Independence Day 2022: దేశానికి స్వాతంత్రం సిద్ధించి 75 వసంతాలు పూర్తయిన సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం 15 రోజుల పాటు నిర్వహించే స్వాతంత్య్ర భారత వజ్రోత్సవం వేడుకల్లో హైదరాబాద్ నగర ప్రజలందరూ భాగస్వామ్యం కావాలని జీహెచ్ఎంసీ పిలుపునిచ్చింది. వజ్రోత్సవాల సందర్భంగా ఆగస్టు 8వ తేదీ నుండి 22వ తేదీ వరకు రోజుకొకటి ప్రత్యేక కార్యక్రమాలు రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో 15 రోజుల పాటు ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమాల్లో ప్రజాప్రతినిధులు, ప్రజలు భాగస్వాములై వజ్రోత్సవ వేడుకలను విజయవంతం చేయాలని జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేష్ కుమార్ పిలుపునిచ్చారు. భావి తరాల వారికి స్ఫూర్తి నిచ్చేలా వినూత్న ప్రక్రియలో కొనసాగుతున్న వజ్రోత్సవ వేడుకల్లో ప్రతి ఒక్కరు పాల్గొని విజయవంతం చేయాలన్నారు. ఈ నెల 8వ తేదీన రాష్ట్ర ముఖ్యమంత్రి రాష్ట్ర వ్యాప్తంగా హైదరాబాద్ లో ప్రారంభించిన విషయం మనకి తెలిసిందే.
ఈ నెల 9వ తేదీన ఇంటింటికి జాతీయ జెండా పంపిణీ..
ఈ నేపథ్యంలో ప్రజా ప్రతినిధులచే జాతీయ జెండా త్రివర్ణ పతాకంను లాంఛనంగా పంపిణీ చేస్తారు. ఇంటింటికి త్రివర్ణ పతాకం అందుకున్న తర్వాత ప్రతి ఒక్కరూ తమ తమ ఇంటి పైన తప్పనిసరిగా ఎగురవేసి జెండా గౌరవాన్ని దేశ ప్రతిష్టను మరింత పెరిగేందుకు దోహదం చేసే విధంగా కృషి చేయాలి. జాతీయ జెండా యొక్క ప్రోటోకాల్ పాటించాలి. జెండాను క్రింద గాని ఎక్కడ పడితే అక్కడ పడ వేయకుండా త్రివర్ణ పతాకం యొక్క గౌరవాన్ని కాపాడే విధంగా కృషి చేయాలి. జెండా ప్రోటోకాల్ పాటించని వారిపై క్రిమినల్ కేసులు పెట్టే అవకాశం ఉంటుంది. ఈ విషయంలో ప్రజలు జాతీయ జెండా విషయంలో ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని కోరారు. అంతే కాకుండా ఇంటింటికి స్వాతంత్య్ర భారత వజ్రోత్సవ స్ఫూర్తి నీ కలిగించేందుకు ఇంటింటి వచ్చి ఒక్కటి చొప్పున నగరంలో మొత్తం 25 లక్షల వజ్రోత్సవాల స్టిక్కర్ లను కూడా పంపిణీ చేస్తారు. తీసుకున్న ప్రతి ఒక్కరు స్టిక్కర్ ను తమ ఇంటికి తప్పని సరిగా అతికించుకోవాలి. జెండా పండుగ స్ఫూర్తి నీ కలిగించాలని కోరారు.
10వ తేదీన వన మహోత్సవం ఫ్రీడమ్ పార్క్ లలో మొక్కలను నాటుట..
జిహెచ్ఎంసి పరిధిలో కాలుష్య నివారణకు, ప్రజల జీవన ప్రమాణాలను పెంపొందించేందుకు పచ్చదనం మరింతగా పెరిగే విధంగా వివిధ పద్దతిలో విస్తృతంగా మొక్కలు నాటిన విషయం తెలిసిందే. దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 వసంతాలు పూర్తయిన నేపథ్యంలో నగరంలోని స్ఫూర్తిని కొనసాగించేందుకు 75 ప్రదేశాలలో కొత్తగా 75 ఫ్రీడమ్ పార్కులను ఏర్పాటు చేసి అట్టి పార్క్ లలో కనీసం 75 మొక్కలు లేదా 750 గాని, 7,500 మొక్కలు చొప్పున నాటుతారు. మొక్కలు నాటే కార్యక్రమం ప్రజాప్రతినిధులు ప్రారంభిస్తారు. ఈ పార్కులకు వజ్రోత్సవ స్ఫూర్తిగా గేటు కూడా ఏర్పాటు చేస్తారు.
11వ తేదీన ఫ్రీడమ్ రన్
పోలీస్ శాఖ సహకారంతో సర్కిల్ వారీగా అవసరం మేరకు కాలనీ స్థాయిలో కూడా 2k రన్ గానీ, వాక్ లు నిర్వహిస్తారు. ఈ రన్ లో ఉద్యోగులు కూడా పాల్గొనాలి. ప్రధాన కార్యాలయంలోని అధికారులు, సిబ్బంది నెక్లెస్ రోడ్డులో జరిగే ఫ్రీడమ్ 2k రన్ లో పాల్గొంటారు.
12న జాతీయ సమాఖ్య రక్ష బంధన్..
త్రివర్ణ పతాకం గల రాఖీలు వినియోగించి జాతీయ సమైక్యతకు పాటు పడాలి. ఈ విషయంలో భారత వజ్రోత్సవాకు విలువ ఇచ్చిన వారవుతారు. ఈ విషయంలో శాటి లైట్, లోకల్ ఛానళ్లలో దేశ భక్తి సంబంధించిన కార్యక్రమాలు ప్రసారం చేయాలని ప్రభుత్వం కోరింది.
13వ తేదీన ర్యాలీస్..
ఎన్.సి.సి, ఎన్.ఎస్.ఎస్ స్కౌట్స్ అండ్ గైడ్స్, విద్యార్థులు అధికారులు ప్లకార్డులతో పాటు జాతీయ పతాకంతో ర్యాలీ లు నిర్వహిస్తారు. కాలనీ స్థాయి నుండి జోనల్ స్థాయిలో పని చేసే అధికారులు సిబ్బంది తప్పనిసరిగా పాల్గొనాలి. ఈ సందర్భంగా ట్రై కలర్ బెలూన్లలను ఎగుర వేస్తారు.
14వ తేదీన జానపద కళాకారుల ప్రదర్శన..
జిహెచ్ఎంసి పరిధిలో పనిచేస్తున్న అధికారులు, సిబ్బంది జానపద కళల పై ఆసక్తి ఉన్నవారి తో ప్రధాన కార్యాలయంలో నిర్వహిస్తారు. ఆసక్తి గల వారు తమ పేర్లను సిపిఆర్ఓ కు ఈ నెల 12వ తేదీ వరకు అందజేయాలి. అంతే కాకుండా జాతీయ స్ఫూర్తి ఉట్టి పడేలా ట్యాంక్ బండ్ వద్ద ఫైర్ వర్క్స్ నిర్వహించబడును నెక్లెస్ రోడ్డు వైపు ఫైర్ వర్క్స్ ఏర్పాటు చేస్తారు.
15వ ఆగస్టు వేడుకలు ప్రధాన కార్యాలయంలో నిర్వహించబడును..
ప్రతి ఏటా జిహెచ్ఎంసి కార్యాలయం లో పంద్రాగస్టు వేడుకలు జరిగినట్లే వజ్రోత్సవం సందర్భంగా కూడా ప్రధాన కార్యాలయంలో మేయర్ జాతీయ జెండాను ఎగురవేస్తారు. అంతే కాకుండా కాలనీ వారీగా, సర్కిల్, వార్డు, జోనల్ స్థాయి లో స్వాతంత్య్ర వేడుకలు ఘనంగా నిర్వహిస్తారు.
16వ తేదీన తెలంగాణ రాష్ట్ర సామూహిక జాతీయ గీతాలాపన..
జిహెచ్ఎంసి పరిధిలో ప్రధాన కూడళ్లలో గాని జంక్షన్ లలో గానీ, పోలీస్ శాఖచే ఒకే టైంలో ఒకే సారి జాతీయ గీతం నిర్దేశించిన సమయంలో ఆలాపన జరుగుతుంది. ఆ సందర్భంలో ఎక్కడి వారు అక్కడ జాతీయ గీతాలాపన చేయాలన్నారు.
కవి సమ్మేళనం కూడా నిర్వహిస్తారు
జిహెచ్ఎంసి లో పనిచేస్తున్న అధికారులు, సిబ్బంది సామూహిక గీతాలాపన కార్యక్రమం నిర్వహించబడును.
17వ తేదీన రక్తదాన శిబిరాలు
జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి సహకారంతో జిహెచ్ఎంసి పరిధిలో నియోజకవర్గ స్థాయిలో ఈ శిబిరం నిర్వహించబడును ఈ శిబిరం లో కనీసం 75 మంది తప్పని సరిగా పాల్గొనే విధంగా చర్యలు తీసుకోవాలి. ముందుకు వచ్చిన స్వచ్ఛంద సంస్థలు ప్రోత్సహించాలన్నారు.
18వ తేదీన ఫ్రీడమ్ కప్ క్రీడలు
సాంప్రదాయ, ఆధునిక క్రీడలు నిర్వహించబడును కనీసం 10 రకాల క్రీడలు ఆటల పోటీలు నిర్వహించబడును. కబడ్డీ, ఫుట్ బాల్, వాలీ బాల్, ఖో ఖో, తదితర ఫ్రీడమ్ కప్ క్రీడలు ఒక్కొక్క స్టేడియంలో ఒక క్రీడా పోటీలు నిర్వహించబడును ఆ విధంగా 10 మైదానాలు / గ్రౌండ్ లో నిర్వహించిన క్రీడల్లో గెలుపొందిన వారికి కప్ లను అందజేస్తారు.
19వ తేదీన పేదలకు పండ్ల పంపిణీ
జిహెచ్ఎంసి నిర్వహిస్తున్న ఆయా ప్రదేశాల్లో ఉన్న నైట్ షెల్టర్లలో ఉన్న వారికి పండ్లు పంపిణీ చేస్తారు. అవసరమైతే దుప్పట్లు, ఉచితంగా భోజన సదుపాయం కల్పించబడును.
20వ తేదీన రంగోలి
కాలనీ, వార్డు, సర్కిల్ జోనల్ స్థాయి లో దేశ భక్తి థీమ్ తో రంగోలి కార్యక్రమం నిర్వహించబడును. మహిళ ఉద్యోగులు, స్వయం సహాయక సంఘాలు ఆసక్తి ఉన్నవారు రంగోలి లో కార్యక్రమంలో పాల్గొనవచ్చు. ప్రధాన కార్యాలయంలో మహిళ ఉద్యోగులచే నిర్వహించబడును.
21వ తేదీన జిహెచ్ఎంసి ప్రత్యేక సమావేశం
ప్రభుత్వం నిర్దేశించిన ప్రకారం గ్రామ పంచాయతీ నుండి మున్సిపాలిటీ తో పాటు నగర పాలక సంస్థల స్థాయి వరకు నిర్వహిస్తున్నట్లు జిహెచ్ఎంసి జనరల్ బాడీ ప్రత్యేక సమావేశం నిర్వహించబడును. కానీ ఈ సమావేశంలో ఎలాంటి ప్రశ్నోత్తరాలకు తావు ఉండదు. చైర్మన్ అనుమతితో దేశ భక్తి, స్వతంత్ర భారత వజ్రోత్సవాల సంబంధించిన అంశాల పై నే ప్రసంగించ వలసి ఉంటుంది.
22వ తేదీన ఎల్బీ స్టేడియంలో ముగింపు సమావేశం
స్వాతంత్య్ర భారత వజ్రోత్సవాలను గ్రామీణ స్థాయి నుండి పట్టణ ప్రాంతంలో వార్డు స్థాయి నుండి అదే విధంగా మండల, జిల్లా స్థాయి రాష్ట్ర స్థాయి వరకు వజ్రోత్సవ వేడుకలు నిర్వహించడం జరిగింది. ఈ నేపథ్యంలో ముగింపు సమావేశం. ఎల్ బి స్టేడియంలో జరుగుతున్న నేపథ్యంలో జిహెచ్ఎంసి పరిధిలో చేపట్టాల్సిన ముందస్తు చర్యలు రాష్ట్ర ప్రభుత్వం నిర్దేశించిన ప్రకారం గా గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో స్వతంత్ర భారత వజ్రొత్సవాలను, కాలనీ, సర్కిల్, వార్డు, జోనల్ స్థాయిలో నిర్వహించే కార్యక్రమాలతో పాటు ప్రధాన కార్యాలయం స్థాయిలో వేడుకల నిర్వహణను సమర్థవంతంగా ఘనంగా జరిగేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈ విషయంలో నగర ప్రజలు, ప్రజా ప్రతినిధులు ప్రతి ఒక్కరు పాల్గొని జాతీయ స్ఫూర్తినీ పెంపొందించేందుకు తోడ్పాటు అందించాలని జిహెచ్ఎంసి కమిషనర్ లోకేష్ కుమార్ కోరారు.
మరిన్ని తెలంగాణ వార్తలు చదవండి