Hyderabad Student Ragging: హైదరాబాద్‌లో మరోసారి జడలు విప్పుతోన్న వికృత క్రీడ.. వైరల్ వీడియోతో పరారీలో రాగింగ్ రాక్షసులు..

|

Nov 13, 2022 | 11:58 AM

హైదరాబాద్‌లోని ఇండియన్‌ బిజినెస్‌ స్కూల్‌ ఐబీఎస్‌లో జరిగిన ఓ ఘటన విద్యావ్యవస్థలో వేళ్ళూనుకొంటోన్న అనారోగ్యకర ఆటవిక చర్యలకు అద్దం పడుతోంది. రంగారెడ్డి జిల్లా శంకర్‌పల్లి మండలం దొంతనపల్లి గ్రామ శివారులోని..

Hyderabad Student Ragging: హైదరాబాద్‌లో మరోసారి జడలు విప్పుతోన్న వికృత క్రీడ.. వైరల్ వీడియోతో పరారీలో రాగింగ్ రాక్షసులు..
Hyderabad Student Ragging
Follow us on

ర్యాగింగ్‌ వికృతత్వం మరో మారు జడలు విప్పుతోంది. ఉన్నత విద్యావ్యవస్థని చెదపురుగులా తొలుస్తోంది. రెక్కలు ముక్కలు చేసుకొని పట్టణాల్లో చదువుకోసం పల్లెల నుంచి తరలివిచ్చిన ఎందరో విద్యార్థులు ఆధునికత్వం ముసుగులో జరుగుతోన్న భయానక ర్యాగింగ్‌ భూతానికి బలౌతున్న పరిస్థితి మరోసారి హడలెత్తిస్తోంది. తాజాగా హైదరాబాద్‌లోని ఇండియన్‌ బిజినెస్‌ స్కూల్‌ ఐబీఎస్‌లో జరిగిన ఓ ఘటన విద్యావ్యవస్థలో వేళ్ళూనుకొంటోన్న అనారోగ్యకర ఆటవిక చర్యలకు అద్దం పడుతోంది. రంగారెడ్డి జిల్లా శంకర్‌పల్లి మండలం దొంతనపల్లి గ్రామ శివారులోని ప్రతిష్టాత్మక IBS కాలేజీలో ర్యాగింగ్‌ పేరుతో ఓ విద్యార్ధిని.. చితకబాదిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఓ విద్యార్థిని రూమ్‌లో బంధించి.. కొందరు సీనియర్ విద్యార్థులు చితకబాదారు.

పిడిగుద్దులు గుద్దుతూ.. తీవ్రంగా గాయపర్చారు. ముఖం మీద పౌడర్ చల్లి తీవ్రంగా కొట్టారు. ఆ తరువాత దాడి చేసిన విద్యార్ధులపై మరో వర్గం దాడి చేసింది. ఈ ర్యాగింగ్ విషయం పోలీస్ స్టేషన్‌కు చేరడంతో.. ఇరు వర్గాలను మందలించి పంపించారు. తీవ్రంగా కొట్టిన దెబ్బలకు తాళలేక బాధిత విద్యార్థి విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పడంతో ..బెంబేలెత్తిపోయిన విద్యార్థి తల్లిదండ్రులు క్యాంపస్‌ నుంచి తమ కొడుకుని తీసుకెళ్ళిపోయారు.

తనకు జరిగిన అన్యాయంపై బాధిత విద్యార్థి ఐటీ శాఖా మంత్రి కేటీఆర్‌కి ఫిర్యాదు చేయడంతో ర్యాగింగ్‌ రచ్చ బయటకొచ్చింది. . దీనిపై తక్షణమే స్పందించిన కేటీఆర్‌ ఈ ఘటనకు బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాల్సిందిగా సీపీ స్టీఫెన్‌ రవీంద్రకు సూచించారు. విద్యావ్యవస్థలో ఆరోగ్యకర వాతావరణాన్ని కలుషితం చేస్తూ ర్యాగింగ్‌ భూతం జడలువిప్పుతోంది.

మరోవైపు ఈ విషయం చేయిదాటిపోతుండడంతో రాకాసి ర్యాగింగ్‌ గ్యాంగ్‌లకు కళ్ళెం వేసేందుకు కాలేజీ యాజమాన్యం పావులు కదిపింది. 12 మంది విద్యార్థులను సంవత్సరం పాటు సస్పెండ్ చేసింది. క్యాంపస్‌కు చేరుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇప్పటికే 12 మంది విద్యార్థుల మీద 307 అటెంప్ట్‌ మర్డర్‌ కింద కేసు నమోదు చేశారు. అలాగే ఐపీసీ 450, 506 త్రెటనింగ్‌, ట్రెస్‌ పాస్‌ కింద కూడా కేసులు నమోదు చేశారు పోలీసులు. పరారీలో ఉన్న విద్యార్థుల కోసం గాలిస్తున్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం