Video: రూ.25 లక్షల కారు.. కొన్న 5 నిమిషాలకే ఖరాబ్! షోరూమ్ వాళ్ల సమాధానం ఇదే..

హైదరాబాద్‌లోని రాయదుర్గంలో రూ.25 లక్షల విలువైన విన్‌ఫాస్ట్ ఎలక్ట్రిక్ కారు కొన్న కస్టమర్‌కు చేదు అనుభవం ఎదురైంది. కొన్న పది నిమిషాలకే కారు ఆగిపోవడంతో షోరూమ్ వద్ద నిరసన చేపట్టారు. సమస్యకు పరిష్కారం లభించకపోవడంతో వినియోగదారుల ఫోరమ్‌ను ఆశ్రయించారు. షోరూమ్ మోటార్ సమస్యను అంగీకరించి, ఉచితంగా రిపేర్ చేస్తామని తెలిపింది.

Video: రూ.25 లక్షల కారు.. కొన్న 5 నిమిషాలకే ఖరాబ్! షోరూమ్ వాళ్ల సమాధానం ఇదే..
Vinfast Car

Updated on: Jun 16, 2026 | 11:53 AM

హైదరాబాద్‌లోని రాయదుర్గం ప్రాంతంలో ఉన్న విన్‌ఫాస్ట్ కంపెనీ కార్ల షోరూమ్ వద్ద ఓ కస్టమర్ ఆందోళనకు దిగిన ఘటన చర్చనీయాంశంగా మారింది. షోరూమ్ నుంచి సుమారు రూ.25 లక్షల విలువైన కొత్త ఎలక్ట్రిక్ కారును కొనుగోలు చేసి.. షోరూమ్ నుంచి ఓ 10 నిమిషాలు డ్రైవ్ చేసిన తర్వాత ఆగిపోయిందని కస్టమర్ ఆరోపిస్తున్నారు. బాధితుడు చెప్పిన వివరాల ప్రకారం.. జూన్ 2న విన్‌ఫాస్ట్‌కు చెందిన వీఎఫ్7 విండ్ ఎలక్ట్రిక్ కారును కొనుగోలు చేశారు. వాహనాన్ని చార్జింగ్ కోసం షోరూమ్‌కు తీసుకువెళ్తున్న సమయంలో కిలోమీటర్ కూడా ప్రయాణించకముందే కారు అకస్మాత్తుగా ఆగిపోయిందని తెలిపారు. వెంటనే ఈ విషయాన్ని షోరూమ్ సిబ్బంది దృష్టికి తీసుకెళ్లినా తగిన స్పందన లభించలేదని ఆయన ఆరోపించారు.

వాహనంలో తలెత్తిన లోపాన్ని సరిచేయడం, కొత్త కారు ఇవ్వడం లేదా చెల్లించిన డబ్బులను తిరిగి ఇవ్వడం వంటి అంశాల్లో సంస్థ నుంచి ఎలాంటి సహకారం అందలేదని బాధితుడు పేర్కొన్నారు. అంతేకాకుండా సమస్య పరిష్కారం కోరుతూ షోరూమ్‌కు వెళ్లిన తనను అక్కడి నుంచి బయటకు పంపించారని కూడా ఆరోపించారు. దీంతో విసిగిపోయిన ఆయన షోరూమ్ ఎదుటే నిరసన చేపట్టారు. ఈ వ్యవహారంపై ఇప్పటికే వినియోగదారుల ఫోరంను ఆశ్రయించినట్లు బాధితుడు వెల్లడించారు.

షోరూమ్ స్పందన..

అయితే వాహనంలో మోటార్ సమస్య వచ్చిందని, దాన్ని పరిష్కరించేందుకు ప్రయత్నిస్తున్నామని షోరూమ్ ఉద్యోగి ఒకరు టీవీ9కు తెలిపారు. కస్టమర్ చెబుతున్నట్లుగా తాము సహకరించకపోవడం అంటూ ఏం లేదని, కస్టమర్‌కు ప్రతి విషయం చెబుతున్నామని అన్నారు. వెహికల్ ఇలా ప్రాబ్లమ్ అయిందనే విషయాన్ని కంపెనీ హెడ్ ఆఫీస్‌కు తెలియజేసినట్లు, వాళ్లు వాహనాన్ని పరిశీలించి, తర్వాత ఏం చేయాలనే విషయాన్ని చెప్తారని వెల్లడించారు. కంపెనీ వియత్నాంకు చెందినది కాబట్టి, ప్రతిదీ అక్కడి నుంచి తమకు కమ్యూనికేట్ చేయాల్సి ఉంటుందని తెలిపారు. కస్టమర్ డిమాండ్లను కంపెనీ పరిశీలించి ఒక నిర్ణయం తీసుకుంటుందని అన్నారు. ప్రస్తుతం కారులో వచ్చిన సమస్యను పూర్తి ఉచితంగా పరిష్కరిస్తామని కూడా ఆయన తెలిపారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us