
ఉప్పల్ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో డిసెంబర్ 13న మెస్సీ టూర్ అండ్ లైవ్ ఈవెంట్ జరగనుంది. అలాగే ఈ ఈవెంట్‌కు సీఎం రేవంత్ రెడ్డి సహా పలువురు ప్రముఖులు కూడా రానున్నారు. ఈ నేపథ్యంలో అక్కడికి జనం భారీగా తరలివచ్చే అకాశం ఉండడంతో నగరంలో ట్రాఫిక్ డైవర్షన్స్ అమల్లోకి తెచ్చారు హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు. ఈ ఆంక్షలు మధ్యాహ్నం 12 గంటల నుంచి రాత్రి 11:50 వరకు అమల్లో ఉండనున్నాయి.
నగరంలో భారీ వాహనాల డైవర్షన్స్
ఈవెంట్ కోసం వచ్చే వారు ఇక్కడే పార్క్ చేసుకోవాలి
ఇక ఈవెంట్ కోసం 10 ప్రధాన పార్కింగ్ జోన్‌లు ఏర్పాటు చేశారు అధికారులు. స్టేడియం బయట 1 కిమీ పరిధిలో 9 పార్కింగ్‌లు ప్రజల కోసం అందుబాటులో ఉండగా.. స్టేడియం లోపల, కేవలం VVIP/VIP పాస్ హోల్డర్లు కోసం 1 పార్కింగ్ పెట్టారు. వాలిడ్ పాస్ లేకుండా EK మినార్, LG గోడౌన్ చెక్‌పోస్టుల దాటి వాహనాలను అనుమతి లేదని చెబుతున్నారు అధికారులు. సాధారణ ప్రజల కోసం పెంగ్విన్, TGIALA, లిటిల్ ఫ్లవర్ జూనియర్ కాలేజ్, మున్సిపల్ గ్రౌండ్ ఉప్పల్–హబ్సిగూడ మార్గంలో పార్కింగ్ ప్లేసులు ఉన్నాయి.
జైన్ పార్కింగ్, శాండ్ అడ్డా, మోడర్న్ బేకరీ, ఈనాడు ఆఫీస్, వాసు ఫార్మా వద్ద ఉప్పల్–రామంతాపూర్ మీదుగా వచ్చేవారు పార్క్ చేసుకోవచ్చు. ఈవెంట్ కోసం రాచకొండ పోలీసులు సెక్యూరిటీ, ట్రాఫిక్, లా అండ్ ఆర్డర్, మౌంటెడ్ పోలీస్, వజ్ర, ఫైర్ ఫోర్స్ తదితర విభాగాల సహకారంతో 2,500 మంది సిబ్బందిని మోహరించారు. గేట్ నెం.1 కేవలం ప్లేయర్లు, VVIPలకు మాత్రమే. ప్రేక్షకులు తమ టికెట్లలో పేర్కొన్న గేట్ల ద్వారా మాత్రమే ప్రవేశం ఉంటుంది. స్టేడియం పరిసరాల్లో, చెక్‌పాయింట్ల వద్ద, పార్కింగ్ ప్రాంతాల్లో కలిపి 450 CCTV కెమెరాలు ఏర్పాటు చేశారు.
క్యూఆర్ కోడ్ స్కాన్ చేసిన తర్వాత ఒక్కసారే ప్రవేశం
క్యూఆర్ కోడ్ స్కాన్ చేసిన తర్వాత ఒక్కసారే ప్రవేశం ఉంటుంది. తరువాత ప్రింటెడ్ బార్‌కోడ్ పాస్ జారీ చేస్తారు. పాస్‌లు లేకుండా రావాలని చూస్తే క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని పోలీసులు హెచ్చరించారు. ల్యాప్‌టాప్‌లు, బ్యాగులు, వాటర్ బాటిల్స్, కెమెరాలు, మ్యాచ్‌బాక్స్‌లు, లైటర్లు, పెన్‌లు, హెల్మెట్‌లు, పరిమళాలు, పదునైన వస్తువులు, బైనాక్యులర్స్ మొదలైనవి స్టేడియంలోకి అనుమతించబడవు.సాయంత్రం 4 గంటల నుంచే ప్రేక్షకులకు ప్రవేశం ఉంటుంది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.