
Global Summit: తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. హైదరాబాద్‌లోని పలు రోడ్లకు ప్రముఖుల పేర్లు పెట్టాలని నిర్ణయించారు. ఈ మేరకు ఫ్యూచర్ సిటీ ప్రధాన రహదారికి రతన్ టాటా పేరు పెట్టనుండగా.. US కాన్సులేట్ రోడ్డుకు ట్రంప్ ఎవెన్యూగా నామకరణం చేయనున్నారు. ఇక గూగుల్ స్ట్రీట్ పేరుతో ఒక రహదారికి పేరు పెట్టనుండగా.. మైక్రోసాఫ్ట్ రోడ్, విప్రో జంక్షన్ల పేర్లను పరిశీలిస్తున్నారు. వీటి పేర్లపై కేంద్ర విదేశాంగ శాఖకు తెలంగాణ ప్రభుత్వం లేఖ రాయనుంది. అలాగే అమెరికా రాయబార కార్యాలయానికి లేఖ రాయాలని సీఎం రేవంత్ నిర్ణయించారు. రేవంత్ సర్కార్ ఏర్పడి రెండు సంవత్సరాలు పూర్తి కావడం, గ్లోబల్ సమ్మిట్‌కు సిద్దమైన క్రమంలో ఈ నిర్ణయం తీసుకోవడం చర్చనీయాంశంగా మారింది. హైదరాబాద్ బ్రాండ్‌ను పెంచడం, ప్రముఖులను గౌరవించడంలో భాగంగానే నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.
హైదరాబాద్ వేదికగా గ్లోబల్ సమ్మిట్ నిర్వహణకు అన్నీ ఏర్పాట్లు పూర్తయ్యాయి. సోమవారం నుంచి ఫ్యూచర్ సిటీలో రెండు రోజుల పాటు జరగనున్న ఈ సదస్సులో 44కు పైగా దేశాల నుంచి 154 మంది ప్రతినిధులు హాజరుకానున్నాని తెలుస్తోంది. అంతర్జాతీయంగా పేరొందిన కంపెనీల నుంచి అనేకమంది ప్రతినిధులు ఈ సమ్మిట్ లో పాల్గొంటున్నారు. అమెరికా నుంచే 46 మంది వివిధ కంపెనీల ప్రతినిధులు హాజరుకానున్నట్లు తెలుస్తోంది.ఈ సమ్మిట్‌లో నోబెల్ బహుమతి గ్రహీత అభిజిత్ బెనర్జీ, ట్రంప్ మీడియా-టెక్నాలజీ గ్రూప్ సీఈఓ ఎరిక్ స్వైడర్, వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ సీఈవో జెరెమీ జుర్గెన్స్, నోబెల్ శాంతి బహుమతి గ్రహీత కైలాష్ సత్యార్థి, బయోకాన్ లిమిటెడ్ ఎగ్జిక్యూటివ్ చైర్‌పర్సన్ కిరణ్ మజుందార్-షాతో పాటు పలువురు ప్రసంగించనున్నారు. అనంతరం సీఎం రేవంత్ రెడ్డి ప్రసంగం ఉండనుంది. ప్రభుత్వ పాలన, పెట్టుబడులకు అవకాశాలు, కంపెనీలకు ప్రభుత్వ సహకారం, విజన్ 2047 డాక్యుమెంట్ లక్ష్యాలు, భారత్ ఫ్యూచర్ సిటీపై రేవంత్ మాట్లానున్నారు.
ఇక అథిధులకు తెలంగాణతో పాటు హైదరాబాద్ ప్రత్యేకతలు తెలిసేలా ప్రచార సామాగ్రిని ప్రభుత్వ సిద్దం చేసింది. ఎయిర్ పోర్టు నుంచి ఫ్యూచర్ సిటీ వరకు వివిధ రూపాల్లో ప్రదర్శన ఏర్పాట్లు చేశారు. అలాగే నగరలో కూడా ప్రచారం ఏర్పాట్లు చేశారు. లైటింగ్ ప్రొజెక్షన్, 3D ప్రాజెక్షన్ మ్యాపింగ్, ఎల్ఈడీ స్క్రీన్స్ తో ప్రచారం చేయనున్నారు. ఇక ఈ మీటింగ్‌లో అతిధుల కోసం ప్రముఖ టాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి సంగీత కచేరి కూడా ఏర్పాటు చేశారు. ఇక నాగార్జున సాగర్ దగ్గర ఉన్న బుద్ధవనంను ప్రతినిధులు దర్శించేలా టూరిజం శాఖ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. ఇక ప్రతినిధులకు హైదరాబాదీ బిర్యానీతో పాటు, తెలంగాణ ప్రసిద్ద వంటలతో భోజనాలను అందించనున్నారు. అలాగే ప్రత్యేక సావనీర్లకు కూడిన బహుమతిని ప్రభుత్వం తరపున అందించనున్నారు. తెలంగాణ ప్రత్యేకమైన వంటలైన ఇప్ప పువ్వు లడ్డు, సకినాలు, చెక్కలు, బాదం కీ జాలి, నువ్వుల ఉండలు, మక్క పేలాలతో కూడిన మరో ప్రత్యేక బాస్కెట్ ను కూడా అతిధులకు గిఫ్ట్‌గా అందించనున్నారు.