Secunderabad: మీ పార్శిల్ డెలివరీ మళ్లీ ఫెయిల్ అంటూ కొరియర్ కంపెనీ నుంచి లింక్.. ఓపెన్ చేయగానే..

కొరియర్‌ కంపెనీ పేరుతో వచ్చిన నకిలీ మెసేజ్‌ను నమ్మి సికింద్రాబాద్‌ వ్యక్తి రూ.2.47 లక్షలు కోల్పోయాడు. లింక్‌ క్లిక్‌ చేసిన క్షణాల్లోనే ఫోన్‌ హ్యాంగ్‌ అయి, ఓటీపీలతో ఖాతా ఖాళీ అయ్యింది. ఇలాంటి మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు. ..

Secunderabad: మీ పార్శిల్ డెలివరీ మళ్లీ ఫెయిల్ అంటూ కొరియర్ కంపెనీ నుంచి లింక్.. ఓపెన్ చేయగానే..
Cyber Fraud

Edited By: Ram Naramaneni

Updated on: Nov 05, 2025 | 6:59 PM

రోజుకో రకమైన మోసం.. ఆదమరిస్తే ఖాతాల్లోని సొమ్మంతా ఖేల్ ఖతం. తాజాగా కొరియర్‌ సంస్థ పేరుతో పంపిన నకిలీ మెసేజ్‌ను నమ్మి ఓ వ్యక్తి రూ.2.47 లక్షలు పోగొట్టుకున్నాడు. సికింద్రాబాద్‌కు చెందిన 36 ఏళ్ల వ్యక్తి ఈ సైబర్ మోసానికి బలయ్యాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బాధితుడికి ఇటీవల ఓ మెసేజ్‌ వచ్చింది. అందులో “మీ పార్సిల్‌ రెండోసారి డెలివరీ కూడా ఫెయిలైంది” అంటూ ఒక లింక్‌ ఇచ్చారు. అయితే బాధితుడు తన వాహనానికి సంబంధించిన రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ (RC) వస్తుందని ఎదురుచూస్తుండటంతో, ఆ మెసేజ్‌ నిజమని భావించి అందులోని లింక్‌పై క్లిక్‌ చేశాడు. వెంటనే ఫోన్‌ స్క్రీన్‌ హ్యాంగ్‌ అయ్యింది. కాసేపట్లో వరుసగా ఓటీపీలు రావడం మొదలైంది. కొద్ది నిమిషాల్లోనే అతని క్రెడిట్ కార్డు ద్వారా రూ.2.47 లక్షలు ఖాళీ అయినట్లు అలర్ట్‌ మెసేజ్‌లు వచ్చాయి. తక్షణమే అప్రమత్తమైన బాధితుడు బ్యాంక్ యాప్‌ ద్వారా కార్డును లాక్‌ చేసి, కోటక్‌ బ్యాంక్‌ హెల్ప్‌లైన్‌కి కాల్‌ చేసి కార్డును బ్లాక్‌ చేయించుకున్నాడు.

ఈ ఘటనపై సైబర్‌ క్రైమ్‌ పోలీసులు ప్రజలకు కొన్ని సూచనలు జారీ చేశారు. ఇటీవల కొరియర్ కంపెనీల పేరుతో నకిలీ మెసేజ్‌లు, లింకులు పంపే సైబర్ మోసాలు పెరుగుతున్నాయని హెచ్చరించారు.ఇలాంటి సందేశాలను నమ్మవద్దని.. కొరియర్‌ వివరాలను తెలుసుకోవాలంటే, ఆయా సంస్థల అధికారిక వెబ్‌సైట్లు లేదా యాప్‌ల ద్వారానే ధృవీకరించుకోవాలన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఓటీపీ, పిన్‌ లేదా కార్డ్‌ వివరాలు ఎవరితోనూ పంచుకోకూడదని పోలీసులు సూచించారు. అలాగే, బ్యాంక్ ఖాతాలు, క్రెడిట్‌ కార్డ్‌ లావాదేవీలను అధికారిక యాప్‌ల ద్వారా తరచూ పరిశీలించాలని, అనుమానాస్పద ట్రాన్‌జాక్షన్స్ గమనించిన వెంటనే చర్యలు తీసుకోవాలని సూచించారు.

సైబర్ మోసాలకు గురైన వారు హెల్ప్‌లైన్‌ నంబర్‌ 1930కి కాల్‌ చేయవచ్చు లేదా www.cybercrime.gov.in వెబ్‌సైట్‌లో ఫిర్యాదు చేయవచ్చు. అత్యవసర పరిస్థితుల్లో సైబర్‌ క్రైమ్‌ పోలీసులను 8712665171 నంబర్‌ ద్వారా సంప్రదించవచ్చు. “ఏ బ్యాంకు కానీ, ఏ కొరియర్ సంస్థ కానీ ఎప్పుడూ లింక్‌లు క్లిక్ చేయమని లేదా వ్యక్తిగత వివరాలు అడగవు. ప్రజలు అప్రమత్తంగా ఉండి తమ సమాచారాన్ని రక్షించుకోవాలి” అని సైబర్ క్రైమ్ అధికారులు స్పష్టం చేశారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…