హైదరాబాద్ ఎయిర్‌పోర్ట్ ఎక్స్‌ప్రెస్ మెట్రో నిర్మాణ పనులు వేగవంతమయ్యాయి. మెట్రో పిల్లర్లు, వయాడక్ట్, స్టేషన్ల నిర్మాణం, వాటి ఎత్తు ఎంత వుండాలనే విషయంలో ఈ డేటా కీలకం కానుందని హైదరాబాద్ మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డి తెలిపారు. రాయదుర్గం మెట్రో స్టేషన్ నుంచి నార్సింగి జంక్షన్ వరకు ఎయిర్‌పోర్ట్ మెట్రో మార్గాన్ని పరిశీలించారు. దాదాపు 10 కి.మీ మేర ఉన్న ఈ మార్గంలో కాలినడకన వెళుతూ ఇంజినీర్లకు, సర్వే బృందాలకు తగిన సూచనలిచ్చారు. మెట్రో స్టేషన్లు ప్రధాన రహదారి జంక్షన్‌లకు దగ్గరగా ఉండాలని సూచించారు. తెలంగాణ సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు ఎయిర్‌పోర్ట్ మెట్రో కారిడార్‌ను శివారు ప్రాంతాల అభివృద్ధికి ఉపయోగ పడేలా తయారు చేయాలన్నారు.
ఈ కారిడార్ విమానాశ్రయ ప్రయాణికులతో పాటు ఈ ప్రాంతంలో ఉండే వారందరికీ, శివార్లలో నివసించే తక్కువ ఆదాయ వర్గాల వారందరికీ ఉపయోగపడేలా ఉండాలని ఆదేశించారు. ప్రయాణికులు తాము పనిచేసే ప్రాంతాలకు కేవలం 20 నిముషాల వ్యవధిలో చేరుకునేలా ఈ కారిడార్ను డిజైన్ చేయాలని స్పష్టం చేశారు. మెట్రో స్టేషన్లకు సమీపంలో ఉన్న ప్రభుత్వ భూములను గుర్తించి ప్రయాణికుల వాహనాల పార్కింగ్ ఏరియా ఏర్పాటు చేయాలన్నారు
ఎయిర్‌పోర్టు మెట్రో విమానాశ్రయ ప్రయాణికులకు మాత్రమే కాకుండా, అందరికీ ఉపయోగపడుతుందని హెచ్‌ఎంఆర్ ఎండీ ఎన్వీఎస్ రెడ్డి తెలిపారు. స్టేషన్‌లకు సమీపంలో అందుబాటులో ఉన్న ప్రభుత్వ భూముల్లో విశాలమైన పార్కింగ్ సౌకర్యాలు కల్పించాలని సూచించారు. ఐకియా ముందు ఎయిర్‌పోర్టు మెట్రో స్టేషన్, బ్లూ లైన్ కొత్త టెర్మినల్ నిర్మాణం జరపనున్నట్టు వెల్లడించారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..