AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అడుగంటిన జలాశయాలు.. హైదరాబాద్‌లో డిసెంబర్‌ వరకే నీటి సరఫరా

అడుగంటిన జలాశయాలు.. హైదరాబాద్‌లో డిసెంబర్‌ వరకే నీటి సరఫరా

Phani CH
|

Updated on: Nov 02, 2026 | 2:50 PM

Share

హైదరాబాద్‌లో తాగునీటి కొరతపై ఆందోళన పెరుగుతోంది. మంజీరా, సింగూరు జలాశయాల్లో కలిపి ప్రస్తుతం కేవలం 10 శాతం నీటి నిల్వలే ఉన్నట్లు నివేదికలు చెబుతున్నాయి. వర్షాలు కురిసి పరిస్థితి మెరుగుపడకపోతే నీటి సరఫరాపై మరిన్ని ఆంక్షలు విధించే అవకాశం ఉంది. చివరి ప్రత్యామ్నాయంగా మూడు రోజులకోసారి నల్లా నీటిని సరఫరా చేసే ప్రణాళికను జలమండలి పరిశీలిస్తున్నట్లు సమాచారం. గోదావరి నీటిని వినియోగించుకునేలా పైపులైన్ల అనుసంధాన పనులు కూడా చేపడుతున్నారు.

హైదరాబాద్‌లో వాటర్‌ ఎమర్జెన్సీ తప్పదా?.. నీటి కష్టాలు ఇప్పుడే మొదలవుతున్నాయా?.. రిజర్వాయర్లలో తగ్గుతున్న నీటి నిల్వలు హైదరాబాద్‌ జలమండలికి టెన్షన్‌ పుట్టిస్తున్నాయా?.. సంక్రాంతిలోపు వర్షాలు కురిసి పరిస్థితి మెరుగుపడకపోతే.. నీటి సరఫరాపై ఆంక్షలు విధించడం ఖాయమా?.. లాస్ట్‌ అప్షన్‌గా.. నల్లా నీళ్లు మూడు రోజులకోసారి సప్లయ్‌ చేసేందుకు జలమండలి ప్లాన్‌ చేస్తోందా?.. ఎల్‌నినో ప్రభావంతో వర్షాలు సరిగా కురవక, నగర దాహార్తిని తీర్చే ప్రధాన జలాశయాలు అడుగంటిపోతున్నాయి. ముఖ్యంగా మంజీరా, సింగూరు జలాశయాల్లో నీటి నిల్వలు ప్రమాదకర స్థాయికి పడిపోయాయి. దీంతో నగరంలోని దాదాపు తొమ్మిది నియోజకవర్గాల్లో తాగునీటి ఎద్దడి తలెత్తే తీవ్ర ముప్పు పొంచి ఉంది. సరఫరా పరిస్థితులను బట్టి చూస్తే సింగూర్ జలాశయం ద్వారా ప్రస్తుత డిమాండ్‌ను మరో 23 రోజులు మాత్రమే సాధారణంగా తీర్చవచ్చని, అత్యవసరంగా డెడ్ స్టోరేజ్ నీటిని తోడినా డిసెంబర్ 10 వరకు మాత్రమే సరఫరా పొడిగించవచ్చని నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. ఈ గండం నుంచి నగర ప్రజలను గట్టెక్కించేందుకు రాష్ట్ర ప్రభుత్వం, జలమండలి అత్యవసర ప్రత్యామ్నాయ ప్రణాళికలతో రంగంలోకి దిగాయి. హైదరాబాద్‌ నగర పరిధిలోని దాదాపు 1.32 కోట్ల జనాభాకు, 14.50 లక్షల వాటర్ కనెక్షన్ల ద్వారా ప్రతిరోజూ దాదాపు 560 మిలియన్ గ్యాలన్ల తాగునీటిని సరఫరా చేస్తున్నారు. దీనికోసం ప్రధానంగా ఉస్మాన్‌సాగర్, హిమాయత్‌సాగర్ జంట జలాశయాలతో పాటు కృష్ణా, గోదావరి, మంజీరా, సింగూరు ప్రాజెక్టులపై నగరం ఆధారపడి ఉంది. అయితే ప్రస్తుత ఎల్‌నినో పరిస్థితులు ఆశనిపాతంగా మారాయి. సింగూరు జలాశయం గరిష్ఠ నిల్వ సామర్థ్యం 29.91 టీఎంసీలు కాగా, ప్రస్తుతం అక్కడ అందుబాటులో ఉన్నది కేవలం 3.029 టీఎంసీలు మాత్రమే. ఇక మంజీరా పరిస్థితి మరింత ఘోరంగా ఉంది. 1.50 టీఎంసీల సామర్థ్యానికి గాను కేవలం 0.19 టీఎంసీల నీరు మాత్రమే మిగిలింది. అంటే ఈ రెండు ప్రధాన జలాశయాల్లో కలిపి కేవలం 10 శాతం నీరు మాత్రమే నిల్వ ఉంది. నీటి ఆవిరి, పైపులైన్ లీకేజీలు పోను ఈ నీటిని అతికష్టం మీద మరొక 60 రోజులు మాత్రమే సరఫరా చేయవచ్చని జలమండలి అధికారులు ప్రభుత్వానికి సమర్పించిన నివేదికలో స్పష్టం చేశారు. ముంచుకొస్తున్న నీటి గండాన్ని తట్టుకునేందుకు జలమండలి ముందస్తుగా జంట జలాశయాల నీటి సరఫరాలో కోత విధించింది. ఉస్మాన్‌సాగర్, హిమాయత్‌సాగర్‌లలో ఉన్న నీటిని రాబోయే 360 రోజులకు సరిపోయేలా ప్లాన్ చేసింది. సాధారణంగా ఈ జంట జలాశయాల నుంచి ప్రతిరోజూ 40 ఎంజీడీల నీటిని సరఫరా చేయాల్సి ఉండగా, ప్రస్తుత సంక్షోభం దృష్ట్యా దానిని 27 ఎంజీడీలకు తగ్గించారు. అలాగే చాలా ప్రాంతాల్లో ప్రతిరోజూ కాకుండా రెండు రోజులకు ఒకసారి, అది కూడా కేవలం 40 నుంచి 45 నిమిషాల పాటు మాత్రమే నీటిని విడుదల చేస్తున్నారు. హైదరాబాద్ నగరంలోని మొత్తం 22 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 9 నియోజకవర్గాలు మంజీరా, సింగూరు పైపులైన్ల వ్యవస్థపైనే ఆధారపడి ఉన్నాయి. ఈ ప్రాంతాల్లో ఇప్పటికే భూగర్భ జలాలు అడుగంటిపోవడంతో నీటి కొరత మొదలైంది. శేరిలింగంపల్లి ఐటీ కారిడార్, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ పరిధిలో భూగర్భ జలాలు పూర్తిగా పడిపోవడంతో ప్రైవేటు, జలమండలి వాటర్ ట్యాంకర్లకు విపరీతంగా డిమాండ్ పెరిగింది. కూకట్‌పల్లి, ఖైరతాబాద్, జూబ్లీహిల్స్, సనత్‌నగర్, కార్వాన్, రాజేంద్రనగర్, కుత్బుల్లాపూర్, పటాన్‌చెరు నియోజకవర్గ పరిధిలోని ప్రధాన ప్రాంతాలపై ఎక్కువ ప్రభావం పడుతుంది. మరోవైపు మిషన్ భగీరథ పరిధిలోని సింగూరు నీటిమట్టం తగ్గడంతో ఎల్లారెడ్డి, జుక్కల్, బాన్సువాడ, బోధన్ నియోజకవర్గాలకు కూడా రోజు విడిచి రోజు మాత్రమే బల్క్ నీటి సరఫరా చేయాలని నిర్ణయించారు. నగరానికి నీటి గండం పొంచి ఉండటంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉన్నతాధికారులతో సమీక్షించి, ప్రత్యామ్నాయ ఏర్పాట్లను యుద్ధప్రాతిపదికన ముమ్మరం చేయాలని ఆదేశించారు. మంజీరా పైపులైన్లు ఉన్న ప్రాంతాలను ‘గోదావరి ఫేజ్-1’ వ్యవస్థతో కనెక్ట్ చేయడమే ప్రస్తుతం ఉన్న ఏకైక మార్గంగా అధికారులు గుర్తించారు. గోదావరికి కీలక ఆధారమైన ఎల్లంపల్లి రిజర్వాయర్‌లో ప్రస్తుతం 20.17 టీఎంసీల సామర్థ్యానికి గాను 17.703 టీఎంసీల నీరు నిల్వ ఉంది. ప్రస్తుతం ఇక్కడి నుంచి హైదరాబాద్‌ నగరానికి రోజుకు 163 ఎంజీడీల నీరు అందుతోంది. ఎల్లంపల్లిలోని నీటిని సాగు అవసరాలకు పరిమితం చేసి, కేవలం తాగునీటి అవసరాలకే కేటాయిస్తే వచ్చే వేసవి పూర్తయ్యే వరకు హైదరాబాద్‌ను కాపాడుకోవచ్చని నిపుణులు భావిస్తున్నారు. ప్రస్తుతం మంజీరా పైపులైన్లను గోదావరి సరఫరా వ్యవస్థకు అనుసంధానించే పనులు వేగంగా జరుగుతున్నాయి. రాబోయే రెండు నెలల్లో ఈ పనులు పూర్తయితే, డిసెంబర్ తర్వాత తలెత్తే ప్రమాదాన్ని విజయవంతంగా ఎదుర్కోవచ్చు. రానున్న నీటి సంక్షోభం నేపథ్యంలో ప్రజలు కూడా భాధ్యతాయుతంగా వ్యవహరించాలని అధికారులు కోరుతున్నారు. తాగునీటిని వాహనాలు కడగడానికి, తోటలకు పారించడానికి అస్సలు వాడవద్దని, ఇళ్లలో ప్రతీ బొట్టు నీటిని పొదుపుగా వాడుకోవాలని సూచిస్తున్నారు. వర్షపు నీటి నిల్వ పద్ధతులు, ప్రత్యామ్నాయ నీటి వినియోగాన్ని అలవాటు చేసుకోవాలి. ప్రభుత్వ యంత్రాంగం అనుసంధాన పనులను వేగవంతం చేస్తూనే, ప్రజల సహకారంతో ఈ నీటి సంక్షోభం నుంచి భాగ్యనగరాన్ని గట్టెక్కించేందుకు తీవ్రంగా శ్రమిస్తోంది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

సోలార్ వెలుగులతో స్వయం సమృద్ధి దిశగా అంకోల్ క్యాంపు

పక్షవాతం అన్నాడు… ఇంజెక్షన్ అనగానే లేచి పరుగెత్తాడు!

చెట్టుపై ఆకులమధ్య అలజడి.. పరిశీలించి చూడగా వెన్నులో వణుకు!

బాణసంచా రహిత దీపావళిపై అవగాహన.. రంగంలోకి విరాట్‌ కోహ్లీ..

జాతివైరం మరిచిన మూగజీవాలు.. ఎంత స్నేహంగా ఉన్నాయో చూడండి

Follow Us