
మాజీ ఎమ్మెల్యే షకీల్ కొడుకు రాహిల్ కేసులో పలువురు పోలీస్ అధికారులకు ఉచ్చు బిగుస్తోంది. పరోక్షంగా షకీల్ కొడుకు దుబాయ్ వెళ్లేందుకు సహకరించడం, కేసు నుంచి తప్పించుకోవడంలో కీలక పాత్ర పోషించిన సీఐ ప్రేమ్ కుమార్, పంజాగుట్ట మాజీ సీఐ దుర్గరావ్‌పై కేసు నమోదైంది. ఈ కేసులో పోలీసులు లోతుగా దర్యాప్తు చేసి మరిన్ని ఆధారాలు సేకరిస్తున్నారు. గత నెల 23 రాత్రి మూడు గంటల సమయంలో అతివేగంగా దూసుకెళ్లిన కారు ప్రజాభవన్ వద్ద ట్రాఫిక్ డివైడర్, బారీకేడ్లను ఢీకొట్టింది. ఆ రోజు రాత్రి విధుల్లో ఉన్న పంజాగుట్ట ఇన్‌స్పెక్టర్ దుర్గారావు ఘటనాస్థలానికి వెళ్లారు. ఆ కారును బోధన్ మాజీ ఎమ్యెల్యే షకీల్ తనయుడు సాహిల్ నడిపినట్టు గుర్తించారు.
ప్రమాద సమయంలో కారులో నలుగురు ప్రయాణిస్తున్నట్టు ధ్రువీకరించారు. కారు నడిపిన సాహిల్‌ను తన కారులో ఎక్కించుకుని పంజాగుట్ట పోలీస్‌స్టేషన్‌కు చేరారు. బ్రీత్ ఎనలైజర్‌తో నిందితులను పరీక్షించేందుకు పక్కనే ఉన్న ట్రాఫిక్ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. అక్కడ పోలీసులు కన్నుగప్పి సాహిల్ తప్పించుకున్నాడు. నిందితుడు సాహిల్‌ను తప్పించేందుకు అప్పటి పంజాగుట్ట ఇన్‌స్పెక్టర్ దుర్గారావు పూర్తిగా సహకరించినట్టు బయటపడింది. ప్రజాభవన్, పంజాగుట్ట పోలీస్‌స్టేషన్ వద్ద సీసీటీవీ కెమెరాల ఫుటేజ్‌ను పరిశీలించిన పోలీసు ఉన్నతాధికారులు దీన్ని ధృవీకరించారు. అంతర్గత విచారణలోనూ దుర్గారావు కేసును పక్కదారి పట్టించటమే కాకుండా, నిందితులను మార్చేందుకు పలువురితో ఫోన్‌లో మంతనాలు జరిపినట్టు నిర్దారించారు. ఆయన వద్ద స్వాధీనం చేసుకున్న సెల్‌ఫోన్లలో లభించిన కాల్‌డేటా ఆధారంగా బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్, బోధన్ ఇన్‌స్పెక్టర్ ప్రేమ్‌కుమార్, మరో ఇద్దరితో మాట్లాడినట్టు ఆధారాలు సేకరించారు. బోధన్ ఠాణా ఇన్‌స్పెక్టర్‌గా ఉన్న ప్రేమ్‌కుమార్, పంజాగుట్ట ఇన్‌స్పెక్టర్ దుర్గారావు మధ్య జరిగిన ఒప్పందంతో నిందితులను తారుమారు చేసినట్టు రుజువైంది. దీంతో కేసును తారుమారు చేసేందుకు ప్రేమ్‌కుమార్ జోక్యం చేసుకున్నాడనే ఆధారాలతో అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. మరోవైపు పంజాగుట్ట మాజీ ఇన్‌స్పెక్టర్ దుర్గారావుపైన పోలీసులు కేసు నమోదు చేశారు. దీంతో దుర్గారావును అదుపులోకి తీసుకునే అవకాశం ఉంది.
కాగా దుబాయ్‌లో ఉన్న ప్రధాన నిందితుడు సాహిల్, మాజీ ఎమ్మెల్యే షకీల్ కోసం ఇప్పటికే లుక్‌ఔట్ నోటీసులు జారీ చేశారు. ప్రమాదం జరిగిన రోజు పంజాగుట్ట పోలీసుల నుంచి తప్పించుకున్న సాహిల్ ముంబై చేరాడు. అక్కడి నుంచి దుబాయ్ పారిపోయాడు. అసలు నిందితుడిని తప్పించేందుకు మహారాష్ట్రకు చెందిన డ్రైవర్ అబ్దుల్ ఆసిఫ్‌ను పంజాగుట్ట ఠాణాకు పంపి కేసు నమోదు చేయించాడు. పశ్చిమ మండలం డీసీపీ విజయ్‌కుమార్ చేపట్టిన దర్యాప్తులో ఇన్‌స్పెక్టర్ ఉద్దేశపూర్వకంగా ప్రధాన నిందితుడిని మార్చి కేసును పక్కదారి పట్టించినట్టు నిర్దారించారు. విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన పంజాగుట్ట ఇన్‌స్పెక్టర్ దుర్గారావును సస్పెండ్ చేశారు. ఆయనపై ఇప్పటికే కేసు నమోదు అయ్యింది. అతడిని అదుపులోకి తీసుకునే అవకాశం ఉంది. మరోవైపు దుబాయ్ పారిపోయేందుకు సాహిల్‌కు సహకరించిన అరసబ్, సోహెల్, అసిద్‌లను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. తాజాగా నిజామాబాద్ ఇన్‌స్పెక్టర్ ప్రేమ్‌కుమార్, అబ్దుల్‌వాహె పేర్లు కూడా చేరటంతో నిందితుల సంఖ్య ఎనిమిదికి చేరింది.