
టెక్నాలజీ ఎంత వేగంగా అభివృద్ధి చెందుతుందో.. అదే స్థాయిలో సైబర్ నేరగాళ్లు కూడా తమ మోసాల పద్ధతులను మార్చుకుంటున్నారు. ఫలితంగా హైదరాబాద్ నగరంలో సైబర్ మోసాల బారిన పడుతున్న వారి సంఖ్య తగ్గినా, ఒక్కో బాధితుడు కోల్పోతున్న మొత్తం మాత్రం భారీగా పెరుగుతోంది. 2026 తొలి ఆరు నెలల్లో నమోదైన సైబర్ నేరాల కారణంగా నగరవాసులు దాదాపు రూ.439 కోట్లను కోల్పోయినట్లు అధికారిక లెక్కలు చెబుతున్నాయి. అంటే సగటున ప్రతి రోజు రూ.2 కోట్లకు పైగా, ప్రతి గంటకు సుమారు రూ.10 లక్షల వరకు నష్టం వాటిల్లుతోంది. గత ఏడాదితో పోలిస్తే ఈసారి నమోదైన కేసుల సంఖ్య తక్కువగానే ఉంది. అయినప్పటికీ నష్టపోయిన మొత్తం దాదాపు గత ఏడాది మొత్తంలో సగానికి చేరుకోవడం ఆందోళన కలిగిస్తోంది. గతంలో వేల సంఖ్యలో చిన్నచిన్న మోసాలు జరిగేవి. ఇప్పుడు మాత్రం కొద్ది కేసుల్లోనే కోట్ల రూపాయల మోసాలు బయటపడుతున్నాయి.
పోలీసుల విశ్లేషణ ప్రకారం ప్రస్తుతం నేరగాళ్లు సాధారణ వ్యక్తులను కాకుండా ఆర్థికంగా బలమైన వారినే లక్ష్యంగా ఎంచుకుంటున్నారు. సోషల్ మీడియా, ఆన్‌లైన్ లావాదేవీలు, వ్యక్తిగత సమాచారం ఆధారంగా బాధితుల వివరాలను ముందుగానే సేకరించి, వారి నమ్మకాన్ని పొందిన తర్వాత పెట్టుబడుల పేరుతో లేదా డిజిటల్ అరెస్ట్ పేరుతో భారీ మొత్తాలను కాజేస్తున్నారు.
ప్రస్తుతం స్టాక్ మార్కెట్ ట్రేడింగ్, క్రిప్టో పెట్టుబడులు, హై రిటర్న్స్ ఇన్వెస్ట్‌మెంట్ స్కీమ్స్ పేరుతో ఎక్కువ మోసాలు నమోదవుతున్నాయి. ముఖ్యంగా ఉద్యోగ విరమణ చేసినవారు, జీవితకాల పొదుపులు ఉన్నవారు ఈ ఉచ్చులో చిక్కుకుంటున్నారని పోలీసులు చెబుతున్నారు. బ్యాంకింగ్ సేవలకు సంబంధించిన థర్డ్ పార్టీ సంస్థల ద్వారా వ్యక్తిగత సమాచారం లీక్ కావడం కూడా ఈ మోసాలకు దోహదపడుతున్నట్లు దర్యాప్తులో తేలుతోంది.
ఇదిలా ఉంటే, సైబర్ మోసాల్లో పోయిన డబ్బును త్వరగా బాధితులకు తిరిగి అందించేందుకు కేంద్ర ప్రభుత్వం ‘మనీ రెస్టోరేషన్ మాడ్యూల్’ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ విధానం ద్వారా బ్యాంకులు, దర్యాప్తు సంస్థల మధ్య సమన్వయం వేగంగా జరిగి రీఫండ్ ప్రక్రియ సులభతరం అవుతుందని అధికారులు చెబుతున్నారు. అయితే ఈ సదుపాయం గురించి ప్రజల్లో ఇంకా పూర్తి స్థాయి అవగాహన లేకపోవడంతో, బాధితులు వెంటనే ఫిర్యాదు చేయడం, అధికారిక హెల్ప్‌లైన్‌లను ఆశ్రయించడం ఎంతో కీలకమని పోలీసులు సూచిస్తున్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి