Hyderabad: ప్రేమ వివాహం ఇష్టం లేకపోతే వదిలేయండి.. పరువు హత్యలపై సీపీ ఆనంద్ సీరియస్..

|

May 30, 2022 | 6:52 PM

హైదరాబాద్ నగరంలోని ఇటీవల పరువు హత్యలు జరిగిన నేపథ్యంలో సీవీ ఆనంద్ ఈ వ్యాఖ్యలు చేశారు.

Hyderabad: ప్రేమ వివాహం ఇష్టం లేకపోతే వదిలేయండి.. పరువు హత్యలపై సీపీ ఆనంద్ సీరియస్..
Cv Anand
Follow us on

Hyderabad CP CV Anand: ప్రేమ వివాహం ఇష్టం లేకపోతే వాళ్లను పట్టించుకోకుండా వదిలేయాలని.. కక్ష పెంచుకొని హత్యలకు పాల్పడితే సహించమని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ హెచ్చరించారు. పరిధి దాటితే చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని ఆనంద్ పేర్కొన్నారు. పిల్లల కదలికలపై తల్లిదండ్రులు ఎప్పటికప్పుడు నిఘా ఉంచాలని సూచించారు. చెడు వ్యసనాల బారిన పడకుండా చూడాల్సిన బాధ్యత తల్లిదండ్రులపై ఉందని.. ఎప్పటికప్పుడూ గమనిస్తూ ఉండాలని సీవీ ఆనంద్ పేర్కొన్నారు. హైదరాబాద్ నగరంలోని ఇటీవల పరువు హత్యలు జరిగిన నేపథ్యంలో సీవీ ఆనంద్ ఈ వ్యాఖ్యలు చేశారు. బేగంబజార్‌లో ఇటీవల జరిగిన నీరజ్‌ పన్వర్‌ హత్య సంచలనంగా మారిన విషయం తెలిసిందే. కాగా.. నీరజ్‌ భార్య సంజన, ఆమె కుటుంబ సభ్యులను సీపీ ఆనంద్ సోమవారం పరామర్శించి వారితో మాట్లాడారు. నీరజ్‌ పన్వర్‌ హత్య కేసులో ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేసి నిందితులకు కఠిన శిక్ష పడేలా చర్యలు చేపడుతున్నామని ఈ సందర్భంగా ఆనంద్ తెలిపారు. హత్యకు సంబంధించిన దర్యాప్తు వేగవంతంగా జరుగుతోందని.. ఆధారాలను సేకరించామని పేర్కొన్నారు. అనంతరం షాహినాయత్ గంజ్ పోలీస్ స్టేషన్‌లో బేగంబజార్‌కు చెందిన మార్వాడీ మాలీ సమాజ్, యాదవ్ సమాజ్‌కు చెందిన పెద్దలతో సమావేశమై వారితో చర్చించారు.

నీరజ్ హత్య అనంతరం ఇరు వర్గాల మధ్య భేదాభిప్రాయాలు తలెత్తి.. ఒకరిపై మరొకరు విమర్శలు చేసుకుంటున్న తరుణంలో సీవీ ఆనంద్ వారిని హెచ్చరించారు. నేటి యువత తమ ఇష్టానికి అనుగుణంగా జీవించాలని భావిస్తున్నారని.. అందులో భాగంగా కొంత మంది నచ్చిన వాళ్లను ప్రేమించి పెళ్లి చేసుకుంటున్నారని వివరించారు.. ప్రేమ వివాహం ఇష్టం లేకపోతే వాళ్లను పట్టించుకోకుండా వదిలేయాలని.. కక్ష పెంచుకొని హత్యలకు పాల్పడితే మాత్రం సహించేది లేదంటూ సీవీ ఆనంద్ హెచ్చరించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..