
హైదరాబాద్ నగరంలోని అంబర్‌పేట ప్రాంతంలో కలుషిత నీటి ప్యాకెట్ల తయారీపై పోలీసులు కఠిన చర్యలు చేపట్టారు. అక్రమంగా నడుస్తున్న వాటర్ ప్యూరిఫికేషన్ యూనిట్లపై మంగళవారం దాడులు నిర్వహించి భారీ స్థాయిలో అక్రమాలు వెలుగులోకి తెచ్చారు. సమాచారం మేరకు.. బాపునగర్ ప్రాంతంలో అనుమతి లేకుండా నడుస్తున్న మూడు నీటి శుద్ధి కేంద్రాలపై అంబర్‌పేట టాస్క్ ఫోర్స్ పోలీసులు ఆకస్మికంగా దాడులు నిర్వహించారు. ఈ సందర్భంగా పరిశీలించగా ప్యాకెట్లలో నింపుతున్న నీరు కలుషితంగా ఉన్నట్లు అధికారులు గుర్తించారు. అనారోగ్యకర పరిస్థితుల్లో యూనిట్లు నిర్వహిస్తూ ప్రజల ఆరోగ్యంతో ఆటలాడుతున్నట్లు వెల్లడైంది. దాడుల్లో పెద్ద ఎత్తున నీటి ప్యాకెట్లు స్వాధీనం చేసుకున్నారు. నమూనాలను సేకరించి పరీక్షల కోసం పంపించినట్లు పోలీసులు తెలిపారు.
ఈ వ్యవహారంలో జబేర్, జావేద్, నయీం, జునైద్ అనే నలుగురిని అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. ఈ సందర్భంగా అంబర్‌పేట ఇన్‌స్పెక్టర్ తరుణ్ కుమార్ మాట్లాడుతూ.. భద్రతా ప్రమాణాలు పాటించకుండా, అవసరమైన అనుమతులు లేకుండా ఇలాంటి యూనిట్లు నిర్వహిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ప్రజల ఆరోగ్యానికి ముప్పు కలిగించే కార్యకలాపాలను ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోమని స్పష్టం చేశారు. ఇప్పటికే పలు యూనిట్లను సీజ్ చేసి, మరిన్ని అనుమానాస్పద కేంద్రాలపై కూడా తనిఖీలు కొనసాగుతున్నాయని తెలిపారు. నగరంలో అక్రమంగా నడుస్తున్న వాటర్ ప్లాంట్లపై మరింత కఠిన చర్యలు తీసుకునే దిశగా పోలీసులు కసరత్తు చేస్తున్నారు.