
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ కాంగ్రెస్ నేత కంజర్ల విజయలక్ష్మి యాదవ్ సమాజానికి హితమైన సందేశం ఇచ్చారు. ప్రజలతో కలిసిమెలిసి పాలన సాగిస్తున్న సీఎం రేవంత్ రెడ్డి నిండునూరేళ్లు ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో ప్రజల ఆశీర్వాదాల మధ్య సేవ చేయాలని ఆకాంక్షించారు. సనత్‌నగర్ డివిజన్ శ్యామలకుంటలో శనివారం కంజర్ల విజయలక్ష్మి యాదవ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో సీఎం రేవంత్ రెడ్డి పుట్టినరోజు వేడుకలను వినూత్నంగా నిర్వహించారు. మంత్రి అజారుద్దీన్ ప్రధాన అతిథిగా హాజరై చిన్నారులతో కలిసి ఈ వేడుకల్లో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా శిథిలావస్థలో ఉన్న అంగన్వాడీ సెంటర్‌ను స్వచ్ఛందంగా మోడరన్ రూపంలో తీర్చిదిద్దారు. రంగురంగుల అలంకరణలతో, కొత్త సదుపాయాలతో మెరుగైన వాతావరణంలో చిన్నారులు “హ్యాపీ బర్త్‌డే రేవంత్ మామ!” అంటూ ఉత్సాహంగా శుభాకాంక్షలు తెలిపారు. కేక్ కట్ చేస్తూ, పిల్లలతో నవ్వులు పంచుకుంటూ నాయకులు మమకారభరిత వాతావరణాన్ని సృష్టించారు.
ప్లెక్సీలు, హోర్డింగులు, ఆర్భాటాలు లేకుండా.. సేవాత్మకంగా జరిపిన ఈ వేడుక ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. అనంతరం చిన్నారులకు బొమ్మలు, తినుబండారాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో సనత్‌నగర్ కాంగ్రెస్ ఇన్‌ఛార్జ్ కోట నీలిమ, స్థానిక నాయకులు, కార్యకర్తలు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. ఇలా అంగన్వాడీ సెంటర్‌లో జరిపిన ఈ వేడుక అందర్నీ ఆలోచింపజేసింది. నేతలు ప్లెక్సీలు ఏర్పాటు చేసి.. అనవసర ఖర్చు చేసే బదులు ఇలా చేస్తే సమాజానికి ఉపయోగపడుతుంది పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.
Anganwadi Modernization