16ఏళ్లకే పెళ్లి.. అడుగడుగునా కష్టాలు.. డాన్సర్ రేణుక జీవితంలో ఇంత విషాదం ఉందా..

చిన్న వయసులో ప్రేమ, పెళ్లి, భర్త వేధింపులు, ఒంటరితనం, నమ్మిన వారి మోసం... వరుస విషాదాలు డాన్సర్ రేణుక జీవితాన్ని ఛిన్నాభిన్నం చేశాయి. లంగర్‌హౌస్‌లో హోటల్ గదిలో ఆత్మహత్య చేసుకున్న ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. కాల్ డేటా ఆధారంగా పలువురిని విచారిస్తూ, ఆమె మరణానికి దారితీసిన పరిస్థితులపై అన్ని కోణాల్లో దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

16ఏళ్లకే పెళ్లి.. అడుగడుగునా కష్టాలు.. డాన్సర్ రేణుక జీవితంలో ఇంత విషాదం ఉందా..
Hyderabad Dancer Renuka Suicide

Updated on: Jul 05, 2026 | 9:42 AM

తెలిసీ తెలియని వయసు.. ఆకర్షణ ప్రేమగా మారింది.. కానీ.. ఆమె అర్థం చేసుకోలేకపోయింది.. చిన్న తనంలోనే ప్రేమ.. పెళ్లి.. గర్భం దాల్చడంతో.. పిల్లలు వద్దని భర్త వారించాడు.. దీంతో పేగు బంధం కోసం తపించి.. బయటకు వచ్చి జీవించింది.. ఈ క్రమంలో.. బిడ్డ పుట్టడం, ఆ తర్వాత ఎదురైన గడ్డు పరిస్థితులు.. ఇలా అన్ని కూడా ఆమె జీవితాన్ని చిన్నాభిన్నం చేశాడు.. చివరకు ఆత్మహత్య చేసుకుని.. జీవితాన్ని ముగించింది. ఈ విషాద ఘటన హైదరాబాద్ లో చోటుచేసుకుంది. లంగర్‌హౌస్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని గ్రాండ్‌ లాడ్జీలో శనివారం రాత్రి జరిగిన డ్యాన్సర్ రేణుక (26) ఆత్మహత్య కేసు తీవ్ర కలకలం రేపింది. తెలియని వయసులో ప్రేమ, భర్త వేధింపులు, ఒంటరితనం, నమ్మిన వారి చేతిలో మోసపోవడంతో మనస్తాపానికి గురైన ఆమె చివరకు బలవన్మరణానికి పాల్పడింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేయగా, ఆమె జీవితంలో ఎదుర్కొన్న విషాదకరమైన నిజాలు, గుండె తరుక్కుపోయే విషయాలు వెలుగులోకి వచ్చాయి.

చిన్ననాటి నుంచే కష్టాల జీవితం

అల్వాల్‌ ప్రాంతానికి చెందిన రేణుక ప్రాథమిక విద్యనభ్యసిస్తున్న సమయంలోనే కొన్ని కారణాల వల్ల చదువు ఆపేసింది. ఆ తర్వాత ఒక హోటల్‌లో పనిచేస్తున్న తరుణంలో, పాతబస్తీకి చెందిన శివ అనే వ్యక్తితో పరిచయం ఏర్పడింది. పదేళ్ల క్రితం ఆ పరిచయం కాస్తా ఆకర్షణగా మారి, అది ప్రేమ అనుకుని ఇద్దరూ వివాహం చేసుకున్నారు. పెళ్లయిన కొన్నాళ్లకు రేణుక గర్భం దాల్చింది. అయితే, భర్త శివ ఆమెను వేధించడం ప్రారంభించాడు. ‘‘నాకు ఇప్పుడే పిల్లలు వద్దు, అబార్షన్‌ చేయించుకోవాలి. పిల్లలు ఉంటే నేను నీతో కలిసి జీవించలేను’’ అని తేల్చి చెప్పాడు. కానీ, రేణుక పెళ్లి బంధం కంటే తన కడుపున పుట్టబోయే బిడ్డ (పేగుబంధం) ముఖ్యమని భావించింది. భర్త మాటను ఎదిరించి, అతనికి దూరమైంది. ప్రస్తుతం ఆమెకు ఎనిమిదేళ్ల బాబు ఉన్నాడు. తల్లిదండ్రులు కూడా ఆమెను దూరం పెట్టడంతో బాబుతో కలిసి అప్పటినుంచి ఒంటరిగా జీవిస్తోంది.

పబ్బులో డ్యాన్సర్‌గా ఉద్యోగం – కొత్త పరిచయాలు

కొడుకును పోషించుకోవడం కోసం రేణుక గత నాలుగేళ్లుగా కూకట్‌పల్లిలోని ఒక పబ్బులో డ్యాన్సర్‌గా పనిచేస్తోంది. ఈ క్రమంలో పబ్బుకు తరచూ వచ్చే గోల్కొండ ప్రాంతానికి చెందిన ఫారూఖ్‌ (35) అనే వ్యక్తితో ఆమెకు పరిచయం ఏర్పడింది. ఒంటరిగా ఉంటున్న రేణుకకు ఆసరాగా ఉంటానని నమ్మిస్తూ ఫారూఖ్‌ ఆమెకు బాగా దగ్గరయ్యాడు. ఇద్దరూ తరచూ కలుస్తుండేవారు.. అయితే, సన్నిహితులు, స్నేహితులు తనను కేవలం వాడుకుని మోసం చేస్తున్నారనే విషయం తెలిసి రేణుక తీవ్ర మానసిక వేదనకు గురైంది. నేను ఈ మానసిక బాధను భరించలేకపోతున్నాను, త్వరలోనే ఆత్మహత్య చేసుకుంటాను.. అంటూ తన చుట్టూ ఉన్నవారితో తరచూ చెబుతుండేది.

అయితే, జులై 2వ తేదీ గురువారం ఉదయం రేణుక, ఫారూఖ్‌ కలిసి లంగర్‌హౌస్‌లోని హోటల్‌ గ్రాండ్‌ లాడ్జీలో ఒక గదిని అద్దెకు తీసుకున్నారు. ఇద్దరూ కలిసి అక్కడ మద్యం సేవించారు. రాత్రి 10.30 గంటల సమయంలో ఫారూఖ్‌ హోటల్‌ గది నుండి బయటికి వెళ్లిపోయాడు. ఆ తర్వాత గదిలో ఒంటరిగా ఉన్న రేణుక అర్ధరాత్రి 12.30 గంటలకు తన స్నేహితురాలు సత్యవాణికి ఫోన్ చేసింది. తాను ఆత్మహత్య చేసుకుంటున్నట్లు చెప్పగా, రేణుక ఎప్పుడూ ఇలానే మాట్లాడుతుందని సత్యవాణి సీరియస్‌గా తీసుకోలేదు. వెంటనే రేణుక వీడియో కాల్ చేసి.. నేను చనిపోతున్నాను.. అంటూ గదిలోని ఫ్యాన్‌ను చూపించింది. దాంతో భయపడిపోయిన సత్యవాణి వెంటనే వారి ఉమ్మడి స్నేహితుడైన ఫారూఖ్‌కు ఫోన్ చేసి విషయం చెప్పింది. ఫారూఖ్‌ హుటాహుటిన హోటల్ గదికి వెళ్లి చూసేసరికి రేణుక ఫ్యాన్‌కు ఉరేసుకుని నిర్జీవంగా కనిపించింది.

ఏడుగురు అనుమానితులు..

సమాచారం అందుకున్న లంగర్‌హౌస్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసిన పోలీసులు ఫారూఖ్‌ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. పోలీసుల ప్రాథమిక విచారణలో రేణుక ఫారూఖ్‌తోనే కాకుండా మరో ఏడుగురు వ్యక్తులతో కూడా సన్నిహితంగా ఉన్నట్లు కాల్ డేటా ఆధారంగా తేలింది. ఒంటరితనాన్ని ఆసరాగా చేసుకుని ఆమెను ఎవరైనా బ్లాక్‌మెయిల్ లేదా మానసిక వేధింపులకు గురిచేశారా అనే కోణంలో పోలీసులు ఆ ఏడుగురిని కూడా విచారిస్తున్నారు. అలాగే, కీలక సాక్షి అయిన స్నేహితురాలు సత్యవాణి నుండి మరిన్ని వివరాలు రాబట్టేందుకు పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. కాగా.. డాన్సర్ రేణుక జీవితం అర్థాంతరంగా ముగిసిపోవడంతో.. కొడుకు అనాథగా మిగిలాడు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us