గంజాయి.. ఇప్పుడు యువతను నిర్వీర్యం చేస్తున్న మత్తు మందు. పెద్ద ఎత్తున యువత గంజాయికి బానిస అయినట్లు నివేదికలు చెబుతున్నాయి. గంజాయి పెంపకం, అక్రమ రవాణా, వినియోగాన్ని అడ్డుకునేందుకు.. తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు కఠిన చర్యలు తీసుకుంటున్నాయి. జైల్లో వేసి.. పరివర్తన తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు పోలీసులు. అయినా కొందరిలో మార్పు రావడం లేదు. ఎన్ని కేసులు పెడుతున్నా అస్సలు భయం కలగడం లేదు. తాజాగా ఓ యువకుడు పోలీస్ స్టేషన్ ముందే గంజాయి తాగాడు. ఆ తతంగాన్ని వీడియో తీసి ఇన్ స్టాలో పెట్టాడు. ఇప్పుడు ఊచలు లెక్కబెడుతున్నాడు.
రాంగోపాల్‌పేట పోలీస్‌స్టేషన్ ఎదురుగా రోడ్డుపై గంజాయి తాగుతూ వీడియో చిత్రీకరించిన 25 ఏళ్ల వంశీ కృష్ణను అరెస్ట్ చేశారు పోలీసులు. ఇన్‌స్టాగ్రామ్ రీల్ కోసం బ్యాక్‌గ్రౌండ్‌లో ర్యాప్ సాంగ్‌తో ఈ వీడియోను రికార్డ్ చేశాడు. పెద్ద గొప్పలు పోతూ ఆ వీడియోను ఇన్ స్టాలో షేర్ చేశాడు. అది కాస్తా తక్షణమే వైరల్ అయ్యింది. కొందరు నెటిజన్లు.. వంశీపై నిప్పులు చెరిగారు. అతడిపై యాక్షన్ తీసుకోవాలని కోరుతూ.. సీఎం రేవంత్ రెడ్డిని, హైదరాబాద్ సిటీ పోలీసులను ట్యాగ్ చేశారు.
దీంతో రంగంలోకి దిగిన రాంగోపాల్‌పేట పోలీసులు కేసు నమోదు చేసి వంశీ కృష్ణను శుక్రవారం అరెస్టు చేశారు. అతడిని కోర్టు ముందు హాజరుపరచగా, ఎనిమిది రోజుల సాధారణ జైలు శిక్ష విధించారు న్యాయమూర్తి. దీంతో వంశీని చంచల్‌గూడలోని సెంట్రల్ జైలుకు తరలించారు. పోలీసులు వంశీ పీఎస్ ముందు గంజాయి తాగుతున్న వీడియోకు , అతడిని జైలుకు తరలించిన దృశ్యాలను యాడ్ చేసి.. సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేశారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..