ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో హైదరాబాద్ (Hyderabad) మహా నగరం తడిసి ముద్దవుతోంది. రెండు రోజులుగా విరామం లేకుండా కురుస్తున్న వర్షానికి లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఈ పరిస్థితులతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హైదరాబాద్ నగర ప్రజలకు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ (Minister Talasani) విజ్ఞప్తి చేశారు. మరో రెండు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరారు. అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని సూచించారు. అధికారులు కూడా అప్రమత్తంగా ఉండి ప్రజలు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని ఆదేశించారు. జీహెచ్ఎంసీ (GHMC) అధికారుల సహాయం కోసం 21111111 టోల్ ఫ్రీ నెంబర్ ను సంప్రదించాలని చెప్పారు. కార్పొరేటర్ లు డివిజన్ లలో పర్యటిస్తూ పరిస్థితులు ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదులపై తక్షణమే స్పందించాలని ఉత్తర్వులు జారీ చేశారు. వాగులు, వంతెనలు, చెరువుల వద్ద ప్రమాదకర పరిస్థితులు ఎదురుకాకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, అవసరమైతే ప్రజల్ని సురక్షిత ప్రాంతాలకు వెళ్లే విధంగా అధికారులు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని స్పష్టం చేశారు.
మరోవైపు.. నైరుతి రుతుపవనాల ప్రభావంతో తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. నిజామాబాద్ జిల్లా నవీపేటలో అధికంగా 20.6 సెంటీమీటర్లు, నిర్మల్ జిల్లా ముథోల్‌లో 19.1, భైంసాలో 16.5 సెంటీమీటర్లు వర్షపాతం నమోదైంది. నైరుతి సీజన్‌లో ఇప్పటివరకు 18.9 సెంటీమీటర్ల సాధారణ వర్షపాతం నమోదు కావాల్సి ఉండగా.. ఈసారి 30.5 సెంటీమీటర్లు నమోదైంది. రాష్ట్రంలోని 18 జిల్లాల్లో అత్యధిక, 15 జిల్లాల్లో అధిక వర్షపాతం నమోదైంది.
రుతుపవనాలకు తోడు బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. ఫలితంగా మరో రెండు, మూడు రోజులు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ అధికారులు చెబుతున్నారు. కుమురంభీం ఆసిఫాబాద్, ఆదిలాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్ జిల్లాల్లో భారీగా వానలు పడతాయని వెల్లడించారు. ఈ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్‌ను జారీ చేసింది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి