
Hyderabad: హైదరాబాద్‌లో ఓ జెప్టో డెలివరీ ఏజెంట్‌కు ఎదురైన ఘటన సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. ఆర్డర్ డెలివరీ చేసేందుకు వెళ్లిన సమయంలో అతడి బైక్‌ను ట్రాఫిక్ పోలీసులు సీజ్ చేసినట్లు తెలుస్తోంది. తన బైక్‌ను తీసుకెళ్లకుండా వదిలేయాలని.. కనీసం ఆర్డర్ డెలివరీ చేసి వెళ్లేందుకు అనుమతించాలని ఆ డెలివరీ ఏజెంట్ పోలీసులను వేడుకున్నాడు. శుక్రవారం ఆగస్టు 28న ఈ ఘటన జరిగినట్లు సమాచారం. రోడ్డుపక్కన బైక్‌ను పార్క్ చేసి డెలివరీ చేసేందుకు వెళ్లిన సమయంలో ట్రాఫిక్ పోలీసులు వాహనాన్ని టోయింగ్ వాహనంలో తరలిస్తున్నట్లు వీడియోలో కనిపిస్తోంది.
దీంతో డెలివరీ ఏజెంట్ పోలీసుల వద్దకు పరుగెత్తుకుంటూ వెళ్లి తన పరిస్థితిని వివరించాడు.’ప్లీజ్ సార్.. నేను ఆర్డర్ డెలివరీ చేసి వెళ్లిపోతాను. నా భార్య ఆస్పత్రిలో ఉంది’ అంటూ పోలీసులను వేడుకున్నాడు. అయితే వాహనాన్ని తిరిగి ఇవ్వడం సాధ్యం కాదని.. పోలీస్ స్టేషన్‌కు వచ్చి తీసుకెళ్లాలని అధికారులు చెప్పినట్లు వీడియోలో వినిపిస్తోంది. దీంతో వాహనం తరలిస్తున్న టోయింగ్ వాహనాన్ని ఆపేందుకు డెలివరీ ఏజెంట్ ప్రయత్నించాడు. ఈ సమయంలో టోయింగ్ వాహనంలో ఉన్న ఓ పోలీసు అధికారి తలుపు తెరిచి అతడిని పక్కకు నెట్టినట్లు వీడియోలో కనిపిస్తోంది. ఈ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పోలీసుల తీరుపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
ఇది కూడా చదవండి: Success Story: ఒకే దుకాణం.. నాలుగు వ్యాపారాలు.. నెలకు రూ.4 లక్షల ఆదాయం.. గ్రాడ్యుయేట్ సక్సెస్ సీక్రెట్ ఇదే!
ఈ ఘటనపై పలువురు సోషల్ మీడియా వినియోగదారులు పోలీసుల తీరును తప్పుబడుతున్నారు. చిన్న తప్పిదానికి ఫైన్ వేసి నిబంధనల ప్రకారం చర్యలు తీసుకోవచ్చని.. కానీ ఇబ్బందుల్లో ఉన్న వ్యక్తి పరిస్థితిని కూడా పరిగణనలోకి తీసుకోవాలని పలువురు కామెంట్లు చేస్తున్నారు.
“ప్రజలపై అధికారం చూపించకుండా.. ముందు మనిషిగా స్పందించాలి” అంటూ ఓ నెటిజన్ వ్యాఖ్యానించాడు. మరో వ్యక్తి.. రాజకీయ పలుకుబడి, ఖరీదైన వాహనాలు లేని సామాన్యులపైనే పోలీసులు తమ ప్రతాపం చూపిస్తారని విమర్శించాడు.
అయితే, ఈ ఘటనకు సంబంధించి ట్రాఫిక్ పోలీసుల పూర్తి వివరణ ఇంకా వెలువడాల్సి ఉంది. బైక్‌ను ఏ నిబంధనల కింద సీజ్ చేశారు? డెలివరీ ఏజెంట్ చెప్పిన అత్యవసర పరిస్థితిని అధికారులు ఎందుకు పరిగణనలోకి తీసుకోలేకపోయారు? అనే అంశాలపై స్పష్టత రావాల్సి ఉంది. ప్రస్తుతం వైరల్ వీడియో ఆధారంగా పోలీసుల తీరుపై సోషల్ మీడియాలో తీవ్ర చర్చ జరుగుతోంది.
ఇది కూడా చదవండి: Gold Price: సెప్టెంబర్‌లో బంగారం ధరలు ఎలా ఉండబోతున్నాయి? నిపుణుల అంచనా ఇదే..!