Telangana: బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్ట్‌పై బిగ్ అప్‌డేట్.. హైదరాబాద్‌కు మీదుగా 3 కారిడార్‌లకు గ్రీన్‌సిగ్నల్
తెలంగాణను దేశ హైస్పీడ్ రైలు నెట్‌వర్క్‌తో అనుసంధానించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. హైదరాబాద్‌ను కేంద్రంగా చేసుకుని ప్రతిపాదించిన మూడు బుల్లెట్ ట్రైన్ కారిడార్లకు సంబంధించిన సవరించిన ఎలైన్‌మెంట్‌లు, స్టేషన్లు, డిపోల ప్రతిపాదనలకు రాష్ట్ర మంత్రిమండలి ఆమోదం తెలిపింది.

తెలంగాణ నుంచి చేపట్టబోతున్న బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టు విషయంలో కీలక ముందడుగు పడింది. హైదరాబాద్–పుణె–ముంబయి, హైదరాబాద్–బెంగళూరు, హైదరాబాద్–చెన్నై కారిడార్ల మొత్తం పొడవు 2,028 కిలోమీటర్లు. ఇందులో తెలంగాణ పరిధిలోనే 512 కిలోమీటర్ల మేర బుల్లెట్ ట్రైన్ ట్రాక్ నిర్మాణం జరగనుంది. దీంతో దేశ హైస్పీడ్ రైలు ప్రాజెక్టుల్లో తెలంగాణ కీలక భాగస్వామిగా మారనుంది.
శంషాబాద్‌లో మెగా బుల్లెట్ ట్రైన్ హబ్
మూడు కారిడార్లకు ఉమ్మడి కేంద్రంగా శంషాబాద్‌ను అభివృద్ధి చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇక్కడే ప్రధాన హైస్పీడ్ రైల్వే స్టేషన్, రోలింగ్ స్టాక్ డిపో, వర్క్‌షాప్ ఏర్పాటు చేయనున్నారు. ఇందుకోసం 400 ఎకరాల భూమిని కేటాయించేందుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
ఫ్యూచర్ సిటీకి ప్రాధాన్యం
రాష్ట్ర ప్రభుత్వ సూచనల మేరకు హైదరాబాద్–చెన్నై, హైదరాబాద్–బెంగళూరు కారిడార్ల మార్గాల్లో మార్పులు చేశారు. ఫ్యూచర్ సిటీ అభివృద్ధిని దృష్టిలో ఉంచుకుని రెండు ప్రాజెక్టుల ఎలైన్‌మెంట్‌ను ఆ ప్రాంతం మీదుగా మార్చారు. భవిష్యత్ నగరాభివృద్ధికి అనుగుణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం భావిస్తోంది.
కొత్త స్టేషన్లతో మారిన ప్రణాళిక
హైదరాబాద్–బెంగళూరు కారిడార్‌లో భారత్ ఫ్యూచర్ సిటీ, అమనగల్లు, నల్లమల, సోమశిల స్టేషన్లు ప్రతిపాదించారు. హైదరాబాద్–చెన్నై మార్గంలో భారత్ ఫ్యూచర్ సిటీ, డ్రైపోర్ట్, నాగార్జునసాగర్, వాడపల్లి స్టేషన్లు ఉండనున్నాయి. హైదరాబాద్–పుణె–ముంబయి మార్గంలో శంషాబాద్, సైబరాబాద్, అనంతగిరి ప్రాంతాల్లో స్టేషన్లు ప్రతిపాదించారు.
వికారాబాద్ వద్ద 4.6 కి.మీ. సొరంగ మార్గం
హైదరాబాద్–పుణె–ముంబయి కారిడార్‌లో వికారాబాద్ సమీపంలో సుమారు 4.6 కిలోమీటర్ల పొడవైన టన్నెల్ నిర్మించనున్నారు. భౌగోళిక పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని ఈ సొరంగ మార్గాన్ని రూపొందించనున్నట్లు అధికారులు పేర్కొంటున్నారు.
గంటకు 350 కి.మీ. వేగంతో రైళ్లు
ప్రతిపాదిత బుల్లెట్ ట్రైన్లు గంటకు గరిష్టంగా 350 కిలోమీటర్ల డిజైన్ వేగంతో ప్రయాణించేలా ప్రణాళిక రూపొందిస్తున్నారు. వేగవంతమైన ప్రయాణంతో పాటు ప్రధాన నగరాల మధ్య ప్రయాణ సమయం గణనీయంగా తగ్గనుంది.
మెట్రోతో అనుసంధానం
హైస్పీడ్ రైలు స్టేషన్లను వీలైనంత వరకు హైదరాబాద్ మెట్రో రైలు నెట్‌వర్క్‌తో అనుసంధానించేందుకు ప్రణాళిక సిద్ధమవుతోంది. దీంతో నగరంలోని ఇతర ప్రాంతాల నుంచి బుల్లెట్ ట్రైన్ స్టేషన్లకు చేరుకోవడం మరింత సులభం కానుంది.
తదుపరి ప్రక్రియ ఏమిటి?
క్యాబినెట్ ఆమోదం అనంతరం ఈ ప్రతిపాదనలను నేషనల్ హైస్పీడ్ రైల్ కార్పొరేషన్‌కు పంపనున్నారు. తుది ఎలైన్‌మెంట్, స్టేషన్ల స్థానాలు, డీపీఆర్ ఆమోదం, భూసేకరణ, పర్యావరణ అనుమతుల ప్రక్రియ పూర్తయ్యాక నిర్మాణ పనులు ప్రారంభం కానున్నాయి. ప్రభుత్వం ఇప్పటికే సంబంధిత శాఖలకు భూసేకరణ, యుటిలిటీల మార్పిడి, అనుమతుల ప్రక్రియను వేగవంతం చేయాలని ఆదేశించింది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
