భార్యభర్తల మధ్య మొదలైన కొద్దిపాటి వివాదాలు ప్రాణాలు కూడా తీసుకునే పరిస్థితులకు దారి తీస్తున్నాయి. భార్య అనుమానించిందని భర్త, భర్త మందలించాడని భార్య తీవ్ర మనస్తాపంతో కుంగిపోతున్నారు. అదే మనోవేదనతో కొన్ని సందర్భాల్లో బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. ఫలితంగా వారిపై ఆధారపడ్డ చిన్నారులు, వృద్ధ తల్లిదండ్రులు అనాథలుగా మిగిలిపోతున్నారు. తాజాగా హైదరాబాద్‌లో అటువంటి సంఘటనే చోటు చేసుకుంది.
ముషీరాబాద్ గాంధీనగర్ లో విషాదం చోటుచేసుకుంది. భర్త అవమానించాడని వివాహిత శిరీష ఆత్మహత్యకు పాల్పడింది. నల్లగా ఉండే శిరీష తెల్లగా మారిపోయిందని భర్త కామెంట్ చేశాడట.. అదే పెద్ద అవమానంగా భావించింది శిరీష. అవమాన భారంతో ఇంటి నుంచి వెళ్లిపోయింది. అంతే, నిన్న బీబీ నగర్ రైల్వే ట్రాక్ పై శిరీష మృతదేహం కనిపించింది. శిరీషకు ఆరు నెలల క్రితమే వివాహమైంది. ఈనెల 15న శిరీష కనిపించడం లేదంటూ భర్త వినయ్ ఫిర్యాదు చేశాడు. అదనపు కట్నం కోసం భర్తే వేధించాడని శిరీష తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.