
తెలంగాణ ప్రభుత్వం ప్రజలకు సంక్రాంతికి బంపర్ ఆఫర్ ఇస్తోంది. సంక్రాంతి పండుగ సందర్భంగా హైదరాబాద్ నుంచి ఆంధ్రా వైపు వెళ్లే ప్రయాణికులకు ఊరటనిచ్చేందుకు తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం దిశగా అడుగులు వేస్తోంది. పండుగ సమయంలో అత్యంత రద్దీగా ఉండే హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారిపై మూడు, నాలుగు రోజుల పాటు టోల్ వసూళ్లను నిలిపివేయాలని రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఆలోచన చేశారు. హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్లే వాహనాలకు జనవరి 9వ తేదీ నుంచి 14వ తేదీ వరకు అలాగే విజయవాడ నుంచి హైదరాబాద్ తిరిగి వచ్చే వాహనాలకు జనవరి 16వ తేదీ నుంచి జనవరి 18వ తేదీల్లో టోల్ మినహాయింపు ఇవ్వాలని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీకి, NHAIకు లేఖ రాశారు మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి..
ప్రతి ఏటా సంక్రాంతికి హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారిపై పంతంగి, కొర్లపహాడ్, చిల్లకల్లు టోల్ ప్లాజాల వద్ద వాహనాలు కిలోమీటర్ల మేర బారులు తీరుతుంటాయి. ఫాస్టాగ్ ఉన్నప్పటికీ లక్షల సంఖ్యలో వాహనాలు రావడంతో గంటల తరబడి నిరీక్షించాల్సి వస్తోంది. ప్రస్తుతం ఈ హైవేపై ఫ్లైఓవర్లు, అండర్‌పాస్‌లు, విస్తరణ పనులు జరుగుతుండటంతో ట్రాఫిక్ సమస్య మరింత తీవ్రమయ్యే అవకాశముంది. టోల్ వసూళ్ల కోసం వాహనాలను ఆపితే హైవే మొత్తం స్తంభించిపోయే ప్రమాదం ఉండటంతో సంక్రాంతి టోల్ ఫ్రీ ప్రయాణానికి అనుమతివ్వాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని సమాచారం.
అయితే.. తెలంగాణ ప్రభుత్వం టోల్ చార్జెస్ మినహాయించాలని కోరడంపై.. కేంద్ర ప్రభుత్వం, NHAI ఏ విధంగా స్పందిస్తాయనేది చర్చనీయాంశంగా మారింది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..