ్లు.. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన పథకం‌. ఇప్పటికే మొదటి విడతలో 4 లక్షల ఇళ్లను మంజూరు చేయగా ఈనెల 1 రాష్ట్ర వ్యాప్తంగా లక్ష ఇళ్ల గృహప్రవేశ కార్యక్రమాలు కొనసాగాయి. అయితే అన్ని గృహప్రవేశాలు ఒక ఎత్తు.. కొమురం భీం జిల్లా కెరమెరి మండలం కొఠారీ గిరిజనం గ్రామంలో సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా పాల్గొన్న గృహప్రవేశాలు ఒక ఎత్తు. ఈ గ్రామంలో 25 ఇందిరమ్మ ఇళ్లను లబ్దిదారులకు అందజేయగా.. అందులో ఒక ఇళ్లు మాత్రం అందరి దృష్టిని ఆకర్షించింది. అదే షియర్ వాల్ టెక్నాలజీతో నిర్మాణం అయిన ఇందిరమ్మ ఇళ్లు.. ఆ ఇంటికి అంత ప్రత్యేకత ఏంటంటే.. ఈ ఇళ్లు నిర్మాణానికి పట్టిన సమయం కేవలం రెండంటే రెండే వారాలు.. అందులోను 12 రోజుల్లోనే ఈ ఇంటినినిర్మించి లబ్దిదారులకు అప్పగించింది గృహ‌ నిర్మాణ శాఖ..

షియర్ వాల్ నూతన సాంకేతిక పద్ధతిలో

సాధారణంగా నగరాల్లో ఆకాశ హర్మ్యాలు, బహుళ అంతస్తుల బిల్డింగ్‌లను కట్టేందుకు ఉపయోగించే ఈ షియర్ వాల్ టెక్నాలజీ అత్యాధునిక ఇంజనీరింగ్ విధానాన్ని.. ఇప్పుడు ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి ఉపయోగిస్తున్నారు. సాధారణంగా ఇసుక, సిమెంట్, ఇటుకలతో ఇంటిని నిర్మించాలంటే.. దాదాపు 90 రోజుల సమయం పడుతుంది. కానీ ఈ సరికొత్త షియర్ వాల్ టెక్నాలజీ విధానంలో కేవలం 12 నుంచి 15 రోజుల్లోనే ఇందిరమ్మ ఇంటి నిర్మాణాన్ని పూర్తి చేసి ఆశ్చర్యానికి గురి చేశారు. వేదన్ ఇన్‌ఫ్రా అనే ప్రైవేట్ సంస్థ.. హౌసింగ్ డిపార్ట్‌మెంట్‌తో కలిసి అల్యూమినియం/స్టీల్ ఫార్మ్‌వర్క్ (షెట్టరింగ్) విధానంలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాన్ని చేపట్టింది. ఈ పద్ధతిలో కేవలం 6 నుంచి 8 మంది భవన నిర్మాణ కార్మికులతోనే ఇంటి నిర్మాణం పూర్తి అవుతుంది. ఈ విధానంలో ఇటుకలను వాడాల్సిన అవసరం ఉండదు. స్టీల్, రీ ఇన్‌ఫోర్స్‌డ్ సిమెంట్ కాంక్రీట్ (ఆర్‌సీసీ)తో ఒకేసారి ఇంటిని నిర్మించడం వల్ల ప్లాస్టరింగ్ వంటి వాటి అవసరం లేకుండా ఖర్చు తగ్గుతుందని సంబంధిత వర్గాలు చెబుతున్నాయి. అంతేకాకుండా గోడలకు పగుళ్లు కూడా రావని పేర్కొంటున్నాయి.

ఇటీవల కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లాలో పర్యటించిన సీఎం రేవంత్ రెడ్డి.. కెరమెరి మండలం కొఠారి గ్రామంలో ఆదివాసీల కోసం ఈ షియర్ వాల్ టెక్నాలజీతో కట్టిన మోడల్ ఇందిరమ్మ ఇంటిని పరిశీలించారు. అదే సమయంలో ఈ ప్రయోగాత్మక గృహ నిర్మాణ నాణ్యతను పరిశీలించారు. షెట్టరింగ్ వేసిన వెంటనే కాంక్రీట్ పోసి.. ఆ తర్వాతి రోజుకే డీషెట్టరింగ్ చేసే ప్రక్రియను విజయవంతంగా పూర్తి చేసిన విధానాన్ని అధికారులు రేవంత్ రెడ్డికి వివరించారు. రాష్ట్రంలోని నాగర్‌కర్నూల్, నిజామాబాద్, కామారెడ్డి, నారాయణపేట్, మెదక్, సంగారెడ్డి జిల్లాల్లో ఇప్పటికే ఈ విధానంలో దాదాపు 150 ఇళ్లను సక్సెస్‌ఫుల్‌గా కట్టినట్లు గృహ నిర్మాణ సంస్థ అధికారులు వెల్లడించారు.

ఇప్పుడు ఇందిరమ్మ ఇళ్లను ఇదే షియర్ వాల్ నూతన సాంకేతిక పద్ధతిలో నిర్మించేందుకు గృహనిర్మాణ సంస్థ ఆలోచన చేస్తోంది. ఆదివాసీ, గిరిజన గ్రామాలతో పాటు మారుమూల ప్రాంతాల్లో లబ్ధిదారులకు అదనపు ఖర్చులు తగ్గించాలంటే కొత్త సాంకేతిక పద్ధతులను సద్వినియోగం చేసుకోవాలని భావిస్తోంది. షీర్వాల్ పద్ధతి అంటే మలేషియాలో తయారైన ఆధునిక సాంకేతిక విధానం. సెల్ఫ్ కాంపాక్ట్ కాంక్రీట్(ఎస్సీసీ)తో కాంక్రీట్, సిమెంటు, ఇసుక, స్టీల్తో నిర్మించే పద్ధతి. స్లాబ్, హాల్స్, బెడ్ రూమ్స్, కిచెన్, టాయ్లెట్స్, స్నానపు గదులన్నింటినీ వేర్వేరుగా ఒకేసారి గోడలు నిర్మించేలా మధ్యలో స్టీల్(రాడ్స్)ను ఉంచడం దీని ప్రత్యేకత. అలా నిర్మించిన వాల్స్ లు ఇరువైపులా అల్యూమినియం పూసి.. స్లాబ్ నుంచి సిమెంటు, కాంక్రీట్, ఇసుక మిశ్రమాన్ని పోస్తారు. అంతా సిమెంటు, కాంక్రీట్, ఇసుక మిశ్రమంతోనే గోడలన్నీ నిర్మిస్తారు. మనకు కావాల్సిన చోట కిటికీలు, దర్వాజాలు, మెట్లు, గదులు సహా వివిధ ఆకృతుల్లో ఏర్పాటు చేసుకోవడమే ఆధునిక సాంకేతిక పద్ధతి..

రూ.5 లక్షలతో..

కళ్లెదుటే మంత్రం వేసినట్లు షియర్ వాల్ టెక్నాలజీ ద్వారా శరవేగంగా ఇల్లు ఆవిష్కృతం అవుతుంది. ఆర్థికంగా వెనుకబడిన నిరుపేద కుటుంబాలకు సకల వసతులతో ఈ టెక్నాలజీ ద్వారా ఇంటిని నిర్మించి ఇవ్వవచ్చు అంటున్నారు అధికారులు.. ఈ టెక్నాలజీని సామాన్యుడికి చేరువ చేస్తే వారి జీవితాల్లో ఎంతటి గొప్ప వెలుగులు నింపవచ్చో ఈ ఇందిరమ్మ ఇళ్లు స్పష్టంగా నిరూపిస్తున్నాయి. ప్రభుత్వం మంజూరుచేసే ఇంటి నిర్మాణానికి 401 స్క్వేర్ ఫీట్ల వైశాల్యం అవసరం. ఓ పడకగది, బాత్రూం, మరో హాల్, వంటగది, బయట టాయ్లెట్ నిర్మాణానికి ప్రభుత్వం రూ.5 లక్షలు ఇస్తోంది. సొంత స్థలం కలిగిన లబ్ధిదారులు సైతం నిర్ణీత డబ్బులతో ఇంటిని నిర్మించడం ఆర్థికంగా కొంత భారం అవుతుందని గృహనిర్మాణ సంస్థ దృష్టికి వచ్చింది. ఆదివాసీ, గిరిజన ప్రాంతాల్లో ఇటుక, ఇసుక రవాణా కష్టం అవుతుంది. నిర్మాణం కోసం మేస్ట్రీకి చెల్లించే డబ్బులు అదనమే. అన్ని ఖర్చులు పరిగణనలోకి తీసుకుంటే లబ్ధిదారులు సొంతంగా కనీసం రూ.2 లక్షలకు పైగా అదనపు భారం మోయాల్సి వస్తుందని సంస్థ గుర్తించింది. నిర్మాణ బాధ్యతలను కాంట్రాక్టర్లకు అప్పగిస్తే నాణ్యత ఉండటం లేదనే ఆవేదన లబ్ధిదారుల్లో వ్యక్తం అవుతోంది. దీంతో రూ.5 లక్షల వ్యయంతోనే షీర్వాల్ టెక్నాలజీతో ఇందిరమ్మ ఇంటిని నిర్మిస్తే లబ్ధిదారులకు అదనపు ఖర్చు తగ్గుతుందని, ఇంటి నిర్మాణం నాణ్యంగా ఉంటుందనే గృహనిర్మాణ సంస్థ ఛీఫ్ ఇంజనీర్ ఎం.చైతన్యకుమార్ చెపుతున్నారు. షియర్ వాల్ టెక్నాలజీలో ఇంటి నిర్మాణ వ్యయమంతా స్క్వేర్ఫేట్ చొప్పున ఉంటుంది. గోడల నిర్మాణం కోసం వాడే అల్యూమినియం ప్యాడ్స్ ఒక రోజులో స్లాబ్ కోసం వినియోగించే ప్యాడ్స్ 34 గంటల్లో తొలగిస్తారు. పునాది మొదలుకొని ఇంటి నిర్మాణమంతా 15 రోజుల్లోనే పూర్తవుతుంది. అల్యూమినియం ప్యాడ్స్ వినియోగించడంతో రెండోసారి సిమెంటు పూత అవసరం ఉండదంటున్నారు నిపుణులు..

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us