
మింగలేక కక్కలేక అన్నట్లుగా తయారైంది బిఆర్ఎస్ పరిస్థితి. ఎమ్మెల్యేలు ఒక్కరొక్కరుగా సీఎం రేవంత్ రెడ్డిని కలుస్తున్నా.. మౌనంగా ఉంటోంది అధిష్టానం. ఎలా రియాక్ట్ అవుతాయి.? ఎలాంటి పరిణామాలు ఉంటాయో.? అని సతమతమవుతున్నారు పార్టీ పెద్దలు.
మొన్నటివరకు పదేళ్లపాటు అధికారంలో ఉన్న భారత రాష్ట్ర సమితికి ఇప్పుడు గడ్డు పరిస్థితి. 39 మంది ఎమ్మెల్యేలతో గట్టిపక్షంగా ఉన్నా.. గెలిచిన ఎమ్మెల్యేలను మాత్రం కట్టడి చేయలేకపోతోంది. బయటకు గంభీరంగా పార్టీ పెద్దలు కనిపిస్తున్నా.. లోపల మాత్రం కొంత కంట్రోల్ తప్పిన పరిస్థితి. వారం క్రితం కేసీఆర్ సొంత జిల్లా మెదక్ నుంచి నలుగురు ఎమ్మెల్యేలు సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు. అందులో హరీష్‌కు అత్యంత ఆప్తుడైన కొత్త ప్రభాకర్ రెడ్డి ఉండడం పార్టీని షాక్‌కు గురి చేసింది. అయితే ఆ నలుగురు ఎమ్మెల్యేలు మాత్రం ఆ తెల్లారే తెలంగాణ భవన్‌లో మీడియా సమావేశం ఏర్పాటు చేసి పార్టీ మారడం లేదు ముఖ్యమంత్రిని కలవడంలో తప్పేంటి అని ప్రశ్నించారు. అధిష్టానానికి చెప్పకుండా సీఎంని ప్రతిపక్ష ఎమ్మెల్యేలు కలవకూడదా అంటూ ఎదురు ప్రశ్నించారు. బిఆర్ఎస్ పార్టీలోనే కొనసాగుతామంటూ స్పష్టం చేశారు.
ఇదంతా సర్దుకుంటోందన్న టైంలోనే మరో ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ సీఎం రేవంత్ రెడ్డితో భేటీ అయ్యారు. సేమ్ రొటీన్ గానే ముఖ్యమంత్రిని కలిస్తే తప్పేంటి.. నియోజకవర్గ అభివృద్ధి కోసమే కలిశానంటూ చెప్పుకొచ్చారు. ప్రకాష్ గౌడ్ కూడా పార్టీ పెద్దలకు చెప్పకుండానే సీఎంను వెళ్లి కలిశారు. ఇప్పటికి ఐదుగురు ఎమ్మెల్యేలు.. ఇప్పుడున్న రాజకీయ పరిస్థితుల్లో.. పార్లమెంటు ఎన్నికలు దగ్గరపడుతున్న ఈ సమయంలో ప్రతిపక్ష ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రితో భేటీ అవ్వడం అనేది ఆ పార్టీకి కచ్చితంగా ఇబ్బందికరమే. అయినా గులాబీ పార్టీ హై-కమాండ్ మాత్రం దీనిపై ఇప్పటివరకు స్పందించలేదు. పార్టీలో కీలకంగా వ్యవహరించే కేటీఆర్, హరీష్ రావు, కవిత కూడా దీనిపై ఎక్కడా నోరు విప్పలేదు.
ఇందుకు కారణం ఎలా రియాక్ట్ అయితే.. ఏమవుతుందోనన్న అనుమానమే.. అవును.! ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రిని కలిస్తే తప్పేంటి అని పార్టీ హైకమాండ్ కూడా అంటే ఇక మిగతా ఎమ్మెల్యేలు.. అధికార పార్టీ పెద్దలను కలవడానికి లైన్ కడతారు. లేదు ముఖ్యమంత్రిని కలవడం తప్పు.. అది అధిష్టానానికి తెలియకుండా కలవడం కరెక్ట్ కాదు అనే స్టేట్‌మెంట్ ఇస్తే.. ఇప్పుడు రేవంత్ రెడ్డితో భేటీ అయిన ఐదుగురు ఎమ్మెల్యేలపై ఏదో ఒక చర్య తీసుకోవాలి. పార్టీ ఎమ్మెల్యేలు సీఎంతో భేటీ అవ్వడం కరెక్టా? తప్పా?? ఈ విషయంలో ఏ సమాధానం చెప్పలేకపోతున్నారు గులాబీ పెద్దలు. ఏ సమాధానం చెప్పినా.. దాని పరిణామాలు మరో రకంగా ఉంటాయి. ఇందుకోసమే కొన్ని రోజుల పాటు ఈ టాపిక్‌పై మాట్లాడొద్దని నిర్ణయించుకున్నట్లుగా తెలుస్తోంది.