మంచి ఉద్యోగం.. 15 రోజుల్లో పెళ్లి.. అంతా రెడీ చేసుకుంటోంది.. ఈ క్రమంలోనే ప్రెగ్నెన్సీ కన్ఫామ్ అవ్వడంతో డిప్రెషన్‌లోకి వెళ్లింది. ప్రియుడికి ఫోన్ చేసి చెప్పింది.. ఆ తర్వాత క్షణికావేశంలో దారుణ నిర్ణయం తీసుకుంది.. ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడింది. ఈ దారుణ ఘటన హైదరాబాద్‌లో చోటుచేసుకుంది. అత్తాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఈ ఘటన కలకలం రేపింది. సహజీవనం చేస్తున్న యువకుడితో వచ్చేనెల 12న పెళ్లి చేసుకోవడానికి ఏర్పాట్లు చేసుకుంటున్న యువతి అనూహ్యంగా ఆదివారం తెల్లవారుజామున బలవన్మరణానికి పాల్పడినట్లు పోలీసులు తెలిపారు.. అత్తాపూర్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బిహార్ రాష్ట్రానికి చెందిన అదితి భరద్వాజ్(34) కొన్ని సంవత్సరాల క్రితం హైదరాబాద్ నగరానికి వచ్చి స్థిరపడింది. సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా పనిచేస్తున్న అదితి.. గతంలో ఓ వ్యక్తిని వివాహం చేసుకుంది. ఆ తర్వాత విడాకులు తీసుకుంది. అనంతరం మణికొండలో నివాసం ఉంటోంది. ఈ సమయంలో కొంతకాలంగా తనతో కలిసి పనిచేసే చింతల్‌మెట్‌కు చెందిన మహ్మద్‌అలీతో అదితి సహజీవనం చేస్తోంది. దీంతో అలీ.. అత్తాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని హ్యాపీహోమ్స్ కాలనీలో ఓ అపార్ట్‌మెంట్‌లో ఫ్లాట్‌ను అద్దెకు తీసుకుని.. అదితిని ఉంచాడు. వచ్చేనెల 12న ఇద్దరు పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకుని దానికి సంబంధించిన ఏర్పాట్లు చేసుకుంటున్నారు.
ఈ క్రమంలో రెండు రోజుల క్రితం ఆరోగ్యం బాగా లేకపోవడంతో అదితి భరద్వాజ్ ఆసుపత్రికి వెళ్లింది. పరీక్షించిన వైద్యులు.. అదితి గర్భం దాల్చినట్లు తెలిపారు. అప్పటినుంచి మనస్తాపంతో ఉన్న అదితి.. డిప్రెషన్ లోకి వెళ్లిపోయింది. ఆదివారం తెల్లవారుజామున మహ్మద్ అలీకి ఫోన్‌చేసి తాను తీవ్ర ఒత్తిడిలో ఉన్నానంటూ చెప్పి ఉరేసుకుని ప్రాణాలు తీసుకుంది. ఫోన్ తర్వాత వెంటనే అలీ.. ఫ్లాట్‌కు చేరుకుని చూడగా.. అదితి ఫ్యాన్‌కు ఉరేసుకొని కనిపించింది.
దీంతో అలీ అత్తాపూర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు .. పరిశీలించి వివరాలు సేకరించారు. అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు అత్తాపూర్ ఇన్‌స్పెక్టర్ యాదగిరి తెలిపారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..