
వాహనాదారులకు అలర్ట్.. కేబీఆర్ పార్క్ చుట్టూ మరోసారి వన్‌వే ట్రయల్ రన్ నిర్వహించేందుకు హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు సిద్ధమయ్యారు. ఇప్పటికే నిర్వహించిన ట్రయల్ రన్ సక్సెస్ కావడంతో ఈ ఆదివారం పూర్తి రోజంతా సెకండ్ రౌండ్ ట్రయల్ రన్ చేపట్టబోతున్నట్లు ట్రాఫిక్ అడిషనల్ సీపీ జోయల్ డేవిస్ తెలిపారు. డ్రోన్లు, సీసీ కెమెరాల నిఘాలో మొదటి విడత ఫలితాలను విశ్లేషించిన అధికారులు.. ఈసారి మరింత పక్కాగా వన్‌వేను పరిశీలించనున్నారు. ఈ ఆదివారం జరిగే ట్రయల్ రన్‌లో భాగంగా కేబీఆర్ పార్క్, క్యాన్సర్ ఆసుపత్రి, ఒరిస్ ఐలాండ్, ఫిలింనగర్, జర్నలిస్ట్ కాలనీ, రోడ్ నెంబర్ 45, చెక్‌పోస్ట్ పరిసరాల్లోని వన్ వే మాత్రమే ఉంటుంది. ఫిలింనగర్ రోడ్ నెంబర్ 45 దగ్గర ఉన్న యూ-టర్న్‌లను పూర్తిగా క్లోజ్ చేయనున్నారు.
జూబ్లీహిల్స్ కేబీఆర్ పార్క్ పరిసరాల్లో ట్రాఫిక్ సమస్యల పరిష్కారానికి జీహెచ్ఎంసీ చేపట్టిన స్టీల్ ఫ్లైఓవర్, అండర్‌పాస్ నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి. అందులో భాగంగా ట్రాఫిక్ డైవర్షన్స్ ట్రయల్ రన్ నిర్వహించనున్నారు పోలీసులు. ఈ వీకెండ్ ఫుల్ డే ట్రయల్ రన్ కూడా సక్సెస్ అయితే.. వచ్చే వారం నుంచి ఈ వన్‌వే విధానాన్ని సిటీలో పూర్తిస్థాయిలో అమల్లోకి తెచ్చేందుకు కసరత్తు చేస్తున్నట్లు అడిషనల్ సీపీ స్పష్టం చేశారు. ముఖ్యంగా, పీక్ టైమ్‌లో ట్రాఫిక్ సమస్యలున్న 45 జంక్షన్లను గుర్తించి, వాటి పరిష్కారానికి తగిన చర్యలు తీసుకుంటున్నారు.
ప్రస్తుతం హైదరాబాద్ లోని కేబీఆర్ పార్క్ ఏడు ఫ్లై ఓవర్లు, ఏడు అండర్ పాస్‌ల నిర్మాణ పనులు జరుగుతున్న నేపథ్యంలో ఈ వన్ వే నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. అయితే.. గతంలో మొదటి ట్రయల్ రన్ సమయంలో ఎదురైన ట్రాఫిక్ ఇబ్బందులను అధిగమించేందుకు, అలాగే.. సరికొత్త ప్రణాళికతో ఈ ట్రయిల్ రన్ నిర్వహించనున్నారు. రెండో విడత ట్రయల్ రన్ కోసం దాదాపు 150 మంది ట్రాఫిక్ సిబ్బంది క్షేత్రస్థాయిలో విధులు నిర్వర్తించనున్నారు. అయితే, ఈ ట్రయల్ రన్ తర్వాత, మరోసారి సమీక్ష నిర్వహిచి.. కేబీఆర్ పార్క్ చుట్టూ వన్ వే విధానాన్ని అమల్లోకి తీసుకురానున్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..