Hyderabad: ఇన్నోవా కారులో వచ్చి సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌ను ఎత్తుకెళ్లారు.. ఆ తర్వాత బలవంతంగా..

హైదరాబాద్‌లోని గచ్చిబౌలి, గోపన్‌పల్లి ప్రాంతంలో సాఫ్ట్‌వేర్ ఉద్యోగి శ్యామ్ నాగ్ కిడ్నాప్‌నకు గురైన ఘటన కలకలం రేపింది. కత్తితో బెదిరించి పత్రాలపై బలవంతంగా సంతకాలు చేయించుకున్నారని బాధితుడు తెలిపాడు. స్నేహితుడు 112కు సమాచారం ఇవ్వడంతో పోలీసులు రంగంలోకి దిగి అతడిని క్షేమంగా రక్షించారు. కిడ్నాప్‌కు గల కారణాలపై దర్యాప్తు కొనసాగుతోంది.

Hyderabad: ఇన్నోవా కారులో వచ్చి సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌ను ఎత్తుకెళ్లారు.. ఆ తర్వాత బలవంతంగా..
It Employee Kidnapped In Gachibowli

Updated on: Oct 26, 2026 | 10:29 AM

హైదరాబాద్ (గచ్చిబౌలి): నగరంలోని ఐటీ హబ్ గచ్చిబౌలి ప్రాంతంలో ఓ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌ కిడ్నాప్‌నకు గురైన ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. గుర్తుతెలియని ముఠా కత్తితో బెదిరించి బాధితుడిని నిర్బంధించి పత్రాలపై సంతకాలు చేయించుకున్న ఈ ఘటనపై పోలీసులు తక్షణమే స్పందించి గంటల వ్యవధిలోనే శ్యామ్ నాగ్‌ను కాపాడారు. వివరాల ప్రకారం.. అనకాపల్లికి చెందిన శ్యామ్ నాగ్ గచ్చిబౌలి ప్రాంతంలో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పనిచేస్తున్నారు. గోపన్‌పల్లి ఎన్టీఆర్ నగర్ సమీపంలో ఉండగా.. ఉన్నట్టుండి ఒక ఇన్నోవా కారులో వచ్చిన గుర్తుతెలియని వ్యక్తులు అతడిని బలవంతంగా కారులోకి ఎక్కించుకుని వెళ్లిపోయారు.. కారులోనే అతడిని నిర్మానుష్య ప్రాంతంలోని ఒక నిర్మాణ భవనంలోకి తీసుకెళ్లిన కిడ్నాపర్లు.. కత్తితో బెదిరించి కొన్ని కాగితాలు.. డాక్యుమెంట్లపై బలవంతంగా సంతకాలు చేయించుకున్నారని బాధితుడు తెలిపాడు.

స్నేహితుడి అప్రమత్తత – పోలీసుల మెరుపు చర్యలు

గోపన్‌పల్లి ఎన్టీఆర్ నగర్‌లో ఈ ఘటన జరిగగా.. శ్యామ్ నాగ్ కిడ్నాప్ విషయాన్ని గమనించిన అతని స్నేహితుడు భార్గవ్ రాజ్ ఆలస్యం చేయకుండా వెంటనే 112 అత్యవసర నంబర్‌కు ఫోన్ చేసి పోలీసులకు సమాచారం అందించాడు.

సమాచారం అందుకున్న గచ్చిబౌలి పోలీసులు వెంటనే రంగంలోకి దిగి, సాంకేతిక పరిజ్ఞానం, సీసీటీవీ ఫుటేజీల ఆధారంగా గాలించి బాధితుడి ఆచూకీని కనిపెట్టారు. కిడ్నాపర్ల బారి నుండి శ్యామ్ నాగ్‌ను క్షేమంగా రక్షించి, కుటుంబసభ్యులకు అప్పగించారు.

ఈ ఘటనపై బాధితుడి ఫిర్యాదు మేరకు గచ్చిబౌలి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కిడ్నాప్‌నకు గల ఆర్థిక లేదా వ్యక్తిగత కారణాలేంటి? నిందితులు ఎవరు? అనే కోణంలో పోలీసులు ప్రస్తుతం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు.

కాగా.. ఈ ఘటన హైదరాబాద్ నగరంతోపాటు.. అనకాపల్లిలో సంచలనంగా మారింది.

Loading...
Unable to load recommendations.
Follow Us