Rain Alert: అలర్ట్.. తెలుగు రాష్ట్రాల్లోని ఈ ప్రాంతాల్లో పిడుగులతో కూడిన వర్షాలు.. శనివారం వెదర్ రిపోర్ట్

తెలుగు రాష్ట్రాల్లో నైరుతి రుతుపవనాల ప్రభావంతో వర్షాలు కొనసాగనున్నాయి. తెలంగాణలోని పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి భారీ వర్షాలు, ఉరుములు, మెరుపులతో కూడిన ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. కొన్ని జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఆంధ్రప్రదేశ్‌లోనూ కోస్తా, రాయలసీమ ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది.

Rain Alert: అలర్ట్.. తెలుగు రాష్ట్రాల్లోని ఈ ప్రాంతాల్లో పిడుగులతో కూడిన వర్షాలు.. శనివారం వెదర్ రిపోర్ట్
Rain Alert

Updated on: Jun 13, 2026 | 7:12 AM

తెలుగు రాష్ట్రాల్లో భిన్న వాతావరణం కొనసాగుతోంది. ఓ వైపు ఎండలు, మరోవైపు వర్షాలు కురుస్తున్నాయి.. నైరుతి రుతుపవనాలు విస్తరిస్తుండటంతో చాలా ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి.. ఈ తరుణంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో వాతావరణ పరిస్థితులపై వాతావరణ శాఖ కీలక అప్డేట్ ఇచ్చింది. తెలుగు రాష్ట్రాల్లో శనివారం ఈదురుగాలులతో వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. అక్కడక్కడా వడగాడ్పులు కూడా వీచే అవకాశం ఉందని పేర్కొంది. హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకారం.. రుతుపవనాలు చురుకుగా కదులుతున్నాయి.. దీనికి తోడు బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం, అరేబియా సముద్రం నుంచి బంగాళాఖాతం వరకు ద్రోణి ప్రభావంతో తెలంగాణ రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాలలో తేలికపాటి నుండి మోస్తరు, భారీ వర్షాలు, మరికొన్ని చోట్ల ఉరుములు, మెరుపులతోపాటు.. 30-40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉంది.. నాగర్ కర్నూల్, మహబూబ్ నగర్, గద్వాల, నారాయణపేట, సిద్దిపేట, సిరిసిల్ల, భువనగిరి, రంగారెడ్డి, మేడ్చల్, కరీంనగర్, సంగారెడ్డి, కామారెడ్డి జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ మేరకు కొన్ని ప్రాంతాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. అంతేకాకుండా.. ఆదిలాబాద్‌, కుమ్రంభీం ఆసిఫాబాద్‌, మంచిర్యాల, నిర్మల్‌, నిజామాబాద్‌, జగిత్యాల, కరీంనగర్‌, పెద్దపల్లి జిల్లాల్లో ఎండ తీవ్రతతో వడగాడ్పులు వీచే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది.

ఆంధ్రప్రదేశ్‌లో సైతం వర్షాలు కురుస్తాయని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. నైరుతి రుతుపవనాలు మరింత ముందుకు సాగడానికి అనుకూలమైన పరిస్థితులు ఏర్పడ్డాయని.. దీని ప్రభావంతో కోస్తాంధ్రా, రాయలసీమ ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. శనివారం కొన్ని చోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. దక్షిణ కోస్తా ఆంధ్ర మరియు పరిసర ప్రాంతాలపై తుఫాను వలయం కొనసాగుతోందని APSDMA MD ప్రఖర్ జైన్ తెలిపారు. దీని ప్రభావం కారణంగా, శనివారం బాపట్ల, పల్నాడు, మార్కాపురం, ప్రకాశం, నెల్లూరు, రాయలసీమ జిల్లాల్లో ఉరుములతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. అలాగే మిగతా జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. గంటకు 40-50 కిమీ వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకుని అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

హైదరాబాద్‌లో మరోసారి వర్షం

హైదరాబాద్‌లో మరోసారి వర్షం దంచికొట్టింది. నిన్న రాత్రి 8 గంటలకు మొదలైన వర్షంతో నగరంలోని పలు ప్రాంతాలు జలమయమ్యాయి. భారీ వర్షం, ఈదురుగాలులతో కొన్ని చోట్ల ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. పలు ప్రాంతాల్లో వర్షపు నీరు నిలిచిపోవడంతో వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. చందానగర్‌, జేఎన్టీయూ, జీడిమెట్ల, అమీర్‌పేట, జూబ్లీహిల్స్‌, నాంపల్లి, అబిడ్స్, బషీర్‌బాగ్‌, మియాపూర్, కేపీహెచ్‌బీ, సనత్‌నగర్‌, బోరబండ, పంజాగుట్ట, కోఠి, మలక్‌పేట, సరూర్‌నగర్‌, చంపాపేట, నారాయణగూడ ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది.

Follow Us