Hyderabad: హైదరాబాద్‌లోని ఐటీ ఉద్యోగులకు బిగ్ రిలీఫ్.. ట్రాఫిక్ లేని ప్రయాణం.. పోలీసుల కీలక నిర్ణయమిదే..

ఐటీ ఉద్యోగులకు ప్రయోజనం చేకూరేలా ట్రాఫిక్ పోలీసులు కొత్త ఆలోచన చేస్తున్నారు. జేఎన్‌టీయూ నుంచి రాయదుర్గం మెట్రో స్టేషన్‌ వరకు ప్రత్యేక క్యారేజ్‌వే ఏర్పాటు చేసే సాధ్యాసాధ్యాలను పరిశీలిస్తున్నారు. దీని వల్ల ఐటీ ఉద్యోగులు వేగంగా తమ ఆఫీసులకు చేరుకోవచ్చు. ప్రస్తుతం పరిశీలన దశలో ఉంది.

Hyderabad: హైదరాబాద్‌లోని ఐటీ ఉద్యోగులకు బిగ్ రిలీఫ్.. ట్రాఫిక్ లేని ప్రయాణం.. పోలీసుల కీలక నిర్ణయమిదే..
Hyderaabd

Edited By:

Updated on: Sep 02, 2026 | 8:21 PM

ఐటీ కారిడార్‌లో ట్రాఫిక్‌ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపే దిశగా అధికారులు చర్యలు చేపట్టారు. మాదాపూర్‌, రాయదుర్గం ప్రాంతాల్లో రోడ్లు, ట్రాఫిక్‌ నిర్వహణ, కనెక్టివిటీపై ఐఏఎల్‌ఏ (IALA) రెండో అడ్వైజరీ కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ట్రాఫిక్‌ విభాగం జాయింట్‌ కమిషనర్‌ ఆఫ్‌ పోలీస్‌ సున్‌ప్రీత్‌ సింగ్‌ పలు కీలక సూచనలు చేశారు. ఐటీ కారిడార్‌లో రద్దీని తగ్గించడంతో పాటు వాహనదారులు, పాదచారుల భద్రతకు ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. ఐటీ కారిడార్‌లో యుటిలిటీ పనుల కోసం తరచూ రోడ్లను తవ్వుతున్నప్పటికీ.. పనులు పూర్తైన తర్వాత రోడ్లను సక్రమంగా, నాణ్యతతో పునరుద్ధరించడం లేదని ట్రాఫిక్‌ అధికారులు గుర్తించారు. దీంతో రోడ్లు unevenగా మారి ప్రమాదాలకు అవకాశం పెరుగుతోందని తెలిపారు. యుటిలిటీ పనులు పూర్తైన వెంటనే సంబంధిత సంస్థలు రోడ్లను సకాలంలో నాణ్యతతో పునరుద్ధరించాలని సూచించారు.

మరోవైపు ఓలా, ఉబర్‌ వాహనాల అనియంత్రిత పార్కింగ్‌ కూడా ట్రాఫిక్‌ రద్దీకి కారణమవుతోందని అధికారులు తెలిపారు. ఉద్యోగులను పికప్‌, డ్రాప్‌ చేసే సమయంలో రోడ్లపై వాహనాలు గుమిగూడకుండా ఐటీ సంస్థలు, ప్రధాన సంస్థలు తమ ప్రాంగణాల్లోనే పికప్‌, డ్రాప్‌ ప్రాంతాలతో పాటు ఓలా, ఉబర్‌ వాహనాల కోసం ప్రత్యేక పార్కింగ్‌ లేదా హోల్డింగ్‌ ఏరియాలను ఏర్పాటు చేయాలని సూచించారు.
ఐటీ కారిడార్‌లో రోడ్ల అభివృద్ధి, కనెక్టివిటీపై కూడా సమావేశంలో చర్చ జరిగింది. ప్రతిపాదిత రోడ్డు అభివృద్ధి ప్రణాళికను పరిశీలించిన ట్రాఫిక్‌ అధికారులు.. రహదారుల అనుసంధానం, ట్రాఫిక్‌ ప్రవాహం, వాహనాల రాకపోకలకు ఇబ్బందులు లేకుండా తీసుకోవాల్సిన చర్యలపై సూచనలు చేశారు. ఫ్రీ లెఫ్ట్‌లు, జంక్షన్ల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి పెట్టాలని నిర్ణయించారు. అవసరమైన ప్రాంతాలను గుర్తించి ఫ్రీ లెఫ్ట్‌ మార్గాలను ఏర్పాటు చేయడంతో పాటు జంక్షన్లలో ఛానలైజేషన్‌, రోడ్డు జ్యామెట్రీలో మార్పులు చేపట్టాలని సూచించారు. దీంతో జంక్షన్ల వద్ద వాహనాల వేచి ఉండే సమయం తగ్గి ట్రాఫిక్‌ మరింత సాఫీగా సాగే అవకాశం ఉందని అధికారులు పేర్కొన్నారు.

అలాగే రోడ్డు, పాదచారుల భద్రతకు ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. పాదచారుల క్రాసింగ్‌లను మెరుగుపరచడం, సురక్షిత ఫుట్‌పాత్‌లు ఏర్పాటు చేయడం, సరైన ట్రాఫిక్‌ సైన్లు, రోడ్డు మార్కింగ్‌లు, వీధి దీపాల ఏర్పాటు వంటి చర్యలు చేపట్టాలని నిర్ణయించారు. అవసరమైన ప్రాంతాల్లో ట్రాఫిక్‌ క్యాల్మింగ్‌, ఛానలైజేషన్‌ చర్యలు చేపట్టాలని సూచించారు. ఇటీవల కూడా సైబరాబాద్‌ ట్రాఫిక్‌ పోలీసులు గచ్చిబౌలి, రాయదుర్గం ప్రాంతాల్లో యూటర్న్‌లు, ఫ్రీ లెఫ్ట్‌లను పరిశీలించి ట్రాఫిక్‌ ప్రవాహాన్ని మెరుగుపరిచే మార్గాలపై దృష్టి పెట్టారు. జేఎన్‌టీయూ నుంచి రాయదుర్గం మెట్రో స్టేషన్‌ వరకు ప్రత్యేక క్యారేజ్‌వే ఏర్పాటు చేసే సాధ్యాసాధ్యాలను కూడా పరిశీలించారు.

Loading...
Unable to load recommendations.
Follow Us