
వెంకట మాధవి హత్య కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. పోలీసుల విచారణలో గంటకో నిజాన్ని బయటపెడుతున్నాడు కిల్లర్ గురుమూర్తి. ఓ మహిళతో వివాహేతర సంబంధం కారణంగానే గురుమూర్తి ఈ దారుణానికి ఒడిగట్టినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. తాజాగా ఆయన మొబైల్‌లో ఓ మహిళ ఫోటోలు గుర్తించినట్టు సమాచారం. ఇదే విషయమై వారిద్దరి మధ్య గొడవ జరిగినట్టుగా తెలుస్తోంది. అయితే పోలీసుల నుంచి ఈ కేసు విషయమై ఇంకా అధికారిక ప్రకటన రాలేదు. ఇదిలా ఉంటే.. గురుమూర్తి నడిపిన క్రైమ్ కథ ఖాకీలతో పాటు సభ్య సమజాన్ని నివ్వెరపోయేలా చేస్తోంది.
గురుమూర్తి ఆర్మీలో పనిచేసి రిటైర్ అయ్యాడు. 13ఏళ్ల క్రితం మాధవిని పెళ్లి చేసుకున్నాడు. ఇద్దరు పిల్లల తండ్రి అయినా భార్యను అనుమానించడం మానలేదు. అనుమానం పెనుభూతమై.. భార్యను చంపాలని స్కెచ్చేశాడు. సంక్రాంతి సెలవుల్ని అడ్డం పెట్టుకుని.. పిల్లల్ని అత్తామామ ఇంటికి పంపాడు. రెండు రోజుల తర్వాత అంటే ఈ నెల 15న మాధవిని కిరాతకంగా చంపేశాడు. మటన్ కొట్టే చెక్కముక్కను ఉపయోగించి మృతదేహాన్ని ముక్కలు ముక్కలుగా నరికాడు. కుక్కర్‌లో ఉడకబెట్టి.. ఆ తర్వాత ఎండబెట్టి పొడిగా మార్చాడు. పౌడర్‌ని జిల్లెలగూడ చందన చెరువులో కలిపేశాడు. ఈ క్రమంలో యూట్యూబ్‌లో మర్డర్ చేశాక ఎస్కేప్ ఎలా అనే వీడియోలను పదే పదే చూశాడట గురుమూర్తి.
ఎవరికీ అనుమానం రాకుండా మాధవి తనతో గొడవ పెట్టుకుని ఇంట్లోంచి వెళ్లిపోయిందని నమ్మించాడు. కానీ మాధవి తల్లిదండ్రులు గురుమూర్తి మాటల్ని నమ్మలేదు. తమ బిడ్డ ఆచూకీ చెప్పాలని మీర్‌పేట్ పోలీసుల్ని ఆశ్రయించారు. కేసు నమోదు చేసిన పోలీసులు.. గురుమూర్తిని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తే.. భయంకరమైన నిజాలు బయటికొచ్చాయి. మృగాన్ని మించిన కిరాతకం… సైకోలు సిగ్గుపడే అమానవీయం.. గురుమూర్తిని ప్రశ్నిస్తున్న పోలీసులు.. స్టేట్‌మెంట్ రికార్డ్ చేస్తున్నారు. దాని ఆధారంగా ఆధారాలు సేకరించే పనిలో ఉన్నారు.
మరిన్ని తెలంగాణ న్యూస్ కోసం క్లిక్ చేయండి