Hyderabad: నల్లాలకు బిగిస్తున్న మోటార్లపై GHMC ఉక్కుపాదం.. ఎన్ని సీజ్ చేశారంటే..?

అసలే ఎండ.. ఆపై నీటికి కటకట. ఈ పరిస్థితుల్లో పొరిగింటికి వెళ్లాల్సిన నీళ్లను కూడా కాజేస్తున్న దొంగల్ని పట్టుకుంటోంది జీహెచ్‌ఎంసీ. నల్లాలకు బిగిస్తున్న మోటార్లపై ఉక్కుపాదం మోపుతోంది. స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తూ అనేక మోటార్లు స్వాధీనం చేసుకుంటోంది. పూర్తి వివరాలు తెలుసుకుందాం పదండి...

Hyderabad: నల్లాలకు బిగిస్తున్న మోటార్లపై GHMC ఉక్కుపాదం.. ఎన్ని సీజ్ చేశారంటే..?
Motors

Updated on: Apr 26, 2025 | 9:48 PM

హైదరాబాద్ మహానగరంలో అడుగంటిపోతున్న భూగర్భ జలాలు ప్రమాదగంటికలు మోగిస్తున్నాయి. బోర్లు ఎండిపోతున్న ప్రాంతాల్లోనే అత్యధికంగా నల్లాలకు అక్రమంగా మోటర్లు ఫిట్ చేసి నీటిని తోడేస్తున్నారు. ఈ కారణంగా మిగత ప్రాంతాలకు తాగునీరు చేరడం గగనం అయిపోయింది. దీంతో నల్లాలకు అక్రమ మోటార్ల వ్యవహారంపై జలమండలి చేపట్టిన స్పెషల్ డ్రైవ్‌ పలువురి గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తోంది. నల్లాకు మోటార్‌ పెట్టారా మాడు పగిలిపోద్ది అన్న రేంజ్‌లో డ్రైవ్‌ నడుస్తోంది…!

ఈనెల 15నుంచి ఇప్పటివరకు నల్లాలకు అక్రమంగా మోటార్లను బిగించి తాగునీటిని తోడేస్తున్న 700 మోటార్లను అధికారులు సీజ్ చేశారు. దాదాపు 900 మందిపై కేసులు నమోదు చేశారు. ఈ స్పెషల్ డ్రైవ్ లో కింది స్థాయి అధికారుల నుంచి పైస్థాయి వరకూ అందరూ పాల్గొంటున్నారు. జలమండలి ఎండి అశోక్ రెడ్డి సైతం పలు ప్రాంతాల్లో గత పది రోజులుగా ఆకస్మిక తనిఖీలు చేపడుతున్నారు. అందరికీ తాగునీరు అందించాలంటే అక్రమవాడకాలపై కఠిన చర్యలు తప్పవంటున్నారు. తనిఖీల ద్వారా ప్రజలను భయబ్రాంతులకు గురిచేయడం తమ లక్ష్యం కాదని…. వినియోగదారుల్లో అవగాహన కల్పించడమే తన ఉద్దేశమన్నారు. ఇప్పటినుంచైనా పద్దతి మార్చుకోకపోతే మున్ముందు తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు. అలాగే నీటి సమస్యలకు సంబంధించిన ఏవైనా ఫిర్యాదులుంటే పానీయాప్‌ ద్వారా తెలియజేయాలన్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..