చనిపోదామని రైలు పట్టాలపైకి.. చివరి నిమిషంలో ప్లాన్ మార్చిన సైకో కిల్లర్ రాజ్‌కుమార్‌

షాబాద్‌లో ఆరుగురిని దారుణంగా హత్య చేసి పరారైన నిందితుడు రాజ్‌కుమార్ కోసం పోలీసులు ముమ్మర గాలింపు కొనసాగిస్తున్నారు. హత్యల అనంతరం తిమ్మాపూర్ రైల్వే స్టేషన్ సమీపానికి చేరుకున్న రాజ్‌కుమార్ రైలు పట్టాలపై నడుస్తూ ఆత్మహత్యకు ప్రయత్నించినట్లు సీసీటీవీ దృశ్యాల్లో గుర్తించినట్లు సమాచారం. అయితే చివరి క్షణంలో నిర్ణయం మార్చుకుని అక్కడి నుంచి వెళ్లిపోయినట్లు అనుమానిస్తున్నారు.

చనిపోదామని రైలు పట్టాలపైకి.. చివరి నిమిషంలో ప్లాన్ మార్చిన సైకో కిల్లర్ రాజ్‌కుమార్‌
Shabad Psycho Killer Rajkumar

Updated on: Jul 13, 2026 | 9:55 AM

వేరీజ్ దట్ రూత్‌లెస్ కిల్లర్..? ముక్కుపచ్చలారని పసికందులతో సహా ఆరుగురుని అతికిరాతకంగా చంపేసిన షాబాద్ హంతకుడు ఇప్పుడు ఎక్కడున్నాడు? రాష్ట్రవ్యాప్తంగా ఇప్పుడిదే చర్చనీయాంశంగా మారింది?.. ఘటన జరిగి 48గంటలు దాటినా.. ఇప్పటిదాకా ఆచూకీలేని రాజ్‌కుమార్‌.. ఎక్కడున్నాడనేది అంతుచిక్కడం లేదు. అత్యంత ఘోరంగా, అమానవీయంగా.. అంతమంది ప్రాణాలు పొట్టనపెట్టుకున్నాక.. అతడెక్కడికి వెళ్లాడు? ఎక్కడ తలదాచుకుంటున్నాడు? అసలు ప్రాణాలతో ఉన్నాడా? లేక తాను కూడా ఆత్మహత్య చేసుకున్నాడా? ఈ కేసులో అటు పోలీసులకు.. ఇటు జనాలకు… ఇవే అంతుచిక్కని ప్రశ్నలు.. ఇప్పటికే దర్యాప్తు ముమ్మరం చేసిన పోలీసులు… కనిపిస్తే చెప్పండంటూ ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నారు.

ఈనెల 10న ఆరుగురిని కిరాతకంగా చంపేసి పరారైన రాజ్ కుమార్.. ఎక్కడ దాక్కున్నానేది మిస్టరీగా మారింది. పక్క స్కెచ్‌ ప్రకారం.. ఈ మర్డర్స్‌ చేసిన రాజ్‌కుమార్‌… సొంత కారుకు బదులు షాద్‌నగర్‌ నుంచి వెళ్లి సెల్ఫ్‌ డ్రైవ్‌ కారు అద్దెకు తెచ్చుకున్నట్టు తెలుస్తోంది. హత్యల అనంతరం.. అదే కారులో రైల్వే స్టేషన్‌ వైపు వెళ్లినట్టు పోలీసులు గుర్తించారు. కారు అక్కడే వదిలేసి… కొద్దిసేపు పట్టాలపై నడుస్తూ… రైలుకు ఎదురెళ్లి ప్రాణాలు తీసుకోవాలనుకున్నాడు. అయితే రైలు దగ్గరికి రాగానే.. అతను పక్కకు తప్పుకొన్నట్టు… సీసీ కెమెరాల్లో రికార్డయినట్టు తెలుస్తోంది. దీంతో అతను రైలు ఎక్కి వెళ్లిపోయాడా? .. లేక మరెక్కడైనా దాక్కున్నాడా..? అనేది ప్రశ్నార్థకంగా మారింది.

వెలుగులోకి సంచలన నిజాలు..

బృందాలుగా రాజ్‌కుమార్‌ కోసం గాలింపు చేపట్టిన పోలీసులకు కీలక విషయాలు తెలిశాయ్‌. రాజ్‌కుమార్‌ మొత్తం 4 ఫోన్లు, 16 సిమ్‌కార్డులు ఉపయోగిస్తున్నట్లు పోలీసుల దర్యాప్తులో బయటపడింది. శుక్రవారం రాత్రి హత్యలు చేశాక… 11.50కి నిందితుడు ఫోన్‌ స్విచ్ఛాఫ్‌ చేసినట్టు పోలీసులు గుర్తించారు. ప్రస్తుతం ఆ ఫోన్లు, సిమ్‌కార్డుల్లో ఒక్కటి కూడా వాడటం లేదని తేలింది. హత్యలు చేశాక.. అదే అద్దెకారులో నందిగామ, కొత్తూరు, షాబాద్‌ మండలాల్లోని నిర్మానుష్య ప్రాంతాల్లో తిరిగాడు రాజ్‌కుమార్‌. కొత్తూరు మండలం తిమ్మాపూర్‌ రైల్వేస్టేషన్‌ సమీపంలోకి రాగానే పెట్రోలు అయిపోవడంతో ఆ కారును అక్కడే వదిలేసినట్టు తెలుస్తోంది. పక్కనే జాతీయ రహదారి ఉండడంతో… బెంగళూరు, శ్రీశైలం రూట్లో పరారై ఉండొచ్చనే అనుమానాలూ వ్యక్తమవుతున్నాయి. గతంలో నిందితుడు శ్రీశైలం వెళ్లి ఎక్కువగా గడిపేవాడనే విషయంలో పోలీసు విచారణలో తేలింది. దీంతో, ఆకోణంలో… అక్కడికెళ్లి గాలించింది దర్యాప్తు బృందం. హైదరాబాద్‌ నుంచి బెంగళూరు వెళ్లే మార్గంలోని హోటళ్లు, లాడ్జీలు, దాబాల్లో విస్తృతంగా తనిఖీలు చేపట్టారు.

మిస్టరీగా మారిన కిల్లర్‌ రాజ్‌కుమార్‌ ఆచూకీ

ఇక.. రాజ్‌కుమార్‌ కుటుంబ సభ్యులు, సన్నిహితులను.. అదుపులోకి తీసుకుని పోలీసులు రహస్యంగా విచారిస్తున్నట్టు తెలుస్తోంది. ఫ్యూచర్‌ సిటీ పోలీస్‌ కమిషనర్‌ తరుణ్‌జోషి, చేవెళ్ల డీసీపీ యోగేశ్‌ గౌతమ్‌… కేసు పురోగతిపై ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. షాబాద్‌ పోలీస్‌స్టేషన్‌లో ఎక్కువ సమయం గడుపుతున్న యోగేశ్‌ గౌతమ్‌… గాలింపు బృందాలతో ప్రతీక్షణం కో ఆర్డినేట్‌ చేస్తున్నారు. గాలింపు కోసం ఎస్‌వోటీ, ఇతర పోలీస్‌ సిబ్బందిని కూడా రంగంలోకి దించారు. మరోవైపు, నరమేథం సృష్టించిన కిల్లర్‌ రాజ్‌కుమార్‌ను కఠినంగా శిక్షించాలని కొందరంటుంటే… ఎన్‌కౌంటర్‌ చేయాలనే డిమాండ్లు కూడా వినిపిస్తున్నాయ్‌. అయితే రాజ్‌కుమార్‌ను పోలీసులు పట్టుకున్నారనే ప్రచారం కూడా జరుగుతోంది. అతణ్ని రహస్య ప్రదేశంలో ఉంచారనే టాక్‌ కూడా వినిపిస్తోంది. ఈ పుకార్లు, ప్రచారాలు ఎంత వరకు నిజమో తెలియదుగాని… కిల్లర్‌ రాజ్‌కుమార్‌ ఎక్కడ? అనే సస్పెన్స్‌కు ఎప్పుడు తెరపడుతుందన్నదే ఆసక్తిరేపుతోంది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us