ప్రజావాణిలో 7వ తరగతి విద్యార్థిని విన్నపం.. వెంటనే స్పందించిన కలెక్టర్‌.. అధికారులకు ఆదేశాలు?

ప్రజావాణిలో పాల్గొనేందుకు వచ్చిన కలెక్టర్‌ని కదిలించిన విన్నపం ఎదురైంది. అదేదో భూమి పంచాయతీ, గెట్టు వివాదం కాదు.. అనారోగ్యం, ఆర్థిక సమస్య అసలే కాదు..అది ఒక చిన్నారి చేసిన అభ్యర్థన. తన భవిష్యత్తుకు సంబంధించిన మార్గదర్శనం కోసం ఆ చిన్నారి చేసిన విన్నపం. చిన్నారి కోరిక విన్న కలెక్టర్‌ ఉన్నపళంగా స్పందించారు. వెంటనే తన కోరిక తీర్చేందుకు సంబంధిత అధికారులను ఆదేశించారు. ఇంతకీ ఆ విన్నపం ఏంటి..? ఏకంగా కలెక్టర్‌ కరిగిపోయేలా చేసిన ఆ వినతి ఏంటో ఇక్కడ చూద్దాం..

ప్రజావాణిలో 7వ తరగతి విద్యార్థిని విన్నపం.. వెంటనే స్పందించిన కలెక్టర్‌.. అధికారులకు ఆదేశాలు?
Collector Helps Girl Resume Education

Edited By:

Updated on: Apr 01, 2026 | 7:10 PM

సాధారణంగా ప్రజావాణి అంటే భూ సమస్యలు, పెన్షన్లు, రేషన్ కార్డుల కోసమే వస్తుంటారు. కానీ, తాజాగా జరిగిన ప్రజావాణిలో ఒక చిన్నారి చేసిన విన్నపం అక్కడున్న అధికారుల మనసులను కలిచివేసింది. నాకు చదువుకోవాలని ఉంది సార్.. నన్ను బడికి వెళ్లేలా చేయండి అంటూ గ్రీష్మ అనే 7వ తరగతి బాలిక కలెక్టర్ ముందు తన ఆవేదనను వెళ్లగక్కింది. జగిత్యాల జిల్లాలో జరిగిన ఈ సంఘటన పూర్తి వివరాల్లోకి వెళితే..

గ్రీష్మ వివరాల ప్రకారం.. ఆమె తల్లి గత కొంతకాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతోంది. ఇంట్లో మరెవరూ దిక్కు లేకపోవడంతో, చిన్న వయసులోనే ఇంటి పనులన్నీ గ్రీష్మ భుజాలపై పడ్డాయి. తల్లికి సేవలు చేస్తూ ఇంటిని చూసుకోవడం వల్ల ఆమె క్రమం తప్పకుండా పాఠశాలకు వెళ్లలేకపోయింది. దీంతో పాత పాఠశాల నుండి టీసీ (TC) రావడంలో జాప్యం జరిగింది. ఆ టీసీ లేదనే కారణంతో కొత్త పాఠశాలలో ఆమెను చేర్చుకోవడానికి అక్కడి యాజమాన్యం నిరాకరించింది. పరీక్షల సమయం దగ్గరపడుతుండటంతో, తన చదువు ఎక్కడ ఆగిపోతుందో అని భయపడిన గ్రీష్మ, నేరుగా కలెక్టరేట్‌కు చేరుకుంది. “సార్, నాకు చదువుకోవాలనే ఆసక్తి ఉంది. టీసీ లేదని బడిలో చేర్చుకోవడం లేదు. ఎలాగైనా నేను పరీక్షలు రాసేలా చూడండి అంటూ కలెక్టర్‌ను వేడుకుంది. బాలిక కళ్ళలో చదువు పట్ల ఉన్న తపనను చూసి జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ చలించిపోయారు.

వీడియో ఇక్కడ చూడండి..

ఇవి కూడా చదవండి

ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకున్న కలెక్టర్, అక్కడే ఉన్న జిల్లా విద్యాశాఖ అధికారి (DEO) రాముతో మాట్లాడారు. ఏ ఒక్క బిడ్డ కూడా టీసీ లేదా ఇతర సాంకేతిక కారణాలతో చదువుకు దూరం కాకూడదని స్పష్టం చేశారు. వెంటనే గ్రీష్మను పాఠశాలలో చేర్చుకుని, ఆమె పరీక్షలు రాసేలా అన్ని ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. కష్టాల్లో ఉన్నా చదువును వదులుకోకూడదనే గ్రీష్మ ధైర్యం, ఆమెకు అండగా నిలిచిన కలెక్టర్ చొరవ ఇప్పుడు అందరి ప్రశంసలు అందుకుంటోంది. బడి బయట ఒక్క పిల్లవాడు ఉన్నా అది సమాజానికి నష్టం అనే మాటను ఈ ఘటన మరోసారి గుర్తు చేసింది.

మరిన్ని తెలంగాణ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

Follow Us